Begin typing your search above and press return to search.

రాజీనామా అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆది సంచలనం

ఇదే ఆది నారాయణరెడ్డి ఆ మధ్యన కూటమిలో కమ్మని పాలన నడుస్తోంది అని సాక్షాత్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఉండగానే జమ్మలమడుగు సమావేశంలో ప్రకటించి సంచలనం రేపారు.

By:  Satya P   |   7 April 2026 11:44 AM IST
రాజీనామా అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆది సంచలనం
X

కడప జిల్లా జమ్మలమడుగులో తిరుగులేని నాయకుడిగా మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి రెండు సార్లు, వైసీపీ నుంచి ఒకసారి, 2024లో బీజేపీ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ లెక్కన చూస్తే నాలుగు సార్లు ఎమ్మెల్యే అన్న మాట. అంతే కాదు 2017 నుంచి 2019 దాకా రెండేళ్ల పాటు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు పొందిన ఆది నారాయణ రెడ్డి సంచలన ప్రకటనలకు పెట్టింది పేరు అని చెబుతారు. ఆయన ఏపీ బీజేపీకి ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ఒకరు కాదు ప్రత్యేకమైన రాజకీయ శైలి కలిగిన వారుగానే అంతా చూస్తారు. ఆయన రాజకీయ మొదలైంది కాంగ్రెస్ తో కాబట్టి ఆయన రాజకీయంగా కోరుకున్న స్వేచ్చని తీసుకుంటారు అనే అంటారు.

రాజీనామా చేస్తా :

తనకు ఎమ్మెల్యే పదవి ఏమీ ఎక్కువ కాదని తాజాగా పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆది నారాయణ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను అన్నారు. తనకు కార్యకర్తలే ముఖ్యం తప్ప పదవులు కావని చెప్పారు. తాను పదవిలో ఉంటూ ఏ పనీ చేయలేకపోతున్నాను అని కూడా ఆయన నిర్వేదంతో కూడిన ప్రకటన చేశారు. నాకు కూడా చాలా బాధలు ఉన్నాయని ఆయన కార్యకర్తలతో చెప్పుకున్నారు. నన్ను కూడా బాధ పెడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. పైన కూటమిలో కూడా నాకు బాధలు ఇబ్బందులు ఉన్నాయని బహిరంగంగానే ఆయన చెప్పడం విశేషం. ఆ బాధ నివారణ కోసం నేను మీ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న చేస్తాను అని ఆయన ప్రకటించారు.

ఏ తేడా వచ్చినా రెడీ :

ఇంకా కొన్నాళ్ళు చూస్తాను నేను అనుకున్నట్లుగా ఈ వ్యవస్థలు సరిగ్గా లేకపోతే మాత్రం పదవి వదులుకుంటాను అని ఆదినారాయణరెడ్డి కుండబద్దలు కొట్టేశారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి రెడీ అని హింట్ ఇచ్చేశారు. అన్ని పనులు సక్రమంగా జరగాలని ఆయన అన్నారు. లేకపోతే ఎందుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఏ తేడా వచ్చినా తనకు ఎమ్మెల్యే పదవి కంటే క్యాడర్ ముఖ్యమన్న ఉద్దేశ్యంతో పదవులు వదులుకుంటాను అని ఆయన గట్టిగానే చెప్పేశారు. బీజేపీ గురించి కూడా ఆయన కామెంట్స్ చేశారు. మంచికి మంచి చేయకపోతే బీజేపీ బలపడదని కూడా చెప్పేశారు.

ఆది బాధలేంటి :

ఇదే ఆది నారాయణరెడ్డి ఆ మధ్యన కూటమిలో కమ్మని పాలన నడుస్తోంది అని సాక్షాత్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఉండగానే జమ్మలమడుగు సమావేశంలో ప్రకటించి సంచలనం రేపారు. దాని మీద రాష్ట్రవ్యాప్తంగా అతి పెద్ద రాజకీయ రచ్చ సాగింది. అయితే అది సద్దుమణగక ముందే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాను అని ఆది అంటున్నారు. మరి ఆయన తనకూ బాధలు ఉన్నాయని చెబుతున్నారు. మరి ఏ బాధలు ఆయన పడుతున్నారు, ఎవరు పెడుతున్నారు అన్న చర్చకు తెర లేస్తోంది. ఆది సీనియర్ లీడర్, ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద కూడా మంచి చనువు ఉంది. ఏ పని అయినా చేయించుకోగలరు అని అంటారు.

ఎక్కడ తేడా వస్తోంది :

పైగా మంత్రిగా పనిచేసి ఉన్నారు. బీజేపీలో సీనియర్ నేతలలో ఆయన ముందు వరసలో ఉంటారు, పార్టీ సైతం ఆయనను గౌరవిస్తుంది. అలాంటి ఆదికి బాధలు ఉన్నాయి అంటే ఎక్కడ తేడా వస్తోంది అన్నది చర్చిస్తున్నారు. రాజకీయాల్లో ఆధిపత్య పోరు ఒకటి ఉంటుంది. అది జిల్లా స్థాయిలో అయినా రాష్ట్రంలో అయినా ఉండొచ్చు. అంతే కాదు అన్ని పనులూ ఎవరికీ ఎక్కడా జరిగేది ఉండదు, మరి ఆది పనులు కావడం లేదని అంటున్నారు. ఎందుకు అవడం లేదో కారణాలు ఏమిటో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఆయన క్యాడర్ ముందు ఆవేశంతో ఈ ప్రకటన చేశారా లేక నిజంగా మనసులో నిర్ణయించుకున్నారా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఆది మరో మారు సంచలనానికి తెర తీశారు అని అంతా అంటున్నారు. దీని మీద ఏ రకమైన చర్చ సాగుతుందో చూడాల్సి ఉంది.