ఏబీవీపై కేసుల ఉపసంహరణ
రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుపై గత ప్రభుత్వం నమోదుచేసిన కేసులను ముఖ్యమంత్ర చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
By: Tupaki Desk | 16 July 2025 4:51 PM ISTరిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుపై గత ప్రభుత్వం నమోదుచేసిన కేసులను ముఖ్యమంత్ర చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఏపీ హైకోర్టు కొట్టివేసిన ఎఫ్ఐఆర్, చార్జిషీటుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సైతం ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీంతో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీకి అన్ని కేసుల నుంచి విముక్తి కలిగినట్లైంది. ఏబీవీకి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డీజీపీ హరీశ్ గుప్తాకు సూచిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ జీవోఆర్టీ నెం.1334 జారీ చేశారు.
ఏబీవీ పిటిషనుపై హైకోర్టు నిర్ణయాన్ని అంగీకరిస్తూ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 2018లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఏబీవీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. ఆ సమయంలో నిఘా పరికరాల కొనుగోళ్లలో ఆయన అవినీతికి పాల్పడ్డారంటూ జగన్ ప్రభుత్వం 2021లో ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే తనపై చేస్తున్న ప్రచారం అంతా అబద్ధమని, అసలు పరికరాలే కొనుగోలు చేయలేదంటూ వెంకటేశ్వరరావు 2022లోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఏబీవీ వాదనలను సమర్థించింది. ఏసీబీ కేసును క్వాష్ చేసింది. అయినప్పటికీ 2024లో విజయవాడ ఏసీబీ కోర్టులో గత ప్రభుత్వ ఒత్తిడితో ఏసీబీ అధికారులు ఏబీవీపై చార్జిషీట్ దాఖలు చేశారు. హైకోర్టు క్వాష్ చేసిన తర్వాత చార్జిషీట్ చెల్లదంటూ బెజవాడ ఏసీబీ కోర్టు దాన్ని తిరస్కరించింది. అయితే ఇప్పుడు ఏబీవీపై గత ప్రభుత్వం దాఖలు చేసిన అన్ని కేసులను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ కేసులో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కూడా కొనసాగించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఏబీవీకి క్లీన్ చిట్ లభించినట్లైంది.
