16 ఏళ్ల వయసులో మీరేం చేశారు బాస్? ఏఐతో తండ్రికే రూ.2 లక్షల జీతం ఇస్తున్న కేరళ కుర్రాడు
సాధారణంగా 16 ఏళ్ల వయసులో కుర్రాళ్లు ఏం చేస్తారు? “అమ్మా.. ఓ యాభై రూపాయలివ్వు.. దోస్తులతో సమోసా తిని వస్తా” అని పాకెట్ మనీ కోసం దేబిరిస్తారు.
By: A.N.Kumar | 27 Aug 2026 10:33 AM ISTసాధారణంగా 16 ఏళ్ల వయసులో కుర్రాళ్లు ఏం చేస్తారు? “అమ్మా.. ఓ యాభై రూపాయలివ్వు.. దోస్తులతో సమోసా తిని వస్తా” అని పాకెట్ మనీ కోసం దేబిరిస్తారు. లేదంటే ‘ఇన్‌స్టాగ్రామ్’లో రీల్స్ స్క్రోల్ చేస్తూ పరీక్షల్లో ‘పాస్ మార్కులు వస్తే చాలు దేవుడా’ అని దండాలు పెట్టుకుంటారు. కానీ కేరళకు చెందిన రౌల్ జాన్ అజు అనే 16 ఏళ్ల కుర్రాడు మాత్రం జనాన్ని తీవ్రంగా డిప్రెషన్‌లోకి నెట్టేస్తున్నాడు. ఎందుకంటే ఈ వయసులోనే తండ్రి దగ్గర పాకెట్ మనీ తీసుకోవడం మానేసి రివర్స్‌లో తన తండ్రికే నెలకు రూ. 2 లక్షల జీతం ఇస్తున్నాడు. అవును.. మీరు విన్నది నిజమే..
తండ్రి కొడుక్కి పాకెట్ మనీ ఇవ్వడం పాత ట్రెండ్.. కొడుకే తండ్రిని తన కంపెనీలో ఉద్యోగిగా పెట్టుకుని నెలానెలా రూ.2 లక్షల శాలరీ వేయడం లేటెస్ట్ ట్రెండ్.. ఈ సీన్ చూస్తుంటే సదరు తండ్రికి రోజువారీ లైఫ్‌లో ఎలాంటి విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుందో ఊహించుకుంటేనే నవ్వొస్తోంది. ఇంట్లో “రేయ్ రౌలూ.. సరిగ్గా చదువుకో” అని తండ్రి గద్దించబోతే, “ముందు మీ కేపీఐ టార్గెట్లు పూర్తి చేయండి నాన్నా వచ్చే నెల జీతంలో కోత విధిస్తా!” అని కొడుకు బెదిరించే వెసులుబాటు కూడా రౌల్‌కి ఉందేమో..
తొమ్మిదేళ్ల చిన్నారి వయసులో మనమంతా రోబో సినిమాలు చూసి మురిసిపోతుంటే ఈ ‘ఏఐ వండర్ కిడ్’ మాత్రం ఏ శిక్షణా లేకుండా సొంతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చేసుకున్నాడట. మనకి ఆ వయసులో పబ్జీ, ఫ్రీ ఫైర్‌లలో గేమింగ్ లాజిక్స్ తప్ప ఇంకేం అబ్బవు, కానీ రౌల్ మాత్రం కోడింగ్ పాఠాలు వండించి తాగేశాడు.
అక్కడితో ఆగితే అతన్ని భారతీయుడు అని ఎలా అంటాం? వెంటనే ఒక ఏఐ స్టారప్ పెట్టేశాడు. ఇప్పుడు అందులో తండ్రితో సహా 15 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పోనీ తానొక్కడే బాగుపడ్డాడా అంటే అదీ లేదు.. ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు ఏఐ పై క్లాసులు పీకి పడేశాడు. అంటే మనకి ఇన్‌స్టా రీల్స్ చూడటానికి రోజూ 2జీబీ డేటా సరిపోకపోతుంటే.. ఈ కుర్రాడు దేశంలో సగం మందికి టెక్నాలజీ నూరిపోస్తున్నాడన్నమాట.
“వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే” అని సుభాషితాలు చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ, ఇలాంటి వార్తలు చూసినప్పుడే సగటు పక్కింటి అబ్బాయిల తండ్రులకు కోపం నరాలు జివ్వుమంటాయి. మీ ఇంట్లో 16 ఏళ్ల పిల్లాడు ఇంకా ఫోన్లో గేమ్స్ ఆడుతూ కనిపిస్తే ఈ కేరళ కుర్రాడి కథ చెప్పి క్లాస్ పీకడం ఖాయం. కాబట్టి యువతరామా.. కాస్త జాగ్రత్తగా ఉండండి.. రౌల్ జాన్ అజు లాంటి వాళ్లు మార్కెట్లోకి వచ్చాక మన సోమరితనానికి గ్లోబల్ లెవెల్లో ముప్పు వాటిల్లేలా ఉంది.
