Begin typing your search above and press return to search.

ప్రతిపక్షాలకు అనుకూలంగా 4 విడత ఎన్నికలు.. ఎందుకలా?

ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు.. సీఈసీ విడుదల చేసిన షెడ్యూల్ అధికార పక్షానికి ఇబ్బందికరంగా మారిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   17 March 2024 5:46 AM GMT
ప్రతిపక్షాలకు అనుకూలంగా 4 విడత ఎన్నికలు.. ఎందుకలా?
X

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే నాటి మధ్యన దాదాపు మూడు నెలల సమయం ఉండటం తెలిసిందే. ఏడు దశల్లో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున విశ్లేషణలు వస్తున్నాయి. అన్నింటికంటే ఆసక్తికర అంశం ఏమంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు.. విపక్షాలకు అనుకూలంగా షెడ్యూల్ ఉందన్న మాట వినిపిస్తోంది. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు.. సీఈసీ విడుదల చేసిన షెడ్యూల్ అధికార పక్షానికి ఇబ్బందికరంగా మారిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

గత ఎన్నికల్లో మాదిరి మొదటి దశలో కాకుండా.. నాలుగో దశలో నిర్వహించటం కారణంగా ప్రతిపక్ష పార్టీలకు వరంగా మారిందంటున్నారు. 2019లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి షెడ్యూల్ వెలువడిన తేదీకి.. పోలింగ్ కు మధ్య అంతరం ఎక్కువగా ఉంది. తాజాగా జరిగే ఎన్నికలు అధికారపక్షానికి ఇబ్బందికరంగా మారుతుందంటున్నారు. దీనికి కారణం.. షెడ్యూల్ కు పోలింగ్ కు మధ్య ఎక్కువ రోజులు ఉండటమే.

2019లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలు ఏపీలో మొదటి విడతలోనే నిర్వహించారు. నాడు మార్చి 10న షెడ్యూల్ విడుదలైతే.. మార్చి 18న నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. అంటే.. షెడ్యూల్ కు పోలింగ్ కు మధ్య 32 రోజుల వ్యవధే ఉండింది. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఏపీలో నాలుగో దశలో పోలింగ్ జరగనుంది. మార్చి 16 (శనివారం) షెడ్యూల్ విడుదల కాగా.. ఎన్నికల పోలింగ్ మే 13న జరగనుంది. అంటే.. షెడ్యూల్ కు పోలింగ్ కు మధ్య దూరం 58 రోజులు.

ఈసారి ఏపీలో అధికారపక్షం వర్సెస్ విపక్ష కూటమిగా మారింది. అధికార వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తుంటే.. విపక్ష తెలుగుదేశం.. తన పాత మిత్రులైన జనసేన.. బీజేపీలతో కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేస్తోంది. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇటీవలే కొలిక్కి వచ్చింది. ఏపీ అధికార పక్షం ఒకే ఒక్కరోజున సింగిల్ షాట్ లో మొత్తం 175 స్థానాలకు.. 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. విపక్ష టీడీపీ మాత్రం ఇంకా అభ్యర్థుల పంచాయితీ నుంచి బయటకు రాలేదు.

ఇప్పటికే రెండు జాబితాల్ని విడుదల చేసిన తర్వాత కూడా టీడీపీ ఇంకా 16 అసెంబ్లీ స్థానాలకు.. 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. జనసేన 13 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. బీజేపీ కూడా తాను బరిలో నిలిచే అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించలేదు. దీనికి మరికొంత టైం పడుతుంది. పొత్తుల్లో భాగంగా టీడీపీ.. జనసేన నుంచి టికెట్లు ఆశించిన అభ్యర్థులు నిరాశకు గురి కావటమే కాదు.. తమ అసంత్రప్తిని ప్రదర్శించే వీలుంది. దీంతో.. వీరిని బుజ్జగించటం పెద్ద తలనొప్పి కానుంది.

వీటన్నింటికి కొంత టైం పట్టే వీలుంది. తాజా షెడ్యూల్ పుణ్యమా అని.. అన్ని అంశాల్ని సెటిల్ చేసుకునేందుకు సమయం లభించేలా ఉంది. మరోవైపు అధికారపక్షానికి పెద్ద తలనొప్పిగా మారనుంది. షెడ్యూల్ కు పోలింగ్ కు మధ్య వ్యవధి ఎక్కువగా ఉండటం.. అభ్యర్థులు ఫైనల్ కావటంతో వారు తక్షణం ప్రచారం మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఖర్చు విషయంలోనూ తడిసి మోపెడయ్యే ఇబ్బంది ఉంది.