Begin typing your search above and press return to search.

బాగా చూసుకున్నడని పనోడికి రూ.97వేల కోట్ల ఆస్తి

తనను కంటికి రెప్పలా చూసుకున్నసంరక్షుడ్ని దత్తత తీసుకోవటమే కాదు.. తన 11 బిలియన్ డాలర్ల ఆస్తిని అతడి పేరున రాస్తున్నాడు.

By:  Tupaki Desk   |   10 Dec 2023 2:30 PM GMT
బాగా చూసుకున్నడని పనోడికి రూ.97వేల కోట్ల ఆస్తి
X

కొందరి జీవితాల్ని చూసినప్పుడు అయ్యో అనుకోకుండా ఉండలేం. లంకంత ఇల్లు.. పోగేసినట్లుగా సంపదతో ఉండే వారు.. తమ వ్యక్తిగత జీవితంలో మాత్రం అంతులేని ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు. కోట్లకు కోట్ల సంపద ఉన్నప్పటికి.. అయినోళ్ల పిలుపునకు నోచుకోని వేదనను అనుభవిస్తుంటారు. సొంతోళ్లు ఉన్నప్పటికి.. కాలంతో పరుగులు తీస్తూ.. తల్లిదండ్రుల బాధ్యతల్ని పట్టించుకోని తత్త్వం కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివేళ.. తనను కాచుకొన్నట్లుగా కొందరు సేవకులు పని చేస్తుంటారు.

వారి ధర్మాన్ని వారు పాటించాల్సిన దాని కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువగా చేసినా వారికి దక్కాల్సిన ఫలితం దక్కదు. ఇప్పుడు చెప్పే ఉదంతంలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించదు. రోటీన్ కు భిన్నంగా సాగే ఈ కథనంలో తన బాగోగుల్ని చూసిన సంరక్షకుడ్ని ఎవరూ అంచనాలు వేయలేనంతగా రుణం తీర్చుకునే ప్రయత్నంచేస్తున్న ఒక సంపన్నుడి ఉదంతంగాదీన్ని చెప్పాలి. పెద్ద వయసులో తన బాగోగుల్ని చూసుకున్న తన సంరక్షకుడికి తన ఆస్తిలో రూ.97వేలకోట్లు రూపాయిల్ని రాసేస్తున్న వైనం ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తోంది.

స్విట్టర్లాండ్కు చెందిన ఒక అపర కుబేరుడు పెద్దవయసులో తన పెద్ద మనసును చాటుకున్నాడు. తనను కంటికి రెప్పలా చూసుకున్నసంరక్షుడ్ని దత్తత తీసుకోవటమే కాదు.. తన 11 బిలియన్ డాలర్ల ఆస్తిని అతడి పేరున రాస్తున్నాడు. ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ హెర్మెస్ సంస్థను 1837లో స్టార్ట్ చేశారు. స్విస్ కు చెందిన థియెర్రీ హెర్మెస్ దీన్ని స్థాపించారు. ఈ వ్యాపార కుటుంబానికి చెందిన ఐదో తరానికి చెందిన వారసుడు నికోలస్ ప్యూచ్ కు సదరు సంస్థలో ఐదారు శాతం వాటా ఉంది.

80 ఏళ్ల వయసున్న ఆయనకు.. సదరు సంస్థలోని వాటా విలువ 11 బిలియన్ డాలర్లు. మన రూపాయిల్లో చెప్పాలంటే దగ్గరదగ్గర రూ.97వేల కోట్లకుపైనే. అయితే.. ఈ పెద్దాయనకు పెళ్లి కాకపోవటం.. వారసులు ఎవరూ లేకపోవటంతో తన తదనంతర ఆస్తికి సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు నికోలస్. కొన్నేళ్లుగా తన బాగోగుల్ని చూసుకుంటున్న 51 ఏళ్ల సంరక్షకుడికి తన ఆస్తిని రాసేయాలనిఆయన భావిస్తున్నట్లుగా కథనాలు వచ్చాయి.

చట్ట ప్రకారం తన సంరక్షుడిని దత్తత తీసుకోవటంతో పాటు.. ఒక లా టీంను ఏర్పాటు చేయటం ద్వారా.. తన ఆస్తికి వారసుడన్న వైనాన్ని పక్కాగా పూర్తి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. సదరు సంరక్షుడి పేరును బయటకు వెల్లడించటం లేదు. అయితే.. సదరు వ్యక్తికి పెళ్లై.. ఇద్దరు పిల్లలు ఉన్నట్లుగా మాత్రం చెబుతున్నారు. ఇప్పటికే నికోలస్ తన ఆస్తుల్లో 5.9 మిలియన్ డాలర్ల ఆస్తిని అప్పగించినట్లుగా చెబుతున్నారు.కుటుంబంలో చోటు చేసుకున్న తగాదాల్లో భాగంగానే ఈ పెద్దాయన ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారని చెబుతున్నారు.

అయితే.. స్విస్ న్యాయ నిబంధనల్ని చూస్తే ఈ దత్తత వ్యవహారం సాఫీగా సాగేట్లుగా లేదంటున్నారు.కారణం.. ఆ దేశంలో పెద్ద వాళ్లను దత్తత తీసుకునే విషయంలో కొన్ని పరిమితులు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఒకవేళ నికోలస్ తన సంరక్షుడ్ని దత్తత తీసుకుంటే.. దానిపై హెర్మెస్ కుటుంబ సభ్యులు కోర్టులో కేసు వేయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఈ కథనం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని వారిని విపరీతంగా ఆకర్షిస్తోంది. మరి.. ఈ పెద్దాయన తాను కోరుకున్నట్లే తన సంరక్షుడికి విజయవంతంగా ఆస్తిని బదిలీ చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.