Begin typing your search above and press return to search.

ఒకే రోజు 5 ఎన్నికలు? ఈ ఫిబ్రవరి 14న ఆ దేశంలో అదే స్పెషల్!

ఇదే రీతిలో ఇండోనేషియాలో ఒకే రోజున 5 ఎన్నికలు జరుగుతున్నాయి. జాతీయ స్థాయి నుంచి స్థానిక సంస్థల వరకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.

By:  Tupaki Desk   |   13 Feb 2024 10:30 AM GMT
ఒకే రోజు 5 ఎన్నికలు? ఈ ఫిబ్రవరి 14న ఆ దేశంలో అదే స్పెషల్!
X

ఒకటే రోజున 5 ఎన్నికలా? అదెలా సాధ్యం? అన్న సందేహం అక్కర్లేదు. మన దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో ఒకేసారి లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగటం తెలిసిందే. మరికొద్ది నెలల్లో ఏపీలో ఇలాంటి సీన్ ఎదురు కానుంది. ఒకేసారి లోక్ సభ.. అసెంబ్లీ అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రెండింటికి కలిపి ఒకేసారి పోలింగ్ జరగటం తెలిసిందే.

ఇదే రీతిలో ఇండోనేషియాలో ఒకే రోజున 5 ఎన్నికలు జరుగుతున్నాయి. జాతీయ స్థాయి నుంచి స్థానిక సంస్థల వరకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన ఇండోనేషియాలో ఈ ఫిబ్రవరి 14న ఇలాంటి ఇస్పెషల్ సీన్ చోటు చేసుకోనుంది. ఆ దేశ జనాభా 27 కోట్లు అయితే.. ఓటర్లు 20 కోట్ల మంది ఉన్నారు. 17 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికి ఓటు వేసే హక్కు ఉంటుంది. కాకుంటే సైన్యం.. పోలీసు శాఖల్లో పని చేసే వారికి మాత్రం ఓటు వేసే హక్కు ఉండదు. మొత్తం ఐదు ఓట్లను బ్యాలెట్ పత్రాల్లోనే ఓటు వేయాల్సి ఉంటుంది.

ఈ దేశంలో మరో ఆసక్తికరమైన నిబంధన ఉంది. దేశాధ్యక్షుడిగా ఎవరైనా సరే.. రెండు టర్మ్ లు మాత్రమే పని చేయాలి. అంటే.. పదేళ్లు. తాజాగా దేశాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న జొకో విడొడో (జాకోవి) పదవీ కాలం పదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఆయన ఈసారి అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాల్సిందే. అమెరికాలో అధ్యక్ష పదవికి ఏ నిబంధన ఉందో అలాంటిదే ఇండోనేషియాలోనూ అమల్లో ఉంది.

దేశంలో మొత్తం 575 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. మొత్తం 18జాతీయ పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. వివిధ స్థాయిలో మొత్తం 20,616 పదవులకు 2,58,602 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బరిలో పార్టీలు చాలానే ఉన్నా.. దేశాధ్యక్ష రేసులో మాత్రం ముగ్గురు ప్రధానంగా ఉన్నారు. వారిలో జకార్తా మాజీ గవర్నర్ .. విద్యావేత్తగా పేరున్న 54 ఏళ్ల అనీస్ బాస్వెదాన్ పోటీ పడుతున్నారు. అమెరికాలో చదువుకున్న ఆయన ఇండోనేషియాలో తొలుత విద్యా రంగంలోకి.. తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. విద్యామంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తమను ఎన్నికల్లో గెలిపిస్తే దేశ వ్యాప్తంగా కొత్తగా 40 నగరాల్నినిర్మిస్తామని హామీఇస్తున్నారు. యువత కోసం ఉద్యోగాల్ని పెద్ద ఎత్తున కల్పిస్తామని పేర్కొంటున్నారు.

అధ్యక్ష స్థానానికి మరో బలమైన అభ్యర్థిగా ఇండోనేషియా జాతీయ పార్టీ అయిన గెరిండ్రా పార్టీ నుంచి 72 ఏళ్ల మాజీ సైనికాధికారి సుబియాంటో పోటీలో ఉన్నారు. విజయవకాశాలు ఈయనకే ఎక్కువగా ఉన్నాయన్నది అంచనాలు వినిపిస్తున్నాయి. 2014, 2019లో అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన ఆయన రెండుసార్లు ఓడారు. ముచ్చటగా మూడోసారి తన లక్ ను పరీక్షించుకుంటున్నారు. అయితే.. ఈయన మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆయన సైనికాధికారిగా (1990)లో పని చేసిన సమయంలో 20 మందికి పైగా ప్రజాస్వామ్య ఉద్యమ కార్యకర్తల్ని కిడ్నాప్ చేయించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వారిలో పది మంది ఆచూకీ ఇప్పటికి లభించకపోవటం గమనార్హం. 1998లో సైన్యం నుంచి తప్పుకున్న ఆయన్ను 2020 వరకు తమ దేశంలోకి ప్రవేశించకుండా ఆయనపై అమెరికా నిషేధాన్ని విధించింది.

బరిలో ఉన్న మూడో ప్రధాన అభ్యర్థి గిబ్రాన్ రాకాబుమింగ్. ఆయన కూడా వివాదాస్పద బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాడే. ప్రస్తుతం సురకర్తా సిటీ మేయర్ గా పని చేస్తున్న ఆయన.. తనను గెలిపిస్తే దేశాన్ని మరింత ముందుకు తీసుకెళతానని హామీ ఇస్తున్నాడు. ఇక.. ఇండోనేషియా ఎదుర్కొంటున్న సమస్యల్ని చూస్తే.. ఆర్థిక వ్రద్ధి పడిపోవటం.. ప్రజల జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోవటం ఇబ్బందిగా మారింది.

నిరుద్యోగ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఉద్యోగులకు.. కార్మికులకు వేతనాలు తగ్గిపోయాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మొత్తం ఓటర్లలో సగానికి పైనే 40ఏళ్ల లోపు ఉన్న యూత్ ఉన్నారు. వారే ఎన్నికల్లో డిసైడింగ్ కానున్నారు. మానవహక్కుల హననం.. ప్రజాస్వామ్య వ్యవస్థ పతనం అవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయన్న నమ్మకం లేకున్నా.. ఓట్లు వేసేందుకు మాత్రం ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వెళ్లే అలవాటు ఇండోనేషియాలో కనిపిస్తుంది.