Begin typing your search above and press return to search.

తొలిసారి ఒక ట్వీట్ ట్యాక్స్ పేయర్లు గళం విప్పేలా చేసింది

బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి చేసిన ట్వీట్ తో ఇప్పటివరకు మౌనంగా మండిపడుతున్న ట్యాక్స్ పేయర్లు గళం విప్పేలా చేసింది.

By:  Tupaki Desk   |   20 July 2023 4:42 AM GMT
తొలిసారి ఒక ట్వీట్ ట్యాక్స్ పేయర్లు గళం విప్పేలా చేసింది
X

ఎన్నికల కాలంలో ఒక ట్వీట్ ట్యాక్స్ పేయర్లు తమ గోడును వెళ్లబుచ్చుకోవటానికి వేదికగా మారింది. పేదలు.. సామాన్యులకు ఆదరవుగా ఉండేందుకు సంక్షేమ పథకాలు ఎవరూ వద్దనరు కానీ.. ఆ పేరుతో ఇష్టారాజ్యంగా అందిస్తున్న ఉచితాలపై ఆదాయ పన్ను కట్టే వారు ఉడికిపోతున్నారు. కష్టపడి సంపాదించిన సంపాదనలో అధిక భాగం పన్నులు కట్టేందుకే వెళ్లిపోవటం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి చేసిన ట్వీట్ తో ఇప్పటివరకు మౌనంగా మండిపడుతున్న ట్యాక్స్ పేయర్లు గళం విప్పేలా చేసింది. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న వైనం సోషల్ మీడియాలో ఇప్పుడు కొత్త చర్చగా మారింది.

బెంగళూరుకు చెందిన సంచిత్ గోయల్ అనే వ్యక్తి.. తన అనుభవాన్ని ట్వీట్ రూపంలో షేర్ చేశారు. తాను రూ.5వేలు సంపాదిస్తే అందులో సగాని కంటే ఎక్కువ మొత్తం పన్ను చెల్లించటానికే సరిపోతుందంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగాలు చేసేది ట్యాక్సులు కట్టేందుకేనా? అంటూ సూటిగా ప్రశ్నించిన ట్వీట్ కు పలువురు నెటిజన్లు రియాక్టు అవుతున్నారు. తమ ఆవేదనను.. ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తానీ రోజు రూ.5వేలు సంపాదిస్తే అందులో 30 శాతం ఇన్ కం ట్యాక్స్ కింద ఇచ్చేశానని.. మిగిలిన డబ్బులతో బేవరేజీస్.. లిక్కర్ లాంటివి కొంటే 28 శాతం పన్ను కట్టినట్లుగా పేర్కొన్నారు.

‘‘మొత్తం సంపాదనలో 58 శాతం పన్ను రూపంలోనే పోయింది. 12 గంటలు కష్టపడి రూ.5వేల సంపాదిస్తే నాకు వచ్చిన జ్ణానం ఏమిటో తెలుసా? పన్నెండు గంటలు కష్టపడి పని చేసేది ప్రభుత్వానికి యాభై శాతం పన్ను కట్టేందుకేనని తెలిసింది’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు పలువురు ట్యాక్స్ పేయర్లు తమ అనుభవాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా 20రూపాయిలు విలువ చేసే చాకో బార్ పై ప్రభుత్వం వసూలు చేసే పన్ను గురించి ఆసక్తికర విశ్లేషణ చేశారో నెటిజన్.

‘‘రూ.20 చాకో బార్ మీద 18 శాతం జీఎస్టీ కడితే.. రూ.3.60, పంచారపై జీఎస్టీ కింద 30 పైసలు.. చాక్లెట్ పౌడర్ పై 18 శాతం జీఎస్టీ కింద తొమ్మిది పైసలు.. పాలపై 12 శాతం జీఎస్టీ కింద ఆరు పైసలు.. క్రీం మీద ఐదు శాతం జీఎస్టీ కింద ఒక పైసాను వసూలు చేస్తున్నారు. మొత్తంగా రూ.5.50లను రూ.20 చాకోబార్ మీద పన్నుగా తీసుకుంటున్నారు. అంటే.. మొత్తం పన్ను శాతం 27.5 అన్న మాట’’ అంటూ పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.

మధ్యతరగతి.. సామాన్యుల నుంచి ప్రభుత్వం ఏ స్థాయిలో పన్నులు లాగుతుందన్న విషయం అర్థమవుతుందని నెటిజన్లు మండిపడుతున్నారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘రక్తం మరిగిపోతుంది. రోజంతా కష్టపడి పని చేస్తే వచ్చే డబ్బుల్ని పన్నుల రూపంలో తీసుకొని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు.. పెన్షన్లకు.. ఉచిత పథకాలకు పంచి పెడుతోంది’’ అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్చలో మరికొన్ని కొత్త అంశాలు తెర మీదకు వచ్చాయి. 50 శాతం పన్ను కడుతున్నా.. జాబ్ పోతే ప్రభుత్వాలు ఆదుకోవటం లేదన్న ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు.

‘జాబ్ పోయినప్పుడు ప్రభుత్వం ఏమీ ఆదుకోదు కదా. అలాంటప్పుడు కష్టపడిన సొమ్ములో 50 శాతం పన్ను ఎందుకు కట్టాలి?’ అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. ఆదాయపన్ను.. జీఎస్టీల పేరుతో వసూలు చేస్తున్న పన్నులపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉచిత విద్య.. వైద్యం.. ఆరోగ్యంతో పాటు నీతి నిజాయితీ పాలన అందిస్తూ చక్కటి మౌలిక సదుపాయాలు కల్పించాలే కానీ 50 శాతం కంటే ఎక్కువ పన్ను కట్టేందుకు తాము సిద్దమని మరికొందరు పేర్కొంటున్నారు. ఇంతకాలం బయటకు రాని ఈ కొత్త గళాల బలం పెరిగే కొద్దీ.. రాజకీయ పార్టీలకు కొత్త చిక్కులుగా మారతాయని మాత్రం చెప్పక తప్పదు.