టీడీపీలో చేరడం పై ఏబీవీ సంచలన వ్యాఖ్యలు !
మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయాలలో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఆయన రాజకీయాల పట్ల ఆసక్తి కనబరుస్తూ వివిధ వేదికల మీద ప్రసంగాలు చేస్తున్నారు.
By: Satya P | 15 Aug 2026 10:30 PM ISTమాజీ పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయాలలో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఆయన రాజకీయాల పట్ల ఆసక్తి కనబరుస్తూ వివిధ వేదికల మీద ప్రసంగాలు చేస్తున్నారు. అనేక చర్చా వేదికల మీద మాట్లాడుతున్నారు. ఆయన ఏపీలో థర్డ్ ఫ్రంట్ ని ఏర్పాటు చేయాలని కూడా తపన పడుతున్నారు. నిజానికి అది సెకండ్ ఫ్రంట్ అని కూడా అంటున్నారు. అధికార టీడీపీ కూటమి విపక్ష వైసీపీ రెండూ ఒక్కటే అని కూడా ఈ మధ్య జరిగిన ఒక రౌండ్ టేబిల్ సమావేశంలో ఏబీవీ కీలక వ్యాఖ్యలు చేసి అందరికీ ఆశ్చర్య పరచారు. ఏపీలో రాజకీయ శూన్యత ఉందని అందువల్ల భావ సారూప్యం కలిగిన వారంతా కలసి ఒక వేదికగా ముందుకు రావాలని ఆయన కోరుకుంటున్నారు.
టీడీపీ ముద్ర మీద :
ఇదిలా ఉంటే ఏబీ వెంకటేశ్వరరావు అంటే ఆయన పక్కా టీడీపీ మనిషి అని బలమైన ముద్ర ఉందని ప్రచారం ఉంది. దాని మీద ఆయన తాజాగా ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మీద ఎందుకు ఆ ముద్ర ఉందో తెలియదు అని అంటూ తాను తటస్థుడినే అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే తనలో రాజకీయ ఆసక్తి మెండు అని చెప్పుకున్నారు. తాను పదవీ విరమణ తరువాత రాజకీయాల్లోకి రావాలని ముందే అనుకున్నాను అని చెప్పారు. ఇక తాను టీడీపీలో చేరాలని అనుకున్నది కూడా నిజం అని ఎవరికీ తెలియని ఒక తెర వెనక నిజాన్ని ఆయన రివీల్ చేశారు.
వద్దు అని అనుకున్నారా :
ఏబీవీ టీడీపీలో చేరాలని ప్రయత్నం చేసినపుడు ఆ వైపు నుంచి ఆశించిన స్పందన రాలేదని అంటున్నారు. 2024 ఎన్నికల ముందే టీడీపీలో చేరి పోటీ చేయాలని ఆయన చూశారని అంటున్నారు. అయితే ఎందుకో సానుకూలంగా స్పందన రాకపోవడంతో ఆగిపోయానని స్వయంగా ఆయనే చెప్పారు. ఆ తరువాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తాను బ్యాక్ ఎండ్ లో ఉంటూ ప్రభుత్వం పార్టీ తరఫున పనిచేయాలని అనుకున్నపుడు కూడా ఆశించిన స్పందన అయితే రాలేదని అంటున్నారు. దాంతోనే తాను సొంతంగా రాజకీయ వేదిక కోసం చూడాల్సి వచ్చిందని అన్నారు. టీడీపీలో చేరేందుకు తనకు ఎందుకు చాన్స్ రాలేదో తెలియదని అన్నారు. బహుశా మాజీ బ్యూరోక్రాట్లతో ఎందుకు అనుకున్నారో తెలియదని అన్నారు.
ప్రజలకు మేలు చేయాలనే :
సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా తాను ఏదైనా మేలు చేయగలనా ఆలోచించి రాజకీయాల వైపు అడుగులు వేశాను అన్నారు. తన జీవిత కాలంలో సమాజాన్ని ఇక అంగుళం ప్రగతి వైపు నడిపించినా ధన్యమే అని ఆయన అన్నారు. అందుకే ఈ దిశగా తన కార్యాచరణను సిద్ధం చేసుకున్నాను అని ఆయన చెప్పారు. దానిని బట్టి ఒక ఆసక్తితో ఒక నిబద్ధతతోనే ఏబీవీ రాజకీయాల వైపు వచ్చారని అర్ధం అవుతోంది అని అంటున్నారు.
ఆ పదవి వద్దనేనా :
ఇక ఏబీవీకి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చింది. నామినేటెడ్ పోస్టు అయిన ఈ పదవిని ఏబీవీ ఎందుకు వద్దు అనుకున్నారు అంటే దానికి కూడా ఆయన వద్ద జవాబు ఉంది. తన ఆలోచనలకు ఆ పదవి సరిపడదనే సున్నితంగా వద్దు అనుకున్నాను అని చెప్పారు. అంత మాత్రం చేత ఆ పదవి చిన్నది అయితే కాదని తాను రాజకీయంగా మరింత ఎక్కువగా ప్రజలతో మమేకం కావాలని భావిస్తూ ఉండడం వల్లనే కాదు అనుకుని వచ్చేశాను అన్నారు. మొత్తానికి ఏబీవీ ఆలోచనలు చూస్తే ఏపీ రాజకీయాల్లో కీలకమైన భూమిక పోషించాలని ఆలోచిస్తున్నారు అని అర్ధం అవుతోంది. మరి ఆయన ఆశిస్తున్న థర్డ్ ఫ్రంట్ ఏ విధంగా ఉండబోతోంది అన్నది చూడాల్సి ఉంది.
