Begin typing your search above and press return to search.

ప్రభుత్వ ఆస్పత్రిలో 24మంది మృతి... కారణం అత్యంత దారుణం!

ఆగస్టులో ఠాణేలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో ఒకేరోజు 18మంది రోగులు మృతిచెందిన ఘటన మరువక ముందే.. తాజాగా నాందేడ్‌ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో మరో దారుణం వెలుగుచూసింది.

By:  Tupaki Desk   |   3 Oct 2023 4:08 AM GMT
ప్రభుత్వ ఆస్పత్రిలో 24మంది మృతి... కారణం అత్యంత దారుణం!
X

ఒక వ్యక్తికి వచ్చిన రోగం కంటే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడం వచ్చే ప్రమాదం ఎక్కువనే వ్యాఖ్యలు బలంగా వినిపించే సంగతి తెలిసిందే! ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడమంటే... అది దింపుడు కల్లం ఆశ అనే మాటలూ వినిపించేవి! వాటికి బలం చేకూర్చేలా తాజాగా ఒక మహా విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వాసుపత్రిలో ఘోరం జరిగిపోయింది. ఈ దారుణం మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

అవును... మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మరో అత్యంత దారుణ విషాదం చోటుచేసుకుంది. ఆగస్టులో ఠాణేలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో ఒకేరోజు 18మంది రోగులు మృతిచెందిన ఘటన మరువక ముందే.. తాజాగా నాందేడ్‌ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో మరో దారుణం వెలుగుచూసింది. ఆ అసుపత్రిలో ఒకేరోజు 24 మంది మృత్యువాతపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వీరిలో 12 మంది అప్పుడే పుట్టిన పిల్లలు ఉండటం మరింత కలకలం రేపుతోంది.

నవజాత శిశువులకు మహారాష్ట్రలోని నాందేడ్ ఆసుపత్రి నూరేళ్లు నింపేసింది. ప్రభుత్వాసుపత్రులంటే యమలోకానికి ప్రవేశ మార్గాలనే విమర్శకు బలం చేకూర్చేపనికి పూనుకుంది! ఈ క్రమంలో తాజాగా గడిచిన 24గంటల వ్యవధిలో ఆస్పత్రిలో సుమారు 24 మంది మృతి చెందారు. మృతుల్లో 12మంది నవజాతా శిశువులు ఉండగా... వారిలో ఆరుగురు మగ శిశువులు.. ఆరుగురు ఆడ శిశువులు!

ఈ మరణాలపై ఆస్పత్రి వైద్యుడు డా.శ్యాం రావు వకోడే స్పందించారు. 12 మంది చిన్నారులు మృతి చెందారని.. మరో 12 మంది వేర్వేరు కారణాలతో మరణించారని.. ఆస్పత్రిలో సరిపడా సిబ్బంది లేక ఇబ్బందులు వచ్చాయని.. రోగుల కోసం కేటాయించిన బడ్జెట్‌ సర్దుబాటు కాలేదని చెప్పడం గమనార్హం.

దీంతో ఈ మహా విషాధంపై విపక్షాలు మండిపడుతున్నాయి.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. మహారాష్ట్రలోని ట్రిపుల్ ఇంజన్ సర్కారే (బీజేపీ, ఏక్‌ నాథ్ షిండే శివసేన, ఎన్సీపీ - అజిత్ పవార్ వర్గం) ఈ మరణాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా క్యాంపైన్ నిర్వహిస్తున్నాయి. ఇది ట్రిపుల్ ఇంజిన్ ఎఫెక్ట్ అని ఎద్దేవా చేస్తున్నాయి!

ఈ ఘటనపై శివసేన (యూబీటీ) నేత, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 12మంది నవజాతా శిశువులు మృతిచెందడం చాలా తీవ్రమైన అంశమని తెలిపారు. మహారాష్ట్రలో... రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత ఏర్పడిందని, కేఈఎం ఆస్పత్రి వ్యవహారంలో పాదయాత్ర చేసినా శిండే సర్కార్‌ మౌనం వహిస్తోందని దుయ్యబట్టారు.