రక్తంతో ఎర్రబడ్డ తీరం.. అక్కడ వందల డాల్ఫిన్స్ భారీ వధ!
డెన్మార్క్ పరిధిలోని ఫారో ఐలాండ్స్‌లో వందల ఏళ్లుగా వస్తున్న ఒక వింత ఆచారం ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
By: Madhu Reddy | 4 Jun 2026 8:58 PM ISTడెన్మార్క్ పరిధిలోని ఫారో ఐలాండ్స్‌లో వందల ఏళ్లుగా వస్తున్న ఒక వింత ఆచారం ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. 'గ్రైండడ్రాప్' అని పిలిచే ఈ సాంప్రదాయక వేటలో భాగంగా కేవలం ఒక్క రోజులోనే 700 పైగా తిమింగలాలు, డాల్ఫిన్‌లను దారుణంగా నరికి చంపేశారు. స్థానికులంతా చూస్తుండగానే సముద్ర తీరంలో జరిగిన ఈ దారుణ వధతో నీళ్లన్నీ రక్తవర్ణంగా మారిపోయాయి. జంతు ప్రేమికులను సైతం కలచివేస్తున్న ఈ భయంకరమైన ఘోరానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.
వెయ్యేళ్ల నాటి వింత ఆచారం:
ఫారో ఐలాండ్స్‌లో దాదాపు వెయ్యి సంవత్సరాల నుండి ఈ 'గ్రైండడ్రాప్' లేదా 'గ్రైండ్' అనే వేట సంప్రదాయం కొనసాగుతోంది. ఇక మే 27 జరిగిన ఈ వేటలో భాగంగా స్థానికులు పడవలు, హుక్స్, కత్తులను ఉపయోగించి సముద్రంలో ఉన్న అట్లాంటిక్ తెల్లటి డాల్ఫిన్లు, పైలట్ తిమింగలాలను చుట్టుముట్టారు. ఇక వాటన్నింటినీ బలవంతంగా తీరంలోని లోతు తక్కువగా ఉండే బేస్ సముద్ర తీరాల వైపునకు నెట్టేసి ఈ ఘోరానికి పాల్పడ్డారు.
నరకప్రాయంగా మారిన సముద్ర తీరం:
తీరానికి కొట్టుకొచ్చిన అమాయక జంతువులను వేటగాళ్లు కత్తులతో దారుణంగా నరుకుతుంటే.. చిన్న పిల్లలతో సహా వందలాది మంది ప్రేక్షకులు ఒడ్డున నిలబడి ఆ దృశ్యాలను చూశారు.ఇక గ్లోబల్ ఎన్విరాన్‌మెంటల్ యాక్టివిస్ట్ ఎన్జీఓ 'సీ షెపర్డ్' నివేదిక ప్రకారం, మూడు వేర్వేరు ప్రాంతాలలో జరిగిన ఈ వేటలో మొత్తం 402 పైగా పైలట్ తిమింగలాలు, 304 డాల్ఫిన్లు మరణించాయి. మొత్తంగా 706 మూగజీవాలను నరికి చంపడంతో సముద్రపు నీరు పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోయింది.
కత్తులతో నరికి తీవ్ర హింస:
సాధారణంగా ఈ జంతువులను చంపడానికి ప్రత్యేకమైన 'స్పైనల్ లాన్స్' అనే పరికరాలను వాడాలి. కానీ ఈసారి వేటగాళ్ల దగ్గర అవి సరిపడా లేకపోవడంతో, మామూలు కత్తులతో వాటి శరీరాలను విచక్షణారహితంగా చీల్చేశారు. ఇక దీనివల్ల ఆ తిమింగలాలు, డాల్ఫిన్లు వెంటనే చనిపోకుండా, తీవ్రమైన నొప్పితో, ప్రాణభయంతో సముద్ర తీరంలో గంటల తరబడి కొట్టుకుంటూ నరకయాతన అనుభవించాయి. ఇక ఆ తర్వాత చనిపోయిన ఆ కళేబరాలన్నింటినీ ఒకచోట చేర్చి, మాంసం ముక్కలుగా కోసి స్థానికుల ఆహార అవసరాల కోసం పంచిపెట్టారు.
ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు:
గత ఏడాదితో పోలిస్తే ఈ ఒక్కసారే భారీ సంఖ్యలో జంతువులను చంపడంపై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ మూగజీవాలు అనుభవించిన నరకయాతనను ఎవరూ సమర్థించలేరని, ఈ అనాగరిక ఆచారాన్ని వెంటనే ఆపాలని జంతు సంరక్షణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రూరమైన మారణకాండను పూర్తిగా నిషేధించేలా యూరప్ దేశాల ప్రభుత్వాలు చొరవ చూపాలని 'సీ షెపర్డ్' సంస్థ కోరుతోంది.
సంప్రదాయం, ఆహార అవసరాల పేరుతో వందలాది జీవులను ఇలా చిత్రహింసలు పెట్టి చంపడం నిజంగా మనసున్న ప్రతి ఒక్కరినీ బాధించే విషయమే. ప్రకృతి సమతుల్యతను కాపాడే ఇలాంటి సముద్ర జీవులను ఆచారం పేరుతో అంతం చేయడం ఎంతవరకు కరెక్టో ఆ దేశాలే ఆలోచించుకోవాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నిరసనల నేపథ్యంలోనైనా ఫారో ఐలాండ్స్ ప్రభుత్వం ఈ క్రూరమైన ఆచారానికి ఎండ్ కార్డ్ వేస్తుందని ఆశిద్దాం.
