మూడ్ ఆఫ్ 2029....మోడీనా వారసులా ?
ఈ రోజుకీ ఈ ప్రశ్నకు బహుశా బీజేపీలోనూ జవాబు లేదు అనుకోవాలి. ఎందుకంటే మోడీ వయసు ఏడున్నర పదులు కావచ్చు. కానీ ఆయన ఇంకా చురుకుగా రాజకీయాల్లో ఉన్నారు.
By: Satya P | 24 Dec 2025 6:00 AM ISTప్రపంచం ఇంకా 2025 గడప దగ్గరే ఉంది. కొద్ది రోజులలో 2026లోకి అంతా అడుగు పెడతారు ఇక అక్కడ నుంచి 2029 కి మరో మూడేళ్ళు గట్టిగా బిగుసుకుని ఉంది. అయినా సరే భారత దేశంలో ఇపుడు 2029 మీదనే హాట్ డిస్కషన్ జరుగుతోందా అన్నదే ఒక ఆసక్తిని పెంచే విషయం. అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ గా ఉన్న ఒక సంస్థ అయితే అపుడే మూడ్ ఆఫ్ 2029కి వెళ్ళిపోయి మోడీనా వారసులా అంటూ కొత్త డిబేట్ కి దేశంలో తెర తీసింది. మోడీ హ్యాట్రిక్ పీఎం గా ఈ రోజున దేశంలో ఉన్నారు. ఆయన చేతిలో ఇంకా మూడున్నరేళ్ల అధికారం ఉంది. ఈ రోజున చూస్తే రాజకీయంగా బీజేపీ బలంగా ఉంది. లేటెస్ట్ గా వివిధ రాష్ట్రాలలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాషాయం జెండా బ్రహ్మాండంగా ఎగిరింది. 2026 లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం లలో అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నాయి. వీటిలో అసోం, బెంగాల్ లలో తాము గెలిచి తీరుతామని తమిళనాడులో గట్టిగా నిలబడతామని కేరళాలో మొలకెత్తుతామని బీజేపీ ఎంతో ఆశగా ఉంది.
మళ్ళీ బీజేపీకి :
ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో బీజేపీ 400 ప్లస్ అంటూ బరిలోకి దిగింది. అంటే ఎన్డీయేకు 400 ఎంపీ సీట్లు, బీజేపీకి 370 సీట్లు అని లక్ష్యం పెట్టుకుంది. అయితే బీజేపీ ఆశలు ఏవీ తీరలేదు. ఆ పార్టీ సొంత బలం 240 దగ్గర ఆగిపోయింది. దాంతో మూడవసారి ప్రధానిగా మోడీ కావడానికి మిత్రుల మీద ఆధారపడాల్సి వచ్చింది. అలా ఏపీ నుంచి చంద్రబాబు బీహార్ నుంచి నితీష్ కుమార్ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారారు. అయితే ఇలాంటి పరిస్థితి రిపీట్ కాకుండా 2029లో పూర్తి మెజారిటీ సాధించాలని బీజేపీ తన ప్రయత్నాలను మొదలెట్టింది. కానీ తాజగా ఒక అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ తన అంచనాలలో అయితే బీజేపీకి సొంతంగా మెజారిటీ 2029లో రాకపోతే ఏమి జరుగుతుంది అన్నది విశ్లేషించింది.
మోడీ వారసులు :
ఈ రోజుకీ ఈ ప్రశ్నకు బహుశా బీజేపీలోనూ జవాబు లేదు అనుకోవాలి. ఎందుకంటే మోడీ వయసు ఏడున్నర పదులు కావచ్చు. కానీ ఆయన ఇంకా చురుకుగా రాజకీయాల్లో ఉన్నారు. అదే సమయంలో ఆయన తాను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని ఎక్కడా చెప్పలేదని అంటున్నారు. అయితే తన విశ్లేషణలో రాయిటర్స్ బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోతే ఎన్డీయేలో బలమైన ప్రాంతీయ పార్టీల చెల్లుబాటు కావచ్చు అని రాసుకొచ్చింది. దీంతో మోడీ వారసుల జాబితాలో బీజేపీలో ముఖ్యులతో పాటు ప్రాంతీయ పార్టీల నేతలు కూడా కొందరిని చేర్చింది. దాంతో ఈ విశ్లేషణ ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోంది అని అంటున్నారు.
అది పెద్ద జాబితానే :
ఇక బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోతే 2024 మాదిరిగా మరోసారి మోడీని ప్రధాని పీఠం మీద కూర్చోబెట్టడానికి ఆనాటి రాజకీయ పరిస్థితులు అంగీకరించకపోవచ్చు అన్నది ఈ వార్తా విశ్లేషణ మూలం అనుకోవాలి అలా కనుక జరిగితే అమిత్ షా పేరు మోడీ వారసుల జాబితాలో ముందు ఉంటుందని పేర్కొంది. అలాగే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేరు కూడా ప్రస్తావించింది. అదే సమయంలో మోడీతో పాటుగా ఎంతో ప్రజాదరణ ఉంటూ హిందూత్వ బ్రాండ్ అయిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ పేరుని మాత్రం విస్మరించింది అని అంటున్నారు. ఇక బీజేపీలో రాజ్ నాధ్ సింగ్ ఉన్నారు నితిన్ గడ్కరీ ఉన్నారు ఇలా ఎంతో మంది కీలక నేతలు ఉన్నారు. అయితే ఈ కధనం మాత్రం ప్రాంతీయ పార్టీల నుంచి చంద్రబాబు పేరుని ముందుకు తేవడం మరో విశేషం.
బాబుకు చాన్స్ అంటూ :
ఎన్డీయేలో కీలకంగా ఉన్న చంద్రబాబు 2029 నాటికి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు అన్న చర్చ అయితే ఉంది. ఒక వేళ బీజేపీకి తగిన మెజారిటీ రాకపోతే మిత్రులకు ఎక్కువ సీట్లు వస్తే సహజంగానే బాబు పోటీలో ఉంటారు అన్నది ఈ కధనం సారాంశంగా ఉంది. అయితే ఇంకా మూడున్నరేళ్ళ సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఆ రాజకీయ అంచనాల మీద కరెక్ట్ గా ఎవరూ విశ్లేషించలేరని అంటున్నారు. ఏది ఏమైనా మోడీ వారసులు అన్నదే కొత్తగా ఉంది అని అంటున్నారు. అలాగే మూడ్ ఆఫ్ 2029 ని 2025 చివర్లలో ఉండి విశ్లేషించడం ఎప్పటికపుడు మారే రాజకీయాల కోణం నుంచి చూస్తే కరెక్ట్ కాదు అనే అంటున్నారు.
