Begin typing your search above and press return to search.

2023 రౌండప్: ఈ సంవత్సరం 'సుప్రీం కోర్టు' కీలక నిర్ణయాలు ఇవే..

సుప్రీం కోర్టు ఈ ఏడాది (2023)లో తీర్పులు వెలువరించిన వాటిలో ప్రముఖంగా ఉన్న 10 గురించి తెలుసుకుందాం.

By:  Tupaki Desk   |   20 Dec 2023 12:30 AM GMT
2023 రౌండప్: ఈ సంవత్సరం సుప్రీం కోర్టు కీలక నిర్ణయాలు ఇవే..
X

పాలన గాడి తప్పుతున్నా.. ప్రభుత్వాలు సైతం తలలు పెట్టుకునే సమస్యలకు పరిష్కారం చూపడంలో కోర్టులు తమ పాత్రను పోషిస్తాయి. భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానంగా పిలవబడే సుప్రీం కోర్టు కూడా ఈ ఏడాది కీలక నిర్ణయాలు తీసుకుంది. సుప్రీం కోర్టు ఈ ఏడాది (2023)లో తీర్పులు వెలువరించిన వాటిలో ప్రముఖంగా ఉన్న 10 గురించి తెలుసుకుందాం.

1. ఆర్టికల్‌ 370 రద్దు

జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌-370 రద్దుపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ ఆర్టికల్ ఎత్తివేత విషయంలో కేంద్రం వాదనలను సుప్రీం కోర్టు సమర్థించింది. ఇది తాత్కాలిక నిబంధన మాత్రమేనని, శాశ్వతం కాదని కోర్టు పేర్కొంది.

2. విడాకులు..

వివాహ వ్యవస్థ, విడాకులు గురించి తీసుకున్న నిర్ణయాల్లో ఈ ఏడాది సుప్రీం మరో కీలక తీర్పును వెలువరించింది. గతంలో విడాకులు మంజూరు చేసేందుకు న్యాయస్థానాలు 6 నెలల వరకు గడువు ఇచ్చేవి. ఈ విషయంలో సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది. విడాకుల కోసం ఇరు పక్షాలు ఆసక్తి చూపితే 6 నెలల సమయం వద్దని వెంటనే జారీ చేయాలని పేర్కొంది. అయితే.. విడాకుల మంజూరుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.

3. విద్వేషపూరిత ప్రసంగాలు

విద్వేషపూరిత ప్రసంగాలతో దేశ సెక్యులరిజం ప్రభావితం అవుతుంది. దీంతో శాంతి భద్రతల సమస్యలు ఏర్పడవచ్చు. ఇది తీవ్రమైన నేరంగా సుప్రీం కోర్టు పేర్కొంది. విద్వేషపూరిత ప్రసంగాలపై ఎవరూ ఫిర్యాదు చేయకున్నా కేసులు నమోదు చేయాలని సుప్రీం పేర్కొంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గతేడాది (2022)లో కేవలం మూడు రష్ట్రాల్లోనే అమల్లో ఉన్న ఈ తీర్పు పరిధిని విస్తరించింది.

4. డీమోనిటైజేషన్..

మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక శాఖలో తీసుకున్న మొదటి నిర్ణయం 'డీమోనిటైజేషన్'. రూ. 500, రూ. 1000 లాంటి పెద్ద నోట్లను కేంద్రం 2016లో రద్దు చేసింది. రద్దును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఏడేళ్ల తర్వాత 2023లో తీర్పు ఇచ్చింది. మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. ఆ సమయంలో దాఖలైన పిటీషన్లను సుప్రీం కొట్టివేసింది.

5. ఎన్నికల కమిషనర్ల నియామకం

ఎన్నికల కమిషనర్ల నియామకం విషయంలో ఐదుగురు సభ్యులతో కూడిన బెంచ్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ లను ప్యానెల్ ద్వారా నియమిస్తామని బెంచ్ స్పష్టం చేసింది. ఈ ప్యానెల్ లో పీఎం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత ఉంటారని పేర్కొంది. ఈ ముగ్గురు కలిసి ఎన్నుకుంటారని బెంచ్ లో ఉన్న ఐదుగురు న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు.

6. స్వలింగ వివాహం

స్వలింగ వివాహానికి సంబంధించి సుప్రీం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. స్వలింగ వివాహం చట్టం చేసే హక్కు కేవలం పార్లమెంట్ కే ఉందని స్పష్టం చేసింది.

7. టాక్స్ పేయర్స్ కు ఉపశమనం

ఐటీ యాక్ట్ సెక్షన్ 153 కింద సోదాలు చేపడితే.. నిర్థిష్ట ఆధారాలు లభించకుంటే టాక్స్ పేయర్స్ (పన్ను చెల్లింపు దారులు) ఆదాయాన్ని ఏక పక్షంగా పెంచలేరని సుప్రీం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఆదాయ పన్ను శాఖ ఇష్టారాజ్యం ఇక నుంచి సాగదని పలువురు నిపుణులు భావిస్తున్నారు.

8. జల్లికట్టుపై

తమిళుల, మహారాష్ట్రీయుల సంప్రదాయ క్రీడలపై సుప్రీం నిర్ణయం కీలకంగా మారింది. తమిళనాడులో జల్లికట్టు, మహారాష్ట్రలో ఎద్దుల బండి పందాలను అనుమతించే చట్టం చెల్లుబాటుపై అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ సంప్రదాయ క్రీడలు వారి వారి సంస్కృతిలో భాగమని వాటికి అటంకం కలిగించలేమని కోర్టు తెలిపింది.

9. అవినీతి అధికారులపై చర్యలు

అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపేందుకు సుప్రీం ఈ ఏడాది తన నిర్ణయం వెలువరించింది. అరెస్ట్ నుంచి తమకు రక్షణ కల్పించాలని కొందరు అవినీతి అధికారులు కోర్టును ఆశ్రయించగా.. అవినీతి అధికారులను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని,

సుప్రీం స్పష్టం చేసింది. అవినీతి కేసుల్లో ప్రమేయం ఉన్న అధికారులకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేది లేదని కోర్టు స్పష్టం చేసింది.

10. అదానీ-హిండెన్‌బర్గ్ కేసు..

ఆదానీ-హిండెన్ బర్గ్ కు సంబంధించి కేసు ఈ ఏడాది దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. సుప్రీం కోర్టు మార్చి 2వ తేదీ ఈ కేసులో కీలక నిర్ణయం వెలువరించింది. ఆదానీ కంపెనీలపై హిండెన్ బర్గ్ రిసోర్స్ రిపోర్ట్ లేవనెత్తిన ప్రశ్నలపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీం పేర్కొంది. సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సప్రే నేతృత్వంలోని కమిటీలో ఆరుగురు సభ్యులను చేర్చాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని కోరింది.