Begin typing your search above and press return to search.

తలలో చిన్న పేనే కదా అని అనుకుంటున్నారా... ఇదొకసారి చదవండి!

అవును... ఒడిశాలోని పూరి జిల్లా, చంపకద్ సాహి గ్రామానికి చెందిన లింగరాజ్ సాహు - సత్యభామ దంపతుల కుమార్తె 12 ఏళ్ల లక్ష్మి ప్రియ నాలుగో తరగతి చదువుతుంది.

By:  Raja Ch   |   12 Feb 2026 12:00 AM IST
తలలో చిన్న పేనే కదా  అని అనుకుంటున్నారా... ఇదొకసారి చదవండి!
X

చిన్నతనంలో తలలో పేను పుచ్చడం సహజమైన విషయమనే అంటారు! అందుకు కారణాలు ఏవైనా.. శుభ్రత విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని, సమస్యను ఆదిలోనే గుర్తించి, శ్రద్ధ తీసుకుంటే సమస్య సమసిపోతుందని చెబుతారు. అయితే... చిన్న పేనే కదా అదే పోతుందిలే అని వదిలేస్తే మాత్రం అది ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉందనే విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది! తాజాగా ఈ విషయంలో పేను విషయంలో జాగ్రత్తలకు హైలెట్ చేస్తుంది.

అవును... ఒడిశాలోని పూరి జిల్లా, చంపకద్ సాహి గ్రామానికి చెందిన లింగరాజ్ సాహు - సత్యభామ దంపతుల కుమార్తె 12 ఏళ్ల లక్ష్మి ప్రియ నాలుగో తరగతి చదువుతుంది. ఈ క్రమంలో ఆమె గత కొన్ని నెలలుగా తలలో పేలు సమస్యలతో బాధపడుతుంది. ఈ క్రమంలో పేను వల్ల కలిగే దురదకు అస్తమానం తలపై గోక్కోవడంతొ చిన్న చిన్న గాయాలు కూడా అయిన పరిస్థితి. తద్వారా ఆ గాయాలకు ఇన్ఫెక్షన్ సోకడంతో పాటు తలలో పేల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.

తలలో పేలు, చిన్న చిన్న గాయాలు, పెరుగుతున్న ఇన్ఫెక్షన్ వెరసి.. ఆమె తల నుంచి దుర్వాసన రావడం మొదలైంది. అయినప్పటికీ ఆమె తలకు స్కార్ఫ్ కట్టుకుని కొన్ని రోజులు స్కూల్ కి వెళ్లినా.. ఆ దుర్వాసన రోజు రోజుకీ ఎక్కువవ్వడంతో ఆమె స్కూల్ కి వెళ్లడం కూడా మానేసిందని ఆమె తల్లి సత్యభామ చెబుతున్నారు. ఈ క్రమంలో గుండు కొట్టించుకుంటే సమస్య పోతుందని చెప్పినా వినిపించుకోలేదని ఆమె తెలిపారు. మరోవైపు సమస్య రోజు రోజుకీ తీవ్రమవుతోంది.

పైగా ఇటీవల ఆమె రక్తం వాంతి చేసుకుందని చెబుతున్నారు. దీంతో.. ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో.. పరీక్షించిన వైద్యులు పేలు తగ్గడానికి మందులు ఇచ్చి, వాంతి నివారణకు చికిత్స అందించి, ఇన్ఫెక్షన్ కు ఇంజెక్షన్స్ చేశారు! ఇలా చికిత్స జరుగుతున్న సమయంలోనే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించి, ఆమె ప్రాణాలు కోల్పోయింది. తల్లితండ్రులను పుట్టెడు దుఃఖంలోకి నెట్టింది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆమె మరణానికి గల స్పష్టమైన కారణం తెలియనుంది!

ఈ సందర్భంగా స్పందించిన పూరి జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అక్షయ్ సతపతి... పేను చికిత్సకు ఉపయోగించిన మందులకు రియాక్షన్ వల్ల లేదా.. తలపై ఉన్న తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే సెప్టిసిమియా వల్ల ఆమె చనిపోయి ఉండొచ్చని అన్నారు. అయితే.. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే అని, వివరణాత్మక దర్యాప్తు తర్వాత మాత్రమే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని అన్నారు.

కాగా... క్లీనిక్స్ ఇన్ డెర్మటాలజీ జర్నల్ లో ప్రచురితమైన "ది డార్కర్ సైడ్ ఆఫ్ హెడ్ లెస్ ఇన్ఫెస్టేషన్స్" అనే అధ్యయనం.. జార్జియాలో 12 ఏళ్ల బాలిక తీవ్రమైన పేలు సమస్య కారణంగా గుండెపోటుతో మరణించినట్లు నివేదించింది. ఇదే సమయంలో ఆమె మరణానికి మరో కారణంగా రక్తహీనతను వెల్లడించింది. సో... పేను చిన్నదే కానీ దాని వల్ల వచ్చే సమస్య మాత్రం చిన్నది కాదని గుర్తుంచుకోవాలి!!