Begin typing your search above and press return to search.

2024 లోక్ సభ ఎన్నికల ఖర్చు ఎన్ని వేల కోట్లంటే...?

అవును... 2024 లోక్‌ సభ ఎన్నికలకు అదనంగా రూ.3,147.9 కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్రం పార్లమెంటు ఆమోదాన్ని కోరిందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   13 Dec 2023 2:45 AM GMT
2024 లోక్ సభ ఎన్నికల ఖర్చు ఎన్ని వేల కోట్లంటే...?
X

ఎన్నికలు సమీపిస్తున్నాయంటే నోట్ల కట్టల ప్రవాహాలు దర్శనమిస్తాయని ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది! ఇదే సమయంలో ఎన్నికలు సమీపిస్తున్నాయంటే నేతలు కూడా అన్ని రకాల "అస్త్రాలు" సిద్ధం చేసుకుంటారని చెబుతుంటారు! ఈ సమయంలో ఎన్నికలంటే నేతలకే కాదు.. ప్రభుత్వానికి కూడా భారీగా ఖర్చులు ఉంటాయి! ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం పార్లమెంట్ ను అదనంగా మరో 3వేల కోట్ల రూపాయలు అడిగింది కేంద్రం.

అవును... 2024 లోక్‌ సభ ఎన్నికలకు అదనంగా రూ.3,147.9 కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్రం పార్లమెంటు ఆమోదాన్ని కోరిందని తెలుస్తుంది. ఈ కోరిక ఆమోదం పొందిన తర్వాత.. అదనపు నిధులు చట్టం, న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా ఎన్నికల సంబంధిత వ్యయం మొదట కేటాయించిన రూ.2,183.8 కోట్ల నుండి రూ.5,331.7 కోట్లకు చేరుకుంటుంది.

2023-24 గ్రాంట్ల కోసం అనుబంధ డిమాండ్లలో భాగంగా కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు అభ్యర్థనను సమర్పించారు. వాస్తవానికి ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ లో ఈవీఎంల కోసం రూ.1,891.8 కోట్లు, లోక్‌ సభ ఎన్నికలకు రూ.180 కోట్లు, ఓటరు గుర్తింపు కార్డుల కోసం రూ.18 కోట్లు, ఇతర ఎన్నికల ఖర్చుల కోసం రూ.94 కోట్లు కేటాయించారు.

ఈ సమయంలో వరుస ఎన్నికల కారణంతోనో ఏమో కానీ... ఈ సమయంలో అదనంగా రూ.3,147.9 కోట్లు కోరారు. ఇందులో ప్రధానంగా రూ.2,536.65 కోట్లు ఎన్నికల సంబంధిత వ్యయంపై సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యతను నిర్వర్తించడానికి ఉపయోగించబోతుండగా.. సుమారు రూ.611 కోట్లు ఈవీఎం లనూ పరీక్షించడానికి, నిర్వహించడానికి ఉపయోగించబడతాయని అంటున్నారు!

కాగా... ఒక నిర్దిష్ట సంవత్సరంలో ప్రభుత్వ ఖర్చులకు పార్లమెంటు అధికారం ఇచ్చిన నిధులు సరిపోనప్పుడు ఇటువంటి డిమాండ్ చేయబడుతుంది.

ఇక 2004లో సార్వత్రిక ఎన్నికలకు కేంద్రం చేసిన మొత్తం ఖర్చు రూ.1,016 కోట్లు కాగా... 2009లో రూ.1,114.3 కోట్లు, 2014లో రూ.3,870.3 కోట్లు అని తెలుస్తుంది. ఇదే సమయంలో... గత బడ్జెట్ లెక్కల ప్రకారం... 2017-2018, 2018-2019, 2019-2020లో ఎన్నికలు వాస్తవ వ్యయం మొత్తం రూ.8,656.41 కోట్లుగా ఉంది!