కాదేదీ మోసానికి అనర్హం.. జాబితాలో 'ఫాస్టాగ్'!
ఇందుగలడందు లేడను సందేహము లేదు అన్నట్టుగా.. సైబర్ నేరగాళ్లు కూడా వెతక్కక్కర లేకుండానే అన్ని చోట్లా తమ తఢాకా చూపిస్తున్నారు.
By: Garuda Media | 17 Feb 2026 6:00 AM ISTఇందుగలడందు లేడను సందేహము లేదు అన్నట్టుగా.. సైబర్ నేరగాళ్లు కూడా వెతక్కక్కర లేకుండానే అన్ని చోట్లా తమ తఢాకా చూపిస్తున్నారు. గత 40 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా 30 లక్షల రూపాయల మేరకు సైబర్ నేరగాళ్లు.. వాహన దారులను మోసగించినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. ఎక్కడ ఎలాంటి చిన్న అవకాశం ఉన్నా.. సైబర్ నేరస్తులు చెలరేగిపోతున్నారని.. వీరి విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరింది.
ఏం జరిగింది?
హైవేలపై ప్రయాణించే వ్యక్తిగత వాహనాలకు టోల్ ఫీజులు చెల్లించేందుకు కేంద్ర రహదారుల శాఖ ఫాస్టా గ్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచి దీనిని పక్కాగా అమలు చేస్తోంది. దీంతో వాహనదారులు ఆన్‌లైన్‌లో ఫాస్టాగ్‌ను కొనుగోలు చేస్తున్నారు. దీనిని ఆసరాగా మార్చుకున్న సైబర్ ముఠాలు.. నకిలీ ఫాస్టాగ్ సైట్లను సృష్టించి.. అచ్చంగా ప్రభుత్వానికి చెందిన సైట్ల మాదిరిగా అవి పనిచేసేలా చేస్తున్నారు. దీంతో వాహన దారులు.. వాటి ద్వారా ఫాస్టాగ్ కోసం నగదు చెల్లించి... మోస పోతున్నారు.
ఇలా.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 30లక్షల రూపాయలను వాహదారులు పోగొట్టుకున్నట్టు కేంద్రం వెల్ల డించింది. ఈ నేపధ్యంలో జాతీయ రహదారుల సంస్థ అప్రమత్తమైంది. ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. కేవలం అధికారిక వెబ్‌సైట్‌లోనే ఫాస్టాగ్ కొనుగోలు చేయాలని సూచించింది. ఫాస్టాగ్ ను పోలిన నకిలీ వైబ్‌సైట్‌లను సైబర్ నేరగాళ్లు సృష్టిస్తున్నారని... యూజర్స్ వీటిని క్లిక్ చేయగానే ఫోన్ నంబరు, వాహన రిజిస్ట్రేషన్ నంబరు వంటి వ్యక్తిగత వివరాలను అడుగుతున్నాయని తెలిపింది.
పేమెంట్ గేట్ వే ద్వారా ఆ సొమ్ము అక్రమంగా మోసగాళ్ల ఖాతాలోకి చేరుతోందని పేర్కొంది. వీటిని నిరోధించాలంటే ఫాస్టాగ్ పాస్‌ల కోసం కేవలం అధికారిక ప్లాట్‌ఫామ్‌లను మాత్రమే వినియోగించాలని కేంద్ర రహదారుల సంస్థ సూచించింది. సో.. మోసానికి కాదేదీ అనర్హం అన్నట్టుగా పేట్రేగుతున్న సైబర్ నేరస్తుల వలలో చిక్కుకోకుండా.. ఒక రోజు ఆలస్యమైనప్పటికీ.. నిర్దేశిత సైట్ నుంచే ఫాస్టాగ్ కొనుగోలు చేయడం ఉత్తమమని అధికారులు కూడా చెబుతున్నారు.
