Begin typing your search above and press return to search.

ఏబీవీ దెబ్బకు దిగి వచ్చిన ప్రభుత్వం.. రిటైర్డ్ ఐపీఎస్ తొలి విజయం

రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) విమర్శలతో ప్రభుత్వం దిగి వచ్చింది. తప్పు ఎత్తి చూపితే సవరించుకుంటామని సంకేతాలిచ్చిందని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   30 Sept 2026 8:00 PM IST
ఏబీవీ దెబ్బకు దిగి వచ్చిన ప్రభుత్వం.. రిటైర్డ్ ఐపీఎస్ తొలి విజయం
X

రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) విమర్శలతో ప్రభుత్వం దిగి వచ్చింది. తప్పు ఎత్తి చూపితే సవరించుకుంటామని సంకేతాలిచ్చిందని అంటున్నారు. ప్రభుత్వ ప్రకటనలు, ఇతర కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించడం లేదని ఇటీవల ఏబీవీ చేసిన విమర్శలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అయితే ఈ విషయమై నేరుగా స్పందించని ప్రభుత్వం తాజాగా చేపట్టిన కార్యక్రమంలో ఆ పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. దీంతో ఏబీవీ విమర్శలు పనిచేశాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

పేదలకు పట్టాభిషేకం పేరుతో విశాఖ, విజయవాడ తదితర ప్రధాన పట్టణాల్లో ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి శాశ్వత హక్కులు కల్పించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. ముందుగా విశాఖలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ సమయంలో పత్రికలకు జారీ చేసిన ప్రకటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ తోపాటు మంత్రి లోకేశ్ ఫొటోలను వేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా ఏబీవీ ప్రశ్నలు సంధించారు. ప్రోటోకాల్ పాటించాల్సిన ప్రభుత్వం మంత్రులను కూడా పక్కన పెడుతున్నట్లు సంకేతాలిస్తోందని విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి ఫొటో వేయవచ్చని, కానీ పవన్, లోకేశ్ ఫొటోలు ఏ విధంగా వేస్తారని నిలదీశారు. ప్రభుత్వాన్ని మీ ముగ్గురే నడిపేయొచ్చు కదా, మిగతా మంత్రులు ఎందుకు అంటూ ప్రశ్నలు సంధించారు.

దీంతో ప్రభుత్వం ఆలోచనలో పడినట్లుగా చెబుతున్నారు. ఈ విషయంలో ఏబీవీ లేవనెత్తిన అభ్యంతరం సహేతుకమైనదని భావించిందని అంటున్నారు. ఫలితంగా విజయవాడలో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించి పత్రికలకు జారీ చేసిన ప్రకటనల్లో తొలిసారిగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫొటో వేశారని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేశ్ ఫొటోలతో మాత్రమే ప్రకటనలు ఇస్తున్నారని అంటున్నారు. కానీ ఏబీవీ విమర్శలతో ఇప్పుడు సంబంధిత మంత్రుల ఫొటో కూడా ప్రకటనల్లో ముద్రించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. దీంతో ఏబీవీ ప్రభుత్వంపై విజయం సాధించారని పరిశీలకులు చమత్కరిస్తున్నారు.

ఇక రాజకీయాలపై ఆసక్తితో కొత్త పార్టీని ప్రారంభిస్తానని గతంలో ప్రకటించిన రిటైర్డ్ పోలీసు అధికారి ఏబీవీ గత కొంతకాలంగా రాష్ట్రంలోని పలు సామాజిక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రధానంగా 22ఏ భూ సమస్యలతోపాటు ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రజాధనం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్న పలు ప్రాజెక్టులపై నిపుణులతో కలిసి గళం విప్పుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై పోరాడుతున్నారని అంటున్నారు. దీంతో ప్రభుత్వం కూడా ఏబీవీ చేసే విమర్శలపై ఓ కన్నేసినట్లు చెబుతున్నారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా గతంలో వ్యవహరించిన ఏబీవీ.. ఇప్పుడు ఎదురుతిరగటమే కాకుండా ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేలా చేస్తున్న విమర్శలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న విమర్శల్లో సహేతుకమైన అంశాలు ఉంటే ప్రభుత్వం సరిదిద్దుకోవడం ద్వారా ఆయనతో సామరస్యంగా ఉండేందుకు ప్రాధాన్యమిస్తోందని అంటున్నారు.