10ఏళ్ల క్రితం తల్లిని అవమానించాడని... ఇది మామూలు రివేంజ్ స్టోరీ కాదు!
అవును... సినిమా స్క్రిప్ట్ తరహాలో సాగిన ఓ రియల్ రివేంజ్ స్టోరీ తాజాగా లక్నోలో వెలుగు చూసింది.
By: Tupaki Desk | 22 July 2025 12:31 PM ISTఇటీవల కాలంలో హత్య, హత్యాయత్నం వంటి విషయాలు సాధారణమైపొయినట్లు కనిపిస్తున్నాయి! సినిమాల ప్రభావమో.. లేక, చెడు వ్యసనల ఫలితమో తెలియదు కానీ.. ప్రతీ సమస్యకూ ప్రత్యర్థిని తుద ముట్టించడమే అంతిమ పరిష్కారం అన్నట్లుగా పలువురి ఆలోచనలు సాగుతున్నాయి! ఈ క్రమంలో పదేళ్ల క్రితం జరిగిన అవమానానికి తాజాగా ఓ వ్యక్తి రివేంజ్ తీర్చుకున్నాడు. ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.
అవును... సినిమా స్క్రిప్ట్ తరహాలో సాగిన ఓ రియల్ రివేంజ్ స్టోరీ తాజాగా లక్నోలో వెలుగు చూసింది. సుమారు దశాబ్దం క్రితం తన తల్లిని అవమానించిన వ్యక్తిని తాజాగా మాటు వేసి, దాడి చేసి, అతడి మృతికి కారణమయ్యాడు ఓ కుమారుడు & ఫ్రెండ్స్! అయితే... ఈ దాడి అనంతరం జరిగిన పార్టీ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తూ, ఫైనల్ గా నిందితులను పట్టుకోవడంలో సహకరించడం గమనార్హం.
వివరాళ్లోకి వెళ్తే... సుమారు 10 సంవత్సరాల క్రితం జరిగిన ఒక వివాదంలో సోను కశ్యప్ అనే యువకుడి తల్లిని, మనోజ్ అనే వ్యక్తి కొట్టి అక్కడ నుంచి పారిపోయాడు. దీంతో.. తన తల్లికి జరిగిన అవమానానికి కలత చెందిన సోను అతని కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో సుమారు పదేళ్లు గడిచిపోయింది. అయినా కూడా సోనూ పగ చల్లారలేదు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం అతడిని గుర్తించాడు.
అతడు నగరంలోని ముస్ని పులియా ప్రాంతంలో ఉంటున్నట్లు గుర్తించిన సోను... అతడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్స్ రచించడం ప్రారంభించాడు. దీనికోసం కొన్ని రోజులు రెక్కీ నిర్వహించాడు. మనోజ్ ఎన్ని గంటలకు షాప్ తీస్తున్నాడు, ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాడు, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాడు వంటి సమాచారం మొత్తం తెలుసుకున్నాడు. ఈ సమయంలో ఓ ముహూర్తం ఫిక్స్ చేశాడు. దీనికోసం నలుగురు స్నేహితుల సహాయం కోరాడు.
ఈ సమయంలో మే 22న మనోజ్ తన దుకాణాన్ని మూసివేసి ఒంటరిగా ఉన్న సమయంలో... సోనూ & కో అతనిపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. రక్తపు మడుగులో సగం ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న మనోజ్ ను వదిలేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో చికిత్స పోందుతూ మనోజ్ మరణించాడు. ఈ సమయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించడం మొదలుపెట్టారు.
మరోవైపు మనోజ్ పై దాడి విషయంలో తనకు సహకరించిన స్నేహితులకు పెద్ద పార్టీ అరేంజ్ చేశాడు సోను. దీంతో... ఫుల్ గా మందేసి, అనంతరం చిందేసిన సోనూ & కో... ఫోటోలకు ఫోజులిచ్చి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు! ఆ ఫోటోలే పోలీసులకు అనుమానితులను గుర్తించడంలో సహాయపడినట్లు చెబుతున్నారు.
ఇందులో భాగంగా... సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించిన అనుమానితులలో ఒకరిని సోషల్ మీడియా ఫోటోలలో గుర్తించారు పోలీసులు. ఇదే క్రమంలో... హత్య సమయంలో అతను ధరించిన నారింజ రంగు టీ-షర్టునే సోషల్ మీడియా ఫోటోల్లోనూ ధరించి కనిపించాడు. ఆ తర్వాత పోలీసులు ఆ ఐదుగురు అనుమానితులను ట్రాక్ చేసి, అదుపులోకి తీసుకున్నారు. నిందితులను నిందితులను సోను, రంజీత్, ఆదిల్, సలాము, రెహ్మత్ అలీగా గుర్తించారు.
