Begin typing your search above and press return to search.

2025లో రికార్డు స్థాయిలో విదేశీ పర్యటనలు.. ఇండియన్స్ సత్తా ఏంటో చూసిన దేశాలు..

ఇప్పుడు ఎవరిని పలకరించినా ‘సెలవులకు ఎక్కడికి వెళ్తున్నారు?’ అని అడిగితే, లోకల్ టూర్ల కంటే విదేశాలపైవే చూపిస్తున్నారు

By:  Tupaki Political Desk   |   2 March 2026 3:08 PM IST
2025లో రికార్డు స్థాయిలో విదేశీ పర్యటనలు.. ఇండియన్స్ సత్తా ఏంటో చూసిన దేశాలు..
X

ఇప్పుడు ఎవరిని పలకరించినా ‘సెలవులకు ఎక్కడికి వెళ్తున్నారు?’ అని అడిగితే, లోకల్ టూర్ల కంటే విదేశాలపైవే చూపిస్తున్నారు. మన భారతీయుల్లో విదేశీ పర్యటనల పట్ల క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిందో చెప్పడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా 2025 వార్షిక నివేదిక చక్కని ఉదాహరణ. ఈ నివేదిక ప్రకారం.., గతేడాది ఏకంగా 3.27 కోట్ల మంది భారతీయులు విదేశాలకు విమానం ఎక్కారు. ఇందులో విశేషం ఏంటంటే, కేవలం సరదా కోసం, అంటే ‘విశ్రాంతి’ కోసమే వెళ్లిన వారి సంఖ్య కోట్లలో ఉంది.

సరదా కోసమే 1.43 కోట్ల మంది!

మనం సాధారణంగా విదేశాలకు వెళ్తున్నారంటే.. ఎవరో చుట్టాల ఇంటికో, లేదా ఆఫీస్ పని మీదో వెళ్తుంటారని అనుకుంటాం. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. 2025లో మొత్తం ప్రయాణికుల్లో దాదాపు 43.5 శాతం మంది అంటే సుమారు 1.43 కోట్ల మంది కేవలం రిలాక్స్ అవ్వడానికి, కొత్త ప్రదేశాలను చూసేందుకు మాత్రమే వెళ్లారు. 2023తో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం. అంటే, భారతీయులకు ఇప్పుడు తమ ఆనందం కోసం, కొత్త అనుభవాల కోసం ఖర్చు చేయడం ప్రాధాన్యతగా మారిపోయింది.

చాలామందికి ఒక అనుమానం రావచ్చు.. అసలు ఈ రిలాక్స్ ట్రావెల్ అంటే ఏంటి అని? ఏమీ లేదు, ఆఫీస్ టెన్షన్లు, రోజువారీ రొటీన్ పనుల నుంచి బ్రేక్ తీసుకొని, మనసుకు నచ్చినట్టు గడపడమే రిలాక్స్ ట్రావెలింగ్.. అది ఒక అందమైన బీచ్‌లో సోమరిగా పడుకోవడం కావచ్చు, కొత్త నగరంలోని వీధుల్లో తిరుగుతూ అక్కడి వంటలను రుచి చూడడం కావచ్చు, లేదంటే కుటుంబంతో కలిసి సరదాగా గడపడం కావచ్చు. వ్యాపార పర్యటనల్లో లాగా ఇక్కడ మీటింగ్స్ ఉండవు, షెడ్యూల్స్ ఉండవు. ఎప్పుడు నిద్రలేవాలి, ఎక్కడ తినాలి అనేది మీ ఇష్టం. అందుకే మన వాళ్లు ఇలాంటి ప్రయాణాలకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.

ఎక్కడికి ఎక్కువగా వెళ్తున్నారు..?

భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్న దేశాల జాబితాను పరిశీలిస్తే.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మొదటి స్థానంలో ఉంది. దుబాయ్ లాంటి నగరాలు మన వాళ్లకు హాట్ ఫేవరెట్. ఆ తర్వాత సౌదీ అరేబియా, థాయిలాండ్, అమెరికా, సింగపూర్ వంటి దేశాలు టాప్-5లో ఉన్నాయి. మలేషియా, వియత్నాం, శ్రీలంక వంటి దేశాలకు కూడా పర్యాటకుల తాకిడి పెరిగింది. తక్కువ ఖర్చులో విదేశీ అనుభూతిని ఇచ్చే వియత్నాం, థాయిలాండ్ లాంటి దేశాలకు ఇప్పుడు యువత క్యూ కడుతున్నారు.

సులభమైన ప్రయాణం

ఒకప్పుడు టికెట్లు బుక్ చేయాలన్నా, హోటళ్లు వెతకాలన్నా ట్రావెల్ ఏజెంట్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు చేతిలో ఫోన్ ఉంటే చాలు, నిమిషాల్లో అంతా అయిపోతోంది. థ్రిల్లోఫిలియా వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ప్లానింగ్‌ను చాలా సులభం చేసేశాయి. కేవలం డిస్కౌంట్లు మాత్రమే కాకుండా, నాణ్యమైన సౌకర్యాలు, లోతైన అనుభవాలను ఇచ్చే టూర్ ప్యాకేజీలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక 'బ్లీజర్' (Bleisure) అనే కొత్త ట్రెండ్ కూడా మొదలైంది. అంటే ఆఫీస్ పని మీద వెళ్లినప్పుడు, ఆ పని ముగిశాక మరో రెండు మూడు రోజులు అక్కడే ఉండి సరదాగా గడిపి రావడం అన్నమాట.

భారతీయుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం, ప్రపంచాన్ని చూడాలనే ఆత్రుత పెరగడం వల్ల విదేశీ పర్యటనలు ఇప్పుడు సామాన్యులకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. లాయల్టీ ప్రోగ్రామ్‌లు, సీజనల్ ఆఫర్లను వాడుకుంటూ బడ్జెట్లోనే విదేశీ యాత్రలు పూర్తి చేసేలా మన వాళ్లు ప్లాన్ చేసుకుంటున్నారు. 2025 నివేదిక చెబుతున్న మాట ఒక్కటే.. భారతీయులు ఇప్పుడు కేవలం సంపాదించడమే కాదు, జీవితాన్ని ఆస్వాదించడం కూడా నేర్చుకున్నారు!