ఆ రికార్డు టీడీపీ బీఆర్ఎస్ లదే !
దేశంలో ప్రాంతీయ పార్టీల శకం మొదలైంది దక్షిణాదినే. ఇక అవి బలంగా సైద్ధాంతికంగా వేళ్ళూనుకున్నది కూడా ఇక్కడే.
By: Tupaki Desk | 14 April 2025 1:00 PM ISTదేశంలో ప్రాంతీయ పార్టీల శకం మొదలైంది దక్షిణాదినే. ఇక అవి బలంగా సైద్ధాంతికంగా వేళ్ళూనుకున్నది కూడా ఇక్కడే. తమిళనాడులో ద్రవిడ పార్టీల చరిత్ర ఆరు దశాబ్దాల పై మాటగానే ఉంది. తెలుగు నాట చూస్తే తెలుగుదేశం పార్టీది దాదాపుగా నాలుగున్నర దశాబ్దాల చరిత్ర.
టీడీపీ ఏర్పడ్డాక ప్రాంతీయ పార్టీలకు ఒక గ్లామర్ గ్రామర్ ఏర్పడ్డాయి అంటే అతిశయోక్తి కాదు. అప్పటిదాకా ప్రాంతీయ స్థాయిలోనే రాజకీయాలు చేసిన పార్టీలకు జాతీయ గుర్తింపు గౌరవం టీడీపీతోనే వచ్చింది అన్నది కూడా వాస్తవం.
ఇదిలా ఉంటే తెలుగునాట టీడీపీ ఉండగానే ఉమ్మడి ఏపీలో మరో ప్రాంతీయ పార్టీ పుట్టింది. అది కూడా టీడీపీ నుంచే పుట్టింది. 2021 ఏప్రిల్ 27న తెలంగాణా రాష్ట్ర సమితి పేరుతో ఏర్పాటు చేసింది ఒకనాటి టీడీపీ కీలక నాయకుడు అయిన కేసీఆర్. ఆ తరువాత ఆ పార్టీ తెలంగాణా రాష్ట్రం కోసం ఉద్యమించింది.
చివరికి అది సాకారం అయింది. రెండు సార్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇక మూడేళ్ల క్రితం టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని తలచి బీఆర్ఎస్ గా మారింది. ఇపుడు చూస్తే బీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానంలో కీలకమైన ఘట్టానికి చేరుకుంది. పాతికేళ్ళ పండుగను ఈ నెల 27న చేసుకోబోతోంది.
పోరుగడ్డ అయిన ఓరుగల్లు వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తెలుగునాట రజతోత్సవ వేడుకలను జరుపుకున్న ప్రాంతీయ పార్టీలు రెండే ఉన్నాయని అందులో మొదటిది టీడీపీ అయితే రెండవది బీఆర్ఎస్ అని అన్నారు. మిగిలిన పార్టీలు అన్నీ పుబ్బలో పుట్టి మఖలో మాడిపోయినవే అని ఆయన చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ గా మారినా జెండా అజెండా మారలేదు, నాయకుడూ మారలేదని ఆయన చెప్పారు. గులాబీ రంగు చూస్తే చాలు జనమంతా తెలంగాణా పార్టీ అని గుర్తుంచుకుంటారని చెప్పారు. లక్షలాది మందితో రజతోత్సవ వేడుకలను ఈసారి చేస్తున్నామని ఆయన చెప్పారు.
ఇదిలా ఉంటే తెలుగునాట ఇపుడు మరో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అవి వైసీపీ జనసేన. వైసీపీ తాజాగా 15 ఏళ్ళ పండుగను చేసుకుంటే జనసేన 12 ఏళ్ళ పండుగను చేసుకుంది. ఈ పార్టీలు కూడా బలంగా ఉంటూ ముందుకు సాగుతున్నాయి. మరి ఈ రెండు పార్టీలలో రజతోత్సవం చూసే పార్టీలు ఏవి అన్న చర్చ కూడా ఉంది.
ఏది ఏమైనా తెలుగు జనాలు మొదట్లో జాతీయ పార్టీల వైపే ఉండేవారు. వారికే పట్టం కట్టేవారు. కానీ రాను రానూ రాజకీయాలు మారాయి. ప్రజల ఆలోచనలూ మారాయి. ఆ కారణం చేతనే ప్రాంతీయ పార్టీలు పుట్టుకుని వస్తున్నాయి. వాటికి జనం దీవెనలు ఉండబట్టే కాలాలను అన్నింటినీ దాటి ముందుకు విజయవంతంగా సాగుతున్నాయని చెప్పాలి. ఇలా పార్టీలు కీలక ఘట్టాలను చేరుకుంటున్నాయంటే అందులో తెలుగు జాతి రాజకీయ చైతన్యం కూడా దాగి ఉందన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం.
