Begin typing your search above and press return to search.

అయిదు ఊళ్ళు ఇమ్మంటున్న తెలంగాణా...బాబు ఏమంటారు ?

ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా భేటీ అయ్యారు.

By:  Satya P   |   17 Feb 2026 8:30 AM IST
అయిదు ఊళ్ళు ఇమ్మంటున్న తెలంగాణా...బాబు ఏమంటారు ?
X

ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం తో అనేక విషయాలు చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాలు కూడా ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చాయని చెబుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండాలని అలాగే సహకారంతో పరిష్కరించాల్సిన పలు అంశాలను కూడా తుమ్మల ఈ భేటీలో ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, రైల్వే లైన్లు వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు లబ్ది జరుగుతుందని తుమ్మల పేర్కొన్నారు అంటున్నారు. ఇలా వీటికి సంబంధించిన పలు వివరాలను ముఖ్యమంత్రికి ఆయన తెలియచేశారు. రెండు ప్రభుత్వాలు ఉన్నత స్థాయిలో సంప్రదింపుల ద్వారా ఈ సమస్యల పరిష్కారం జరుగుతుందని తుమ్మల నాగేశ్వరరావు బాబుకు వివరించినట్లుగా తెలిసింది.

అయిదు గ్రామాలు కావాలి :

ఈ సందర్భంగా తుమ్మల చంద్రబాబుతో కీలకమైన ప్రతిపాదననే ఉంచారని అంటున్నారు. విభజన సమయంలో తెలంగాణాలోని ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్ట్ కోసం ఏపీకి బదిలీ చేశారు. అందులో కీలకమైన అయిదు గ్రామాలు తెలంగాణా మధ్యలో ఉన్నాయి. వాటిని తిరిగి తెలంగాణాలో కలపాలని తుమ్మల కోరారని అంటున్నారు. ఈ గ్రామాలు ఏమిటి అంటే ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకాలపాడు, పురుషోత్తమపట్నం, గుండాల పంచాయతీలుగా చెబుతున్నారు ఇవన్నీ కూడా తెలంగాణా భూభాగం మధ్యలోనే ఉన్నాయని అంటున్నారు. ఫలితంగా పాలనాపరంగా ఇబ్బందులు వస్తున్నాయని తుమ్మల వివరించారు. ఇక వీటిని కనుక తెలంగాణాలో కలిపితే అక్కడ ప్రజలకు కష్టాలు తప్పుతాయని చెబుతున్నారు.

ఖర్చులు ఏపీ భరించాలి :

మరో వైపు చూస్తే పెద్ద వాగు ప్రాజెక్ట్ రిపేర్ల ఖర్చులో ఏపీ ప్రభుత్వం 85 శాతం భరించాలని కూడా తుమ్మల నాగేశ్వరరావు కోరుతున్నారు. మరి ఈ పెద్ద వాగు ప్రాజెక్టు విషయంలో ఏపీ ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు భరించాలి అన్నది ఏపీ ప్రభుత్వం చూడాల్సి ఉంది. అలాగే తెలంగాణా భక్తుల కోసం తిరుమలలో అయిదు ఎకరాలు కేటాయిస్తే తెలంగాణా భవన్ కడతామని కూడా అక్కడి ప్రభుత్వం అంటోంది. ఆ విధంగా భూమిని కేటాయించాలని కోరుతోంది. అదే విధంగా రైల్వేలో బొగ్గు రవాణా, ఇతర సౌకర్యాలకు సంబంధించి రైల్వే కనెక్టువిటీ పైన కూడా తుమ్మల చంద్రబాబుతో చర్చించారు అని అంటున్నారు.

ఏపీ ఏమంటుందో :

మరి తెలంగాణా నుంచి ప్రతిపాదనలు అయితే వచ్చాయి. అందులో ఎన్నో కీలకమైన అంశాలు ఉన్నాయి. వీటి మీద ఏపీ ప్రభుత్వం ఏమి అంటుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఎందుకంటే పోలవరం కోసం ఏడు మండలాలను తెలంగాణా నుంచి ఏపీలో కలపాలని తాను 2014లో డిమాండ్ చేశాను అని చంద్రబాబు పలుమార్లు చెప్పారు. అలా చేయకపోతే తాను సీఎం గా ప్రమాణం చేయను అని కూడా కండిషన్ పెట్టాను అని ఆయన గుర్తు చేస్తూంటారు. ఇపుడు అందులో కీలకమైన అయుదు గ్రామాలను కలపలని అంటున్నారు. మరి కలిపితే ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ కి ఏ విధమైన ఇబ్బంది వస్తుందా రాదా అన్నది కూడా చూడాలని అంటున్నారు. అలాగే ఇతర అంశాల మీద ఏపీ ప్రభుత్వం పరిశీలన చేయాల్సి ఉందని అంటున్నారు.