Begin typing your search above and press return to search.

అమెరికాలో భారతీయులపై పెరుగుతున్న విద్వేష జ్వాలలు

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్‌లో మొదలైన ఈ విద్వేషం వాస్తవ జీవితంలో వివక్షకు, వేధింపులకు దారితీస్తోంది.

By:  A.N.Kumar   |   19 Feb 2026 10:10 AM IST
అమెరికాలో భారతీయులపై పెరుగుతున్న విద్వేష జ్వాలలు
X

'అవకాశాల దేశం'గా పిలవబడే అమెరికాలో భారతీయులకు, ముఖ్యంగా దక్షిణాసియా వాసులకు గడ్డుకాలం కనిపిస్తోంది. ఇటీవల కాలంలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న విద్వేష ప్రసంగాలు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఈ ధోరణి సామాజిక ఐక్యతను దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

115 శాతం పెరిగిన విద్వేషం.. నివేదికల సారాంశం

‘స్టాప్ ఆపీ హేట్ మరియు సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్ ’ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు జరిపిన అధ్యయనాల్లో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగుచూశాయి. 2023 నుండి 2025 మధ్యకాలంలో భారతీయులపై చేసే అవమానకర వ్యాఖ్యలు 115 శాతం పెరిగాయి. ప్రధానంగా ఐటీ నిపుణులు, విద్యార్థులు, స్థిరపడిన వలసదారులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయి.

హెచ్-1బీ వీసా చర్చలే ప్రధాన కారణమా?

అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే హెచ్-1బీ వీసా వ్యవస్థ ఇప్పుడు విద్వేషానికి కేంద్ర బిందువుగా మారింది. అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను భారతీయులు తన్నుకుపోతున్నారనే తప్పుడు ప్రచారం స్థానికుల్లో వ్యతిరేకతను పెంచుతోంది. సోషల్ మీడియా వేదికగా "ఇండియన్ టేకోవర్’’ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో విదేశీయులపై విషం చిమ్ముతున్నారు. భారతీయులు అమెరికా ట్యాక్స్ వ్యవస్థకు, సాంకేతిక అభివృద్ధికి అందిస్తున్న సహకారాన్ని విస్మరించి, కేవలం వలస విధానాలనే భూతద్దంలో చూపిస్తున్నారు.

ఆన్‌లైన్ పోస్టుల నుండి వాస్తవ దాడుల వరకు..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్‌లో మొదలైన ఈ విద్వేషం వాస్తవ జీవితంలో వివక్షకు, వేధింపులకు దారితీస్తోంది. అనేక సోషల్ మీడియా పోస్టులు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా హింసను ప్రేరేపించేలా ఉంటున్నాయి. ఇది భారతీయ అమెరికన్ల భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమించింది.

పరిష్కారం దిశగా అడుగులు

ప్రస్తుత పరిస్థితులపై హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం, టెక్ సంస్థలు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. హేట్ స్పీచ్‌ను ప్రోత్సహించే ఖాతాలను తక్షణమే నియంత్రించాలి. వలస విధానాలపై జరిగే రాజకీయ చర్చలు ఏ ఒక్క వర్గాన్ని కించపరిచేలా ఉండకూడదు. వలసదారులు దేశ అభివృద్ధికి ఎలా తోడ్పడుతున్నారో స్థానికులకు వివరించే ప్రయత్నం జరగాలి.

అమెరికా అభివృద్ధిలో భారతీయుల కృషి వెలకట్టలేనిది. వలస విధానాలపై భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే కానీ.. అది విద్వేషంగా మారడం ప్రజాస్వామ్యానికే ప్రమాదం. పరస్పర గౌరవం, ఐక్యతతోనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అంతర్జాతీయ సమాజం కోరుకుంటోంది.