Begin typing your search above and press return to search.

ఓర్నీ.. మొక్కు కోసం 151 మేకల్ని బలిచ్చాడు

భారతదేశం వేదాలు, ఉపనిశత్తులు, శాస్త్రాల ఆధారాలపై ఉన్న భూమి. మునులు, రుషులు ఎప్పుడూ మూఢ నమ్మకాలను సమర్థించలేదు.

By:  Tupaki Desk   |   17 Sept 2025 10:21 AM IST
ఓర్నీ.. మొక్కు కోసం 151 మేకల్ని బలిచ్చాడు
X

భారతదేశం వేదాలు, ఉపనిశత్తులు, శాస్త్రాల ఆధారాలపై ఉన్న భూమి. మునులు, రుషులు ఎప్పుడూ మూఢ నమ్మకాలను సమర్థించలేదు. శాస్త్రాన్ని తర్కంతో అర్థం చేసుకోవాలని సూచించారు. వేదాలు కూడా అవే సూచించాయి. చంద్రుడి దక్షిణ ధృవంపైకి ల్యాండర్ ను పంపిన భారత్ లో మూఢ నమ్మకాలు ఇంకా వేర్లతో పాతుకు పోయాయని చెప్పేందుకు అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఘటనలు వెలుగు చూస్తాయి.

ఇప్పటికీ మన సమాజంలో శాస్త్రీయ ఆలోచన కన్నా మూఢనమ్మకాలే బలంగా పాతుకుపోయాయి అనేందుకు ఈ ఘటనే సాక్ష్యం. తాజాగా తమిళనాడులో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకొని జంతు ప్రేమికులు తీవ్ర కలత చెందారు. తమిళనాడు రాష్ట్రం, ధర్మపురి జిల్లాకు చెందిన లారీ డ్రైవర్‌ తంగరాజ్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. అయితే ఆయన వైద్యులను కలవకుండా కేవలం దైవాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. ఆ సమయంలో దేవుడికి మొక్కు పెట్టుకున్నాడు. తనకు ఆరోగ్యం బాగైతే 151 మేకలను బలిస్తానని మొక్కు పెట్టుకున్నాడు. ఆరోగ్యం బాగవడంతో ఏకంగా రూ. 10 లక్షలు ఖర్చు చేసి 151 మేకలను కొని బలిచ్చాడు.

అసలు తంగరాజ్ కు మందులతో లొంగే జబ్బు వచ్చిందా..? లేక దీర్ఘకాలిక జబ్బు వచ్చిందా..? మందులకు లొంగే జబ్బు అయితే డాక్టర్ ను సంప్రదిస్తే నయం అవుతుంది. ఇక కొన్ని జబ్బులను శరీరమే మాన్పుకుటుంది. అసలు రోగం ఏంటో తెలుసుకోకుండా జంతుబలికోసం మొక్కులు పెట్టుకోవడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి చర్యలు మూఢ నమ్మకాలు మన సమాజంలో బలంగా పాతుకుపోయాయని తెలుస్తోంది. ఈ వార్త చూసిన ప్రతి వ్యక్తికి కొంత కంట తడి తప్పదేమో. వైద్యంపై అవగాహన లోపం గురించి స్పష్టంగా చూపిస్తుంది. ఒకవైపు వైద్య విజ్ఞానం ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. మరొకవైపు మనుషులు ఇలాంటి బలి మొక్కులు మొక్కుకోవడం ఇబ్బందితో కూడుకున్నదే. నమ్మకం ఉండడం సబబే కానీ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి మూఢ నమ్మకంగా మలచడం సమాజాన్ని పక్కదోవ పట్టిస్తుంది.

ఇలాంటి సందర్భాల్లో జంతువుల ప్రాణనష్టం మాత్రమే కాకుండా, ఆర్థిక వనరుల వృథా కూడా జరుగుతుంది. ఈయన ప్రాణులను కొనే డబ్బు (రూ. 10 లక్షలు)తో విద్య, వైద్యం లేదా పేదలకు ఉపయోగిస్తే మరింత మేలు జరిగేదని కొందరు వాదిస్తున్నారు. సమాజంలో అజ్ఞానం పెంపొందించే ఈ విధమైన చర్యలు మానవతా విలువలకు విరుద్ధం అంటూ మరికొందరు మందలిస్తున్నారు. మూఢనమ్మకాలు కేవలం వ్యక్తిగత సమస్య కాదు, శాస్త్రవిజ్ఞానంతో ముందుకు వెళ్లే సమాజాన్నే వెనక్కు లాగే శక్తిగా మారుతుంది. అందుకే విద్య, విజ్ఞానం, చైతన్యమే ప్రజల్లో అలాంటి ఆలోచనలను మార్చగల మార్గం. దేవుడిని నమ్మడంలో తప్పు లేదు, కానీ నమ్మకం పేరుతో బలులు సమాజానికి శ్రేయస్కరం కాదు.