ఏంటి ఇలా కూడా ఆఫీసుకు వెళ్తారా.. వీళ్ల సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే!
అయితే, ప్రపంచంలోనే అత్యంత అందమైన, విభిన్నమైన నగరాల్లో ఒకటైన స్విట్జర్లాండ్‌లోని బెర్న్ నగరంలో ఉద్యోగులు ఎవరూ ఊహించని ఒక కొత్త, వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు.
By: Tupaki Desk | 1 Jun 2025 1:00 AM ISTఆఫీసులకు వెళ్లడానికి సొంత వాహనం లేకపోతే, చాలా మంది ఏం చేస్తారు.. ఏ గవర్నమెంట్ బస్సునో లేక ఆటోనో లేక క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తుంటారు. అయితే, ప్రపంచంలోనే అత్యంత అందమైన, విభిన్నమైన నగరాల్లో ఒకటైన స్విట్జర్లాండ్‌లోని బెర్న్ నగరంలో ఉద్యోగులు ఎవరూ ఊహించని ఒక కొత్త, వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. వారు తమ ఆఫీసులకు నదిలో ఈదుకుంటూ చేరుకుంటారు. ఈ వింతైన, కానీ ఆసక్తికరమైన ప్రయాణ విధానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
బెర్న్ నగరం మధ్యలో ప్రవహించే ప్రసిద్ధ 'ఆరే' (Aare) నది ఇక్కడి ప్రజల జీవనంలో ఒక భాగంగా మారిపోయింది. వేసవి కాలంలో ఈ నదిలో నీళ్లు చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ.. అదే సమయంలో ఆఫీసులకు చేరుకోవడానికి అక్కడి ఉద్యోగులు ఈ ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇది వారికి రోజువారీ రవాణా ఖర్చులను తగ్గించడమే కాకుండా, శారీరక శ్రమను (వ్యాహాయామం) అందించడంతో పాటు, వేడి నుంచి ఉపశమనాన్ని కూడా అందిస్తుంది. ఇదొక పర్యావరణ అనుకూలమైన ప్రయాణ మార్గం కూడా.
మరి ల్యాప్‌టాప్‌లు, ఫైల్స్ వంటి తమ వస్తువులను ఎలా తీసుకెళ్తారనే సందేహం రావచ్చు. దీనికి కూడా వారి దగ్గర ఒక తెలివైన పరిష్కారం ఉంది. ఉద్యోగులు తమ ల్యాప్‌టాప్‌లు, దుస్తులు, మొబైల్ ఫోన్లు, ఇతర ముఖ్యమైన వస్తువులను వాటర్‌ప్రూఫ్ బ్యాగులలో భద్రపరుచుకుంటారు. ఆ బ్యాగులను నీటిలో తేలేలా చేసి, వాటితో పాటు ఈదుకుంటూ ఆఫీసులకు వెళ్తారు. ఈత రానివారు కూడా ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. వారు ట్యూబ్‌లు (ఎయిర్ ట్యూబ్స్) లేదా రొప్స్ (తాడులు) సహాయంతో నదిలో తేలుతూ తమ ఆఫీసులకు చేరుకుంటారు.
ఇది కేవలం ఒక ప్రయాణ మార్గం మాత్రమే కాదు స్విట్జర్లాండ్ ప్రజల జీవనశైలిలో పర్యావరణ స్పృహ, ప్రకృతితో మమేకమయ్యే విధానానికి ఇది ఒక ఉదాహరణ. కాలుష్యం లేకుండా, వ్యాయామంతో కూడిన ఈ ప్రయాణం వారికి రోజువారీ ఒత్తిడిని తగ్గించి, ఉత్సాహాన్ని నింపుతుంది. 'ఈదుకుంటూ ఆఫీసుకు వెళ్లడం' అనే ఈ వినూత్నమైన ఆఫీస్ కమ్యూట్ పద్ధతి ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.. ఇది అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
