కనీసం వేతనం 72 వేలు...బంపర్ ఆఫర్ సుమా !
ఇక చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఠంచనుగా ప్రతీ ఆరు నెలలకూ కరువు భత్యం పెరుగుతుంది. అది అమలు అవుతుంది కూడా.
By: Satya P | 24 April 2026 9:05 AM ISTఒకప్పుడు జీతాలు ఎంతో తక్కువగా ఉండేవి. ఇపుడు మాత్రం ఉద్యోగ సంఘాలు పటిష్టంగా ఉండడంతో పాటు చైతన్యవంతమైన పాత్రను కార్మిక సంఘాలు పోషించడం కార్మిక హక్కులు కూడా బలంగా ఉండడంతో కాలానికి ద్రవ్యోల్బణానికి తగినట్లుగా వేతనాలు పెంచాలన్న డిమాండ్ అయితే వస్తోంది. ప్రభుత్వాలు కూడా వీలైనంత వరకూ వాటిని పాటిస్తూ వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో అతి ముఖ్య భాగం కావడంతో వారి ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం కూడా అతి పెద్ద ప్రయారిటీ ఇస్తూ వస్తోంది. ఇక చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఠంచనుగా ప్రతీ ఆరు నెలలకూ కరువు భత్యం పెరుగుతుంది. అది అమలు అవుతుంది కూడా. అలాగే ప్రతీ పదేళ్ళకు కొత్త వేతన సంఘం ఏర్పాటు చేసి ఆయా సిఫార్సులను అమలు చేస్తారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. దాంతో ఈ వేతన సంఘం ఏణ్ణర్థం లోపల తన సిఫార్సులను కేంద్రానికి అందజేయాల్సి ఉంటుంది.
మజ్దూర్ సంఘ్ ప్రతిపాదనలు :
ఇదిలా ఉంటే కేంద్రం ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘానికి అన్ని కార్మిక సంఘాలు తమ ప్రతిపాదనలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ సంఘం అయిన భారతీయ ప్రతి రక్ష మజ్దూర్ సంఘ్ తన ప్రతిపాదనలు అందించింది. దాని ప్రకారం చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం ఏకంగా 72 వేలు ఉండాలని ఉంది అలాగే ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ నాలుగు శాతం ఉండాలని కోరింది అలాగే వార్షిక వేతన పెంపు 6 శాతంగా ఉండాలని పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని పేర్కొంది.
మారిన పరిస్థితులలో :
ఇక్కడ ఏడవ వేతన సంఘం సిఫార్సులు పదేళ్ల కాలం నాటి పరిస్థితులు ఇపుడు మారిన ఆర్థిక సామాజిక పరిస్థితులు మొత్తం ఉటంకిస్తూ కనీస వేతనం 72 వేలుగా పేర్కొంది. దానికి ఆధారంగా గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ప్రచురించిన నివేదికను ఈ సంఘం ఉదహరించింది. దేశ తలసరి నికర జాతీయ ఆదాయం 2016-17లో ఒక లక్షా మూడు వేల 219 రూపాయలుగా ఉండగా అది 2024-25 నాటికి 86 శాతానికి పైగా పెరిగి ఒక లక్షా 92 వేల 774 రూపాయలకు చేరిందని గుర్తు చేసింది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెరగాల్సి ఉందని ఈ సంఘం తన అభిప్రాయం తెలిపింది.
ఏడవ వేతన సంఘం అలా :
ఇక పదేళ్ళ క్రితం ఏడవ వేతన సంఘం అమలు చేసిన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతంగా ఉంది. దాని ప్రకారం కనీస వేతనం అప్పట్లో ఏడు వేల నుంచి 18 వేల రూపాయలకు పెంచారు అంటే మూడింతలు అన్న మాట. ఇప్పటి పరిస్థితులకు అది కాస్త్గా మార్చితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ని 4 శాతం చేయాలి కోరుతోంది. అంటే 18 వేలను నాలుగింతలు పెంచాల్సి ఉంది అపుడు అది కాస్త 72 వేలకు చేరాల్సి ఉంటుందని సంఘం తన సిఫార్సులలో పేర్కొంది. అలాగే వార్షిక వేతన పెంపు ఆరు శాతంగా ఉండాలని పట్టుబడుతోంది. మరో వైపు చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం మధ్య వివాదాల్ని పరిష్కరించే నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ కూడా తన ప్రతిపాదనలలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.83 గా ఉండాలని, కనీస వేతనం 69 వేలు చేయాలని ప్రతిపాదించింది. దీంతో ఏ విధంగా చూసినా కనీస వేతనం కేంద్ర ఉద్యోగులకు 70 వేలు పై దాటడం ఖాయం. ఒక విధంగా 8వ వేతన సంఘం బంపర్ ఆఫర్ ని అందిస్తున్నట్లుగానే భావించాలి.
