Begin typing your search above and press return to search.

జనవరి 26న ఎర్రకోట సాక్షిగా అరుదైన సన్నివేశం

ఈసారి గణతంత్ర వేడుకల్లో అరుదైన సీన్ ఒకటి అందరిని ఆ జంట వైపు చూపు పడేలా చేస్తోంది. గత ఏడాది పెళ్లి చేసుకున్న సైనికాధికారుల జంట.. వేర్వేరు దళాలకు ప్రాతినిధ్యం వహించటం ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   21 Jan 2024 6:47 AM GMT
జనవరి 26న ఎర్రకోట సాక్షిగా అరుదైన సన్నివేశం
X

ప్రతి ఏడాది జనవరి 26న నిర్వహించే రిపబ్లిక్ డే వేడుకల్ని దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సాక్షిగా నిర్వహించే విషయం తెలిసిందే. రిపబ్లిక్ వేడుకల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాలుపంచుకునే చిన్న అవకాశాన్ని సైతం గొప్పగా ఫీల్ అవుతుంటారు. తమ జీవితకాలంలో రిపబ్లిక్ డే వేడుకల్లో భాగస్వామి అయ్యేందుకు ఉన్న అవకాశాల కోసం పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


ఈసారి గణతంత్ర వేడుకల్లో అరుదైన సీన్ ఒకటి అందరిని ఆ జంట వైపు చూపు పడేలా చేస్తోంది. గత ఏడాది పెళ్లి చేసుకున్న సైనికాధికారుల జంట.. వేర్వేరు దళాలకు ప్రాతినిధ్యం వహించటం ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ సుప్రీత్ ఒక సేవా దళానికి నేత్రత్వం వహిస్తుంటే.. ఆమె భర్త మేజర్ జెర్రీ బ్లైజ్ మరో దళానికి నేత్రత్వం వహిస్తున్నారు. ఇలా రిపబ్లిక్ డే నాడు నిర్వహించే కవాతులో భార్యభర్తలు ఇద్దరు రెండు వేర్వేరు దళాలకు నేత్రత్వం వహించటంచాలా అరుదైన అంశంగా చెబుతున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గణతంత్ర వేడుకల్లో తొలుత భార్య సుప్రీత ఎంపిక కాగా.. ఆ తర్వాత ఆమె భర్త మరో దళం చేసే కవాతుకు ఎంపికయ్యారు. కాలేజీ చదివే రోజుల్లో వీరిద్దరు ఎన్ సీసీలో పని చేశారు. కాలేజీ రోజుల్లోనే వీరిద్దరు వేర్వేరు గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. సుప్రీత సొంతూరు కర్ణాటకలోని మైసూరు కాగా.. భర్తది మాత్రం తమిళనాడులోని వెల్లింగ్టన్.

సుప్రీత లా గ్రాడ్యుయేట్ కాగా.. బ్లైజ్ మాత్రం బెంగళూరులోని జైన్ వర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. భర్త మద్రాస్ రెజిమెంట్ కు.. భార్య మిలిటరీ పోలీసు కోర్ రెజిమెంట్ కు చెందిన వారు. దీంతో.. వీరిద్దరు వేర్వేరుగా తమ పరేడ్ కు అవసరమైన ప్రాక్టీస్ ను చేస్తున్నారు. ఇలా.. భార్యభర్తలు ఇద్దరు సైన్యంలో పని చేస్తూ.. రిపబ్లిక్ వేడుకల వేళ నిర్వహించే పరేడ్ లో రెండు దళాలకు నాయకత్వం వహించటం ఆసక్తికరంగా మారింది.