Begin typing your search above and press return to search.

రోజాపై కేసు.. 40 కోట్ల మూల్యం!

వైసీపీ హ‌యాంలో యువ‌త‌ను క్రీడ‌ల దిశ‌గా ప్రోత్సహించేందుకు అప్ప‌టి ప్ర‌భుత్వం .. కేంద్రంలోని మోడీ స‌ర్కారు అమ‌లు చేస్తున్న ఖేలో ఇండియా కార్య‌క్ర‌మాన్ని రాష్ట్రంలో కూడా అమ‌లు చేసింది.

By:  Garuda Media   |   8 April 2026 9:22 AM IST
రోజాపై కేసు.. 40 కోట్ల మూల్యం!
X

వైసీపీ నాయ‌కురాలు, ఫైర్ బ్రాండ్ నేత ఆర్కే రోజాపై క్రిమిన‌ల్ కేసు న‌మోదుకు రంగం రెడీ అయింది. వైసీపీ హ‌యాంలో సుమారు 40 కోట్ల రూపాయ‌ల మేర‌కు ఆమె అవినీతి చేశార‌ని.. అక్ర‌మంగా పోగేసుకున్నార‌ని.. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక‌లో స్ప‌ష్టం చేశారు. ఏకంగా విజిలెన్స్ అధికారులు 30000 పేజీల నివేదికను అందించారు. ఆమెతో పాటు ఇదే వైసీపీ కి చెందిన యువ నాయ‌కుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపైనా విజిలెన్స్ అధికారులు అభియోగాలు పేర్కొన్నారు. ఆయ‌న కూడా ఈ అవినీతిలో ప్ర‌ధాన భాగ‌స్వామిగా పేర్కొన్నారు. దీంతో స‌ర్కారు వీరిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయ‌నుంది.

ఏం జ‌రిగింది?

వైసీపీ హ‌యాంలో యువ‌త‌ను క్రీడ‌ల దిశ‌గా ప్రోత్సహించేందుకు అప్ప‌టి ప్ర‌భుత్వం .. కేంద్రంలోని మోడీ స‌ర్కారు అమ‌లు చేస్తున్న ఖేలో ఇండియా కార్య‌క్ర‌మాన్ని రాష్ట్రంలో కూడా అమ‌లు చేసింది. దీనిలో భాగంగా `ఆడుదాం.. ఆంధ్ర‌` అనే కొత్త పేరును ప్ర‌తిపాదించారు. దీని బాధ్య‌త‌ల‌ను అప్ప‌టి మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన రోజాకు అప్ప‌గించారు. ఇక‌, ఏపీ క్రీడాప్రాధికార సంస్థ చైర్మ‌న్‌గా బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డిని నియ‌మించారు. వీరిద్ద‌రూ క‌లిసి రాష్ట్ర వ్యాప్తంగా యువ‌త‌ను క్రీడ‌ల దిశ‌గా ప్రోత్స‌హించాల్సి ఉంది. ఈ క్ర‌మంలోనే క్రికెట్ బ్యాట్ కిట్లు, ఇత‌ర క్రీడాప‌రిక‌రాలు.. మైదానాల అభివృద్ధి, క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌, వ‌చ్చిన క్రీడాకారుల‌కు ఏర్పాట్లు చేయాల్సి ఉంది.

అయితే.. ఇదే వారికి అవినీతికి ఆల‌వాలంగా మారింద‌ని విజిలెన్స్ అధికారులు స్ప‌ష్టం చేశారు.. నాసిర‌క‌మైన క్రీడా ప‌రిక‌రాల ను అత్య‌ధిక ధ‌ర‌ల‌కు కొనుగోలు చేసి.. క‌మీష‌న్లు తీసుకున్నార‌ని గుర్తించారు. మైదానాల అభివృద్ది పేరుతో కేవ‌లం మ‌ట్టిని త‌రలించి.. గ్రావెల్‌గా రికార్డుల్లో న‌మోదు చేశార‌ని పేర్కొన్నారు. క్రీడాకారుల‌కు 3 స్టార్ హోట‌ల్ భోజ‌నాల ఏర్పాటు పేరుతో మెస్ భోజ‌నాలు పెట్టి.. సొమ్ములు వెనుకేసుకున్నారు. ఇలా.. అడుగ‌డుగునా అవినీతి జ‌రిగింద‌ని.. కేవ‌లం 30 కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చ‌య్యే చోట‌.. మొత్తం 100 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చూపించార‌ని విజిలెన్స్ పేర్కొంది.

వైసీపీనేత ఫిర్యాదు..

వాస్త‌వానికి రోజా, బైరెడ్డి వ్య‌వ‌హారం ఇప్ప‌టిది కాదు. వైసీపీ హ‌యాంలోనే ఆ పార్టీకి చెందిన శ్రీకాకుళం నాయ‌కుడు ఫిర్యాదు చేశారు. నాసిర‌క‌మైన బ్యాట్లు ఇచ్చారంటూ.. ఆయ‌న మీడియా ముందే వ్యాఖ్యానించారు. అప్ప‌ట్లోనే సంచ‌ల‌నంగా మారిన ఈ కేసును కూట‌మి స‌ర్కారు వ‌చ్చాక తీవ్రంగా ప‌రిగ‌ణించింది. ఇక‌, చిత్తూరుకు చెందిన కూట‌మి పార్టీల నాయ‌కులు కూడా దీనిని సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఫ‌లితంగా చంద్ర‌బాబు విజిలెన్స్ విచార‌ణ‌కు ఆదేశించారు. తాజాగా మంగ‌ళ‌వారం రాత్రి 30 వేల పేజీల‌తో నివేదిక‌ను అందించింది.