మోడీ పిలుపు...మూడున్నర కోట్ల ఉద్యోగాలకు ముప్పు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో ఏకంగా దేశంలో మూడున్నర కోట్ల మంది ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందా అన్న చర్చ సాగుతోంది.
By: Satya P | 13 May 2026 9:22 AM ISTప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో ఏకంగా దేశంలో మూడున్నర కోట్ల మంది ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందా అన్న చర్చ సాగుతోంది. ఇంతకీ మోడీ ఏమి చెప్పారు అన్నది చూస్తే బంగారం కొనవద్దు అన్నారు. ఏడాది పాటు అయినా బంగారం జోలికి పోవద్దు అని ఆయన జనాలకు సూచించారు. బంగారం మోజు వీడితే అంతా బాగుంటుందని ఆయన చెప్పారు. మోడీ పిలుపుతో జనాలు కచ్చితంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. దానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. బంగారం ఇపుడు టాప్ రేంజిలో ఉంది. తులం బంగారం ధర పైపైకి పోతూ రెండు లక్షల మార్క్ ని చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో జనాలకు మోడీ సూచన ఎంతో కొంత ప్రియంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి మోడీ చెప్పినది దేశ జనాలు పాటిస్తే ఏమవుతుంది అన్నది కూడా చూడాల్సి ఉంది.
జూవెలర్స్ ఫెడరేషన్ ఆందోళన :
దేశంలో ఉన్న ఆల్ ఇండియా జువెలర్స్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మోడీ ఇలా పిలుపు ఇచ్చారో లేదో వెంటనే ఈ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ కి లేఖ రాశారు. అందులో ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్ళు తగ్గించడం వల్ల 3.5 కోట్ల మందికి ఉగ్యోగ ఉపాధి అవకాశాలు పూర్తిగా ప్రమాదంలో పడతాయని పేర్కొన్నారు. బంగారం వ్యాపారానికే ఇది సంబంధించినది కాదని కోట్లాది మంది ఉద్యోగుల జీవితం కూడా ఇందులో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అయితే విదేశీ మారక ద్రవ్యాలను కాపాడుకునే విషయంలో ఈ సూచన చేయడం సబబు అయినా అదే సమయంలో బులియన్ మార్కెట్ ఫీల్డ్ లో ఉన్న వారి సాధక బాధలు అర్థం చేసుకోవాల్సి ఉందని అన్నారు.
అందరూ నష్టపోతారు :
వినియోగదారులలో వచ్చిన ఆలోచనలలో మార్పుల ప్రభావం వల్ల బంగారం వ్యాపారం తగ్గిపోతే చిన్న తరహా వ్యాపారులు బంగారం పని చేసే స్వర్ణ కారులు చేతి వృత్తుల వారు వీరంతా ఉపాధిని కోల్పోతారని హెచ్చరించారు. అందువల్ల బంగారం దిగుమతులను తగ్గించి విదేశీ మారక నిధులను పెంచుకోవడానికి వేరే ఇతర మార్గాలను అన్వేషించాలని ఆయన కేంద్రానికి సూచిస్తున్నారు అంతే కాదు దేశంలో ఎంతో బంగారం ఉందని అది నిరుపయోగంగా ఉందని దానిని తిరిగి వినియోగంలోకి తీసుకుని వచ్చేలా చూడాలని ఆ విధంగా చేస్తే కనుక దేశీయ బంగారం రంగంలో సమూలమైన మార్పులు వస్తాయని చెప్పారు. ఆ విధంగా పరిశ్రమను కూడా కాపాడుకోవచ్చునని విదేశీ మారక నిల్వలను పొదుపు చేసుకోవచ్చునని ఆయన సూచించారు. మరి కేంద్ర ప్రభుత్వం ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుంటుందా అన్నది చూడాలి. ఏ నిర్ణయం తీసుకున్నా దాని చుట్టూ బహుముఖీయమైన అంశాలు ముడిపడి ఉంటాయి. అందువల్ల దానిని లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని బులియన్ మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు.
