జగన్ తో కమలం దోస్తీ నిజమేనా? బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు
ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కొనసాగాలని మాధవ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మరో 30 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుందని మాధవ్ ధీమా వ్యక్తం చేశారు.
By: Tupaki Political Desk | 29 March 2026 7:00 PM ISTమాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డితో బీజేపీకి మంచి సంబంధాలు ఉన్నాయని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నా, కేంద్ర పెద్దలతో జగన్ సత్సంబంధాలే కొనసాగిస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎన్వీ మాధవ్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు మాజీ సీఎం జగన్మోహనరెడ్డి అరెస్టు అయ్యే అవకాశాలపైనా మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ నిర్వహించిన డిబేట్ కు ఈ ఆదివారం గెస్ట్ గా వెళ్లిన మాధవ్ అనేక అంశాలపై కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా వైసీపీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అంశంపై మాధవ్ వ్యాఖ్యలు రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి.
ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కొనసాగాలని మాధవ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మరో 30 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుందని మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఎదురైన ఓ ప్రశ్నకు మాధవ్ బదులిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే అంశంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో జరిగిన తప్పులకు జైలుకు వెళ్లాల్సిందేనని మాధవ్ అభిప్రాయపడ్డారు. దీంతో మాజీ సీఎం జగన్ కు బీజేపీ రక్షణగా నిలుస్తుందనే వాదనకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ సందర్భంగా జగన్ ను బీజేపీ కాపాడుతుందన్న ప్రచారాన్ని మాధవ్ తోసిపుచ్చారు. ఏపీ లిక్కర్ కేసులో కొందరు ఇప్పటికే దొరికారని, ప్రధాన సూత్రధారిని గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయని మాధవ్ వెల్లడించారు. పక్కా ఆధారాలు లభించినప్పుడు చట్టపరమైన చర్యలు తప్పవని మాధవ్ స్పష్టం చేశారు. అరెస్టు అన్నది కేవలం సమయంతో కూడుకున్నది మాత్రమేనని మాధవ్ వ్యాఖ్యానించారు. ఇక ఈ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఆదేశాలతో ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా పనిచేస్తున్నామని వెల్లడించారు. ప్రతి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నామని, స్థానిక ఎన్నికలలో పార్టీ కేడర్ కు విస్తృత అవకాశాలు కల్పిస్తామని మాధవ్ వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూ విషయంలో మరింత విచారణ జరగాలని మాధవ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చాలా విచారణలు జరిగినా స్పష్టత రాకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, డిబేట్ లో మాజీ సీఎం జగన్ పై బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాధవ్ చేసిన వ్యాఖ్యలే వైరల్ అవుతున్నాయి.
