Begin typing your search above and press return to search.

చంద్రబాబు చేయలేనిది.. ఏబీవీకి సాధ్యమా?

ఏబీవీకి అన్యాయం జరిగిందని కూటమి పార్టీలతోపాటు ఆయన సొంత సామాజికవర్గంలో కూడా చర్చ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   16 April 2025 2:00 AM IST
AB Venkateshwara Rao against YS Jagan
X

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పొలిటికల్ ఎంట్రీ ఆసక్తి రేపుతోంది. రిటైర్ అయిన ఏడాది తర్వాత తాను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పిన ఏబీవీ, తన అజెండా కూడా ప్రకటించారు. మాజీ సీఎం జగన్ బాధితులకు అండగా నిలుస్తానని వెల్లడించారు. ఇందుకోసం రాజకీయాల్లోకి వస్తున్నానని వివరించారు. అయితే జగన్ బాధితులకు న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండగా, ఏబీవీ ఆ బాధ్యతలు భుజానికెత్తుకోవడం ఎందుకు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు.. ఏబీవీని బూచిగా చూపి మాజీ సీఎం జగన్ ను టార్గెట్ చేయాలని చూస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

డీజీపీ స్థాయిలో రిటైర్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు 2014-19 మధ్య ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో డీజీపీ కన్నా ఏబీవీకే ఎక్కువ పవర్స్ అన్న ప్రచారం కూడా సాగింది. ఇదే సమయంలో అప్పటి ప్రతిపక్షం వైసీపీని నిర్వీర్యం చేయాలనే ప్లాన్ జరిగిందనే టాక్ ఉంది. దీనికి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీవీ పూర్తిస్థాయిలో సహకరించారని విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అప్పట్లో పార్టీ ఫిరాయింపులకు ఏబీవీనే కారణమని వైసీపీ ఆరోపించింది. దీంతో ఆ పార్టీ ఆయనను టార్గెట్ చేసుకుంది.

ఇక 2019లో అధికారం చేతుల మారాక వైసీపీ ప్రభుత్వం తొలి వేటు ఏబీవీపైనే వేసింది. అంతకుముందు ఐదేళ్లు తమ పార్టీని ముప్పతిప్పలు పెట్టిన ఏబీవీని టార్గెట్ చేస్తూ నాలుగున్నరేళ్లు ఎలాంటి పోస్టింగు ఇవ్వకుండానే ఉంచేసింది. రెండు సార్లు సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ పై సుప్రీంకోర్టు వరకు ఏబీవీ పోరాటం చేయాల్సివచ్చింది. ఇలా ఏబీవీ వర్సెస్ వైసీపీ మధ్య పోరు ఆ తర్వాత ఏబీవీ వర్సెస్ జగన్ అన్నట్లు వ్యక్తిగత స్థాయికి చేరింది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీవీకి జరిగిన ఆర్థిక నష్టాన్ని పూర్తిగా భర్తీ చేసింది. అంతేకాకుండా పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ గా కేబినెట్ హోదాలో నామినేటెడ్ పదవి కట్టబెట్టింది. అయితే తనకు జరిగిన అన్యాయంపై పోరాడాలని నిర్ణయించుకున్న ఏబీవీ.. నామినేడెట్ పదవిని స్వీకరించలేదు. దీంతో జగన్ పై ప్రతికారం తీర్చుకోవాలనే ఏకైక లక్ష్యాన్ని ఎంచుకుని రంగంలోకి దిగారంటున్నారు.

ఏబీవీకి అన్యాయం జరిగిందని కూటమి పార్టీలతోపాటు ఆయన సొంత సామాజికవర్గంలో కూడా చర్చ జరుగుతోంది. దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనంటూ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్టింగులు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఏబీవీ వ్యక్తిగత కక్షను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదంటున్నారు. దీంతో ఏబీవీనే స్వయంగా రంగంలోకి దిగాలని చూస్తున్నారు. అయితే తన చేతిలో ప్రస్తుతం ఎలాంటి అధికారం లేనందున ఏదో ఒక పార్టీలో చేరి తన లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. అయితే జగన్ పై పైచేయి సాధించేందుకు ఏబీవీ ఏం చేయగలరన్న ప్రశ్న ఆసక్తి రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో పూర్తి అధికారం ఉంది. ఆయనే జగన్ పై చర్యలకు వెనుకాడుతున్నారని వాదన వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏబీవీ ఏం చేయగలరన్న ప్రశ్న ఉదయిస్తోంది.