Begin typing your search above and press return to search.

రాఘవ్ చద్దాను రాజ్యసభ బాధ్యతల నుంచి తప్పించిన ఆప్.. కారణాలు ఇవే..

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో అత్యంత చురుకైన, యువ నేతగా గుర్తింపు సంపాదించుకున్నది రాఘవ్ చద్దా మాత్రమే.

By:  Tupaki Political Desk   |   2 April 2026 3:41 PM IST
రాఘవ్ చద్దాను రాజ్యసభ బాధ్యతల నుంచి తప్పించిన ఆప్.. కారణాలు ఇవే..
X

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో అత్యంత చురుకైన, యువ నేతగా గుర్తింపు సంపాదించుకున్నది రాఘవ్ చద్దా మాత్రమే. ఇటీవల చాలా విషయాలపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అయితే అతనిని రాజ్యసభ నుంచి తొలగించి ఆయన ప్లేస్ లో మరో వ్యక్తిని పార్టీ నియమించింది. రాఘవ్ చద్దా విషయంలో పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆయన్ని తొలగించడమే కాకుండా, ఆయన స్థానంలో పంజాబ్‌కు చెందిన ఎంపీ అశోక్ మిట్టల్‌ను నియమిస్తూ పార్టీ అధిష్టానం గురువారం (2 ఏప్రిల్, 2026) రాజ్యసభ సెక్రటేరియట్‌కు అధికారికంగా లేఖ రాసింది. కేవలం పదవి నుంచి తొలగించడమే కాకుండా, సభలో మాట్లాడేందుకు ఆయనకు సమయం ఇవ్వకూడదని కోరడం పార్టీ, చద్దా మధ్య ఉన్న తీవ్ర విభేదాలను బయటపెట్టింది. ఈ ఆకస్మిక మార్పు, దాని వెనుక ఉన్న రాజకీయ కోణాలను పరిశీలిస్తే..

రాఘవ్ చద్దాపై వేటు

పార్టీ అధికారికంగా ఎటువంటి బహిరంగ ప్రకటన చేయకపోయినప్పటికీ, అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం.. చద్దా, పార్టీ అగ్రనేతలకు మధ్య కొంత కాలంగా గ్యాప్ పెరిగినట్లు తెలుస్తోంది. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత, కీలకమైన పార్టీ వ్యవహారాల్లో రాఘవ్ చద్దా మౌనంగా ఉండడం అధిష్టానానికి నచ్చలేదని సమాచారం. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వంటి నేతలపై వచ్చిన కేసుల విషయంలో చద్దా మౌనంగా ఉండడం, అలాగే పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండడం క్రమశిక్షణారాహిత్యంగా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆయన ఎయిర్‌పోర్టుల్లో ఆహార ధరలు, పెటర్నిటీ లీవ్, గిగ్ వర్కర్ల హక్కుల వంటి సామాన్య ప్రజల సమస్యలపై పార్లమెంటులో గళం విప్పారు. అయితే ఇవి పార్టీ వ్యూహానికి భిన్నంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అశోక్ మిట్టల్ కు బాధ్యతలు

చద్దా స్థానంలో నియమితులైన అశోక్ మిట్టల్ పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభలో ఆప్‌కు ఉన్న 10 మంది సభ్యులలో ఏడుగురు పంజాబ్ వారే కావడంతో, పంజాబ్ నేతకే డిప్యూటీ లీడర్ హోదా ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. పార్టీ కోటా నుంచి రాఘవ్ చద్దాకు మాట్లాడే సమయం కేటాయించవద్దని రాజ్యసభ సెక్రటేరియట్‌ను పార్టీ కోరడం గమనార్హం. ఇది చద్దాను పార్టీ పార్లమెంటరీ కార్యకలాపాల నుంచి పూర్తిగా పక్కన పెట్టినట్లు సూచిస్తోంది.

రాఘవ్ చద్దా ప్రస్థానం.. ఆప్ లో కీలక పాత్ర!

2012లో ఢిల్లీ లోక్‌పాల్ బిల్లు సమయంలో అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన చద్దా, పార్టీలో అత్యంత వేగంగా ఎదిగారు. 2022లో 33 ఏళ్ల వయసులో రాజ్యసభకు ఎన్నికై ‘అతి పిన్న వయస్కుడైన ఎంపీ’గా రికార్డు సాధించారు. పార్టీ జాతీయ ప్రతినిధిగా, ట్రెజరర్‌గా, ఢిల్లీ జలమండలి వైస్ ఛైర్మన్‌గా ఆయన పనిచేశారు. 2023లో సంజయ్ సింగ్ స్థానంలో ఆయనను డిప్యూటీ లీడర్‌గా నియమించారు.

రాఘవ్ చద్దా వంటి కీలక నేతపై వేటు వేయడం ఆమ్ ఆద్మీ పార్టీలో పెరుగుతున్న అంతర్గత సంక్షోభానికి అద్దం పడుతోంది. ఒకప్పుడు పార్టీకి ట్రబుల్ షూటర్‌గా ఉన్న నేత, ఇప్పుడు పార్టీకి దూరమవ్వడం భవిష్యత్తులో రాజకీయంగా ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఆయన తదుపరి అడుగు ఎటు అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.