హురున్ జాబితా : తెలుగు తేజాలకు అగ్రస్థానం!
రూ.3.81 లక్షల కోట్ల విలువ కలిగిన కోటక్ మహీంద్రా బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా శాంతి ఏకాంబరం వ్యవహరిస్తున్నారు.
By: Tupaki Desk | 5 Jun 2025 8:48 PM ISTభారత ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర రోజురోజుకూ కీలకమవుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న 97 మంది శక్తిమంతమైన మహిళలతో కూడిన '2025 కాండెరే హురున్ ఇండియా మహిళా నాయకుల జాబితా'ను హురున్ తాజాగా విడుదల చేసింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు శాంతి ఏకాంబరం (బ్యాంకింగ్ రంగం), రాధా వెంబు (సాంకేతిక రంగం)లు కీలక స్థానాల్లో నిలిచి, తెలుగువారికి గర్వకారణంగా నిలిచారు.
ఆర్థిక, సాంకేతిక, దాతృత్వం, కళలు, అంకుర సంస్థలకు సంబంధించిన మహిళలతో కూడిన ఈ తొలి జాబితా విడుదలవడం విశేషం. ఇందులో బ్యాంకింగ్ రంగం నుంచి కోటక్ మహీంద్రా బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ శాంతి ఏకాంబరం, టెక్నాలజీ నుంచి జోహో సహ వ్యవస్థాపకురాలు రాధా వెంబు, అలాగే ఇన్ఫ్లుయెన్సర్‌గా ప్రభావాన్ని చూపుతున్న మృణాల్ పంచాల్ వంటివారు ఉన్నారు. ఆయా మహిళలు నేతృత్వం వహిస్తున్న కంపెనీల విలువ ఆధారంగా, 10 మందితో కూడిన రంగాల వారీగా జాబితాను రూపొందించారు.
-శాంతి ఏకాంబరంకు అగ్రస్థానం:
రూ.3.81 లక్షల కోట్ల విలువ కలిగిన కోటక్ మహీంద్రా బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా శాంతి ఏకాంబరం వ్యవహరిస్తున్నారు. మహిళా వృత్తి నిపుణుల్లో ఈమెకు జాబితాలో అగ్రస్థానం లభించడం విశేషం. తన అపార అనుభవంతో కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.
-సంపద సృష్టిలో రాధా వెంబు ముందంజ:
జోహో సహ వ్యవస్థాపకురాలు రాధా వెంబు సంపద సృష్టిలో పాలుపంచుకున్న తొలితరం నేతగా నిలిచారు. ఈమె వ్యక్తిగత సంపద విలువ రూ.55,300 కోట్లుగా అంచనా వేయబడింది. సాంకేతిక రంగంలో తనదైన ముద్ర వేసి, వేల కోట్ల రూపాయల సంపదను సృష్టించిన ఆమె, భారతీయ టెక్ పరిశ్రమకు ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈమె తరవాతి స్థానంలో రూ.48,900 కోట్లతో అరిస్టా నెట్‌వర్క్స్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ నిలిచారు.
-ఇతర ప్రముఖులు:
రూ.1.44 లక్షల కోట్ల విలువైన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ పర్మీందర్ చోప్రా తదుపరి స్థానంలో ఉన్నారు.రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈషా అంబానీ 6వ స్థానంలో నిలిచారు.అంకుర సంస్థ మృచా బ్యూటీ వ్యవస్థాపకురాలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 55 లక్షల మంది ఫాలోవర్లను కలిగిన మృణాల్ పంచాల్, ఇన్ఫ్లుయెన్సర్ వ్యవస్థాపకుల్లో తొలిస్థానంలో నిలిచారు.హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్ రోష్ని నాడార్ భావితరం మహిళా నేతల్లో అగ్రస్థానంలో నిలిచారు. ఆమె నేతృత్వంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 60 దేశాలకు విస్తరించి, రూ.1.11 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. దేశంలో మూడో సంపన్న మహిళగా రోష్ని నాడార్ గుర్తింపు పొందారు.
-నగరాల ప్రాతినిధ్యం, వయస్సు రీత్యా ఎవరంటే?
ఈ జాబితాలోని వారిలో 38 మంది ముంబై నుంచే ఉన్నారు. ఢిల్లీ నుంచి 12 మంది, బెంగళూరు నుంచి 10 మందితో, ఈ నగరాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. శక్తిమంతమైన మహిళల సగటు వయస్సు 51 సంవత్సరాలు కాగా, మొత్తం జాబితాలో 25 శాతం మంది వయస్సు 26-35 ఏళ్ల మధ్య ఉంది. ఆర్థిక రంగం నుంచి 23 మంది, వినియోగ ఉత్పత్తుల రంగం నుంచి 18 మంది, ఆరోగ్య సంరక్షణ రంగం నుంచి 14 మందికి చోటు లభించింది.
రూ.154 కోట్లను దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చించిన రోహిణి నీలేకని, దాతృత్వ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. స్కిల్‌మ్యాటిక్ సహ వ్యవస్థాపకురాలు దేవాన్షి కేజ్రీవాల్ (28) అతి పిన్న వయస్కురాలు కాగా, 87 ఏళ్ల కళాకారిణి అర్పితా సింగ్ అతి పెద్దవారు.
మొత్తం ఈ మహిళా వృత్తినిపుణులు నిర్వహిస్తున్న సంస్థల విలువ రూ.11.7 లక్షల కోట్లని నివేదిక వెల్లడించింది. ఈ జాబితా భారతీయ మహిళలు సాధిస్తున్న అద్భుత విజయాలకు, దేశ ఆర్థిక వ్యవస్థలో వారి పెరుగుతున్న ప్రాముఖ్యతకు ప్రతీకగా నిలుస్తోంది.
