Begin typing your search above and press return to search.

లడఖ్ లో ఘోరం.. 9 మంది భారత ఆర్మీ జవాన్లు మృతి!

లడఖ్‌ లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం లడఖ్‌ లోని లేహ్ జిల్లాలో వారు ప్రయాణిస్తోన్న వాహనం రోడ్డుపై నుంచి లోతైన లోయలో పడిపోయింది.

By:  Tupaki Desk   |   20 Aug 2023 5:47 AM GMT
లడఖ్ లో ఘోరం.. 9 మంది భారత ఆర్మీ జవాన్లు మృతి!
X

భారత జవాన్లు ప్రయాణిస్తోన్న ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది జవాన్లు అక్కడికక్కడే కన్నుమూశారు. పలువురు గాయపడ్డారు. లోయలో పడిన వాహనంలో ఉన్న జవాన్లను సురక్షితంగా వెలికి తీయడానికి పోలీసులు, రెస్క్యూ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలను చేపట్టారు.

అవును... లడఖ్‌ లో జవాన్లు ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న లోతైన లోయలో పడిపోయిన ఘటనలో యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ పనులు జరుగుతున్నాయి. అంత ఎత్తు నుంచి సైనిక వాహనం పడిపోవడంతో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఒకరు గాయపడ్డారని అధికారులు తెలపారు.

ప్రమాదం జరిగిన సమయంలో 34 మంది వరకు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తుంది. మృతుల్లో ఇద్దరు జూనియర్ కమిషన్డ్ అధికారులు కూడా ఉన్నారని అన్నారని తెలుస్తోంది. ఆర్మీ కరూ దండు నుండి 150 కిలోమీటర్ల దూరంలోని లేహ్ సమీపంలోని క్యారీ టౌన్ కి వెళ్తుండగా.. క్యారీ టౌన్ కి ఏడు కిలోమీటర్ల దూరంలో ఖేరీ ప్రాంతం వద్ద ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

ప్రమాదంలో చాలా మంది సైనికులు కూడా గాయపడ్డారు. అయితే ఎవరెవరు చనిపోయారు, వారి వివరాలేంటి అనే విషయాలు మాత్రం ఆర్మీ ఉన్నతాధికారులు ఇంకా వెల్లడించలేదు. ఇలా సైనికులు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిందన్న సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన రంగంలోకి దిగారు. ముమ్మర సహాయక చర్యలు చేపట్టారు.

మృతదేహాలను వెలికి తీయడం, మిగిలిన వారు ఎవరైనా ఉంటే వారి ఆచూకీ గుర్తించడం, వాహనాన్ని పైకి లాగడం చేశారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే... లడఖ్‌ లో జరిగిన ప్రమాదం గురించి రక్షణ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లేహ్ సమీపంలో జరిగిన ప్రమాదంలో భారత ఆర్మీ సిబ్బందిని కోల్పోవడం బాధాకరమని అన్నారు.

దేశానికి వారు చేసిన సేవలను ఎప్పటికీ మరువలేమని తెలిపారు. ఇదే సమయంలో తమ ఆలోచనలు మృతుల కుటుంబాలతోనే ఉన్నాయని చెప్పిన రక్షణ మంత్రి... గాయపడిన సిబ్బందిని ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని రాజ్‌ నాథ్ సింగ్ పేర్కొన్నారు.