Begin typing your search above and press return to search.

ఒకప్పటి లంచ్ బ్యాగ్.. ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్: వీడియో వైరల్

చెన్నైలోని ఓ మాల్‌లో షాపింగ్ చేస్తూ కనిపించిన విదేశీ పర్యాటకురాలి చేతిలో ఉన్న బ్యాగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది.

By:  Tupaki Desk   |   23 Aug 2025 1:53 PM IST
ఒకప్పటి లంచ్ బ్యాగ్.. ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్: వీడియో వైరల్
X

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎప్పుడూ ప్రపంచాన్ని ఆకట్టుకుంటూనే ఉంటాయి. ఆహారం నుంచి దుస్తులు, సాధారణ గృహోపకరణాల వరకు అనేక "దేశీ వస్తువులు" విదేశీయులకూ ఆకర్షణీయంగానే ఉంటాయి. దానికి తాజా ఉదాహరణగా ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

90ల స్కూల్ లంచ్ బ్యాగ్… ఫ్యాషన్ యాక్సెసరీగా

చెన్నైలోని ఓ మాల్‌లో షాపింగ్ చేస్తూ కనిపించిన విదేశీ పర్యాటకురాలి చేతిలో ఉన్న బ్యాగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. అది ఖరీదైన బ్రాండ్ బ్యాగ్ కాదు, మన 90లలో స్కూల్‌కి వెళ్ళే పిల్లలు వాడిన వైర్ లంచ్ బ్యాగ్. ఈ దృశ్యాన్ని ఒక యువతి వీడియోగా తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దానికి ఆమె పెట్టిన క్యాప్షన్ మరింత ఆకట్టుకున్నది.

మిలియన్ల వ్యూస్, వేల లైక్స్

ఈ వీడియో ఇప్పటికే 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించగా, లక్షల లైక్స్ వచ్చాయి. కామెంట్స్‌లో నెటిజన్లు తమ బాల్య స్మృతులను గుర్తుచేసుకున్నారు. కొందరు చిన్ననాటి రోజుల్లో ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో కొత్త లంచ్ బ్యాగ్ కోసం ఎదురుచూసిన విషయాలను షేర్ చేశారు. మరికొందరు "లంచ్ బ్యాగ్ నుంచి హ్యాండ్ బ్యాగ్ వరకు వచ్చిన కాలం ఎంత వింత" అని రాశారు.

ఫ్యాషన్‌పై నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..

ఇంకొంతమంది ఫన్నీగా స్పందిస్తూ "ఫ్యాషన్ మళ్లీ తిరిగి వెళ్తోంది.. ఇంకో కొద్ది రోజుల్లో రాతియుగం కూడా ఫ్యాషన్ అవుతుంది" అని జోక్ చేశారు.

మరికొందరు ఆ బ్యాగ్‌ను "ది గ్రేట్ ఇండియన్ యుటిలిటీ బ్యాగ్" అని పిలుస్తూ, ఇంట్లో ప్రతిరోజూ పాలు, బియ్యం, మటన్ తెచ్చేందుకు, లేదా ఆలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో కనిపించే బ్యాగ్‌గా గుర్తు చేశారు.

"వీరి చేతిలో స్టైల్, మన చేతిలో సాధారణం!"

ఆ పర్యాటకురాలి చేతిలో లంచ్ బ్యాగ్ స్టైలిష్‌గా కనిపించడం నెటిజన్లలో చర్చనీయాంశమైంది. "మన చేతిలో సాధారణంగా కనిపించే ఈ బ్యాగ్ వీరి చేతిలో ఎందుకింత ఫ్యాషన్‌గా కనిపిస్తోంది?" అని ఆశ్చర్యపడ్డారు. మరికొందరు వ్యంగ్యంగా "ఇప్పుడు పెద్ద బ్రాండ్లు దీన్ని కొత్త మోడల్‌గా లాంచ్ చేస్తే, డాలర్లలో నాలుగు అంకెల ధరకు అమ్మేస్తారు" అని రాశారు.

బాల్యస్మృతుల నుంచి ఫ్యాషన్ వరకూ

మన చిన్ననాటి రోజుల్లో ప్రతి ఇంటిలో కనిపించే సాదాసీదా లంచ్ బ్యాగ్… ఇప్పుడు ఒక విదేశీ పర్యాటకురాలి చేతిలో ఫ్యాషన్ యాక్సెసరీగా మారి, అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇది మరోసారి మన "దేశీ వస్తువులు"కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేకతను నిరూపిస్తోంది.