Begin typing your search above and press return to search.

21 ఏళ్ల తెలగు అమ్మాయి ఏం చేసిందో తెలుసా? ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే...

విజయవాడకు చెందిన ధవళ సాయి.. 21 ఏళ్ల తెలుగు అమ్మాయి. బిజినెస్ ఫైనాన్స్ లో డిగ్రీ చేసింది. ఈ వయసు యువత సహజంగా తమ అర్హతలకు సరిపోయే ఉద్యోగం వెతుక్కుంటారు.

By:  Tupaki Political Desk   |   15 Nov 2025 5:00 PM IST
21 ఏళ్ల తెలగు అమ్మాయి ఏం చేసిందో తెలుసా? ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే...
X

విజయవాడకు చెందిన ధవళ సాయి.. 21 ఏళ్ల తెలుగు అమ్మాయి. బిజినెస్ ఫైనాన్స్ లో డిగ్రీ చేసింది. ఈ వయసు యువత సహజంగా తమ అర్హతలకు సరిపోయే ఉద్యోగం వెతుక్కుంటారు. తమ టాలెంట్ నిరూపించుకునో.. లేక ఎవరి రికమెండేషన్ తోనూ ఒక ఉద్యోగం వస్తుందని ఆశిస్తారు. కానీ, ధవళ సాయి ఇలా ఉద్యోగం చేయాలని అనుకోలేదు. తానే పది మందికి ఉద్యోగాలు ఇవ్వాలని భావించింది. అనుకున్నదే తడువుగా ప్రభుత్వంతో సంప్రదించింది. రెండు పదుల వయసున్న ఆ యువతి ఉత్సాహాన్ని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఫిదా అయ్యారు. ఆమె ఆసక్తిని తెలుసుకుని వెన్నుతట్టి ప్రోత్సహించారు. విశాఖ సీఐఐ సమ్మిట్ లో 21 ఏళ్ల ధవళ సాయితో ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. డ్రోన్ ట్రాఫిక్ పై ఆమె ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ఆసక్తికరంగా ఉన్న సాయి జర్నీ అందరూ తెలుసుకోవాల్సిందే..

డ్రోన్ టెక్నాలజీ.. ఇప్పుడు అందరికీ తెలిసిందే.. వ్యవసాయం కొందరు, వివాహాల సమయంలో వీడియో చిత్రీకరణకు మరికొందరు డ్రోన్స్ వాడుతున్నారు. అయితే భవిష్యత్ లో డ్రోన్స్ మరెన్నో అద్భుతాలు సృష్టించబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎయిర్ ట్యాక్సీలు త్వరలో రానున్నాయని అంటున్నారు. అంతేకాకుండా ఆహారం, మందుల పంపిణీ, అత్యావసర సమయాల్లో సహాయక కార్యక్రమాలకు డ్రోన్లను వాడటం భవిష్యత్తులో మరింత పెరుగుతుందని అంటున్నారు.

దీంతో డ్రోన్ ట్రాఫిక్ భారీగా పెరిగే అవకాశం ఉందనే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఒక డ్రోన్ ఆపరేట్ చేయడానికి ఒక పైలట్ అవసరమవుతున్నాడు. కానీ భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకుంటే అంతమంది పైలట్లు అందుబాటులో ఉండటం కష్టమే అవుతోంది. దీంతో ఈ రంగంలో పరిశోధనలు చేస్తూ.. ఒక్కరే ఒకే సమయంలో వంద డ్రోన్లు ఆపరేట్ చేసే టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్నారు ధవళ సాయి. బిజినెస్‌ ఫైనాన్స్‌లో డిగ్రీ చేసిన సాయి బెంగళూరులో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేశారు.

ప్రస్తుతం డ్రోన్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ఆమె పనిచేస్తున్నారు. ప్రముఖ సైంటిస్ట్‌ ఘోష్‌, కో-ఫౌండర్‌ ఓంకార్‌ చోప్రాతో కలిసి అల్గోబొటిక్స్‌ అనే ప్రాజెక్ట్‌ చేపట్టారు. ఈ ప్రాజెక్టుపై పరిశోధనలు పూర్తి కావడంతో పరిశ్రమ ప్రారంభించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ప్రభుత్వం ప్రకటించిన కర్నూలు డ్రోన్ సిటీ సాయి అండ్ టీం ను ఆకర్షంచిందని అంటున్నారు. కర్నూలు బెంగళూరుకు దగ్గరగా ఉండటంతో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే డ్రోన్ సిటీలో పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా విశాఖలో జరుగుతున్న సీఐఐ సమ్మిట్ కు హాజరై ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకున్నారు. చిన్న వయసులో సాయి ఇలా ఒక కంపెనీని స్థాపించడానికి ముందుకు రావడం, ప్రభుత్వం కూడా ప్రోత్సహించడం ఆసక్తికరంగా చెబుతున్నారు.