వైఎస్సార్ గురించి రేవంత్ సంచలన వ్యాఖ్యలు
వైఎస్సార్ మరణించి 17 ఏళ్ళు అవుతోంది. కానీ తెలుగు నాట ఆయన ప్రభావం బలంగానే ఉంది.
By: Satya P | 23 Feb 2026 4:00 AM ISTవైఎస్సార్ మరణించి 17 ఏళ్ళు అవుతోంది. కానీ తెలుగు నాట ఆయన ప్రభావం బలంగానే ఉంది. దైనందిన రాజకీయాల్లో ఎక్కడో ఒక చోట ఆయన ప్రస్తావన వస్తూనే ఉంది. 2009 సెప్టెంబర్ 3న వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో ఈ లోకాన్ని వీడిపోయారు. ఇక నాటి నుంచి ఉమ్మడి ఏపీ రాజకీయాలు కీలకమైన మలుపు తిరిగాయి. అంతే కాదు ఏపీ విభజన జరిగింది. వైఎస్సార్ ఉంటే జరిగేది కాదు అన్నది ఒక మాట ఉంది. అలాగే వైఎస్సార్ ఉంటే 2014 లో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవారూ అనే వారు ఉన్నారు. ఇవన్నీ ఊహాజనితమైన విషయాలు వీటిని అలా పక్కన ఉంచితే వైఎస్సార్ ని కాంగ్రెస్ వాదులు తమ సొంతం అని చేసుకుంటున్నారు. ఏపీలో అయితే ఆయన పేరుతో వైఎస్సార్ సీపీ అనే పార్టీని కుమారుడు జగన్ నడుపుతున్నారు. వైఎస్సార్ తనయగా ఉన్న షర్మిల పీసీసీ చీఫ్ గా ఏపీకి ఉన్నారు. ఆమె ఆ పదవిలో ఉన్నారు అంటే ఆయన వారసత్వాన్ని తమ వైపు తిప్పుకుని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని పెంచుకునే ప్రయత్నమే అని అంటారు.
తెలంగాణాలోనూ :
ఇక తెలంగాణాలోనూ వైఎస్సార్ ప్రస్తావన ఎక్కువగా ఇటీవల కాలంలో వినిపిస్తోంది. దానికి కారణం వైఎస్సార్ మరణించాక ఉమ్మడి ఏపీని రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా పాలించారు. 2014 నుంచి చూస్తే బీఆర్ ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఇక 2023 నుంచి మళ్ళీ కాంగ్రెస్ జమానా ప్రారంభం అయింది. అలా కాంగ్రెస్ పాలన రావడానికి బలమైన రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలు ఎంతో కృషి చేశాయి. దాంతో పాటుగా కాంగ్రెస్ తన గత విజయాలను చెప్పుకోవాలీ అంటే వైఎస్సార్ గురించి కూడా చెప్పాల్సి ఉంటుంది. ఆ క్రెడిట్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పనిని కాంగెర్స్ ప్రభుత్వంలోని పెద్దలు అంతా చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికి అనేసార్లు వైఎస్సార్ ప్రస్తావన సందర్భానికి తగినట్లుగా చేస్తూ వస్తున్నారు.
కీలక వ్యాఖ్యలు :
తాజాగా తెలంగాణాలోని వివిధ జిల్లాల కాంగ్రెస్ అద్యక్షుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ఎంతో మంది వ్యతిరేకించారు అని చెప్పారు. అయితే తాను అందరి ఇళ్ళకు వెళ్లి వారితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకుని వద్దామని చెప్పాను అని. ఆ విధంగా కాంగ్రెస్ అన్న వట వృక్షాన్ని ముందు ఉంచి అంతా కలసి పనిచేయడం వల్లనే గెలుపు సాధ్యమైంది అని అన్నారు. అదే విధంగా వైఎస్సార్ గురించి కూడా చెబుతూ ఆయన గ్రేట్ అన్నారు.
అభిమానించేవారు :
వైఎస్సార్ తనను అభిమానించేవారు అని రేవంత్ రెడ్డి చెప్పారు. తాను 2006లో తొలిసారిగా జెడ్పీటీసీగా గెలిచాను అని 2007లో ఎమ్మెల్సీ అయ్యాను అని 2009లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను అని చెప్పారు. ఇక రెండోసారి సీఎం అయిన వైఎస్సార్ సభలో బడ్జెట్ సందర్భంగా జరిగిన చర్చలో ఉన్నారు అని గుర్తు చేశారు. ఆ సమయంలో తాను చేసిన ప్రసంగం కూడా ఆకట్టుకునే విధంగా ఉందని అన్నారు. వైఎస్సార్ సైతం ఎంతో హుందాగా బడ్జెట్ కి రిప్లై ఇచ్చారు అన్నారు. ఆయన తనను ఇష్టపడేవారు అని రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే తాను ఏ రోజూ సొంత పనులకు ఏ విధంగా నాటి ప్రభుత్వ పెద్దలను కలిసి చేయించుకున్నది లేదని చెప్పారు. వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర ఉమ్మడి ఏపీలో ఒక రికార్డు అని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం విశేషం.
షర్మిల గురించి :
అంతే కాదు ఆ సమావేశంలో పాల్గొన్న షర్మిల గురించి మాట్లాడుతూ ఆమె తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని ఏ విధంగానూ వాడుకోలేదని అన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో ఒక సాధారణ నాయకురాలిగా పనిచేస్తున్నారు అని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు అనే ముళ్ళ కిరీటాన్ని ఆమె స్వీకరించి జనంలోకి వెళ్తున్నారు అని అన్నారు. ఏపీలో తెలంగాణాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు విభజన జరిగినా రెండు తెలుగు రాష్ట్రాలూ ఒక్కటిగా ఉంటూ సహకరించుకోవాలని, ఉండాలని అపుడే అభివృద్ధి సాధ్యమని రేవంత్ రెడ్డి చెప్పారు. మొత్తానికి వైఎస్సార్ తో తనకు ఉన్న కొద్దిపాటి పరిచయం అనుబంధం అన్నీ ఆయన చెబుతూ వచ్చిన తీరు అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
