Begin typing your search above and press return to search.

ఐటీ రిఫండ్ ఆశ..ఒక్క చిన్న మెసేజ్‌తో అకౌంట్ ఖాళీ!

ఆదాయపు పన్ను రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? ఆ ఆలస్యమే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది.

By:  A.N.Kumar   |   23 Feb 2026 10:51 AM IST
ఐటీ రిఫండ్ ఆశ..ఒక్క చిన్న మెసేజ్‌తో అకౌంట్ ఖాళీ!
X

ఆదాయపు పన్ను రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? ఆ ఆలస్యమే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది. మీ ఆత్రుతను ఆసరాగా చేసుకుని 'రిఫండ్ పెండింగ్‌లో ఉంది' అంటూ పంపే ఒక చిన్న మెసేజ్, మీ బ్యాంక్ ఖాతాను క్షణాల్లో ఖాళీ చేస్తోంది. తాజాగా ఓ పన్ను చెల్లింపుదారుడు ఇలాంటి నకిలీ లింక్‌ను నమ్మి ఏకంగా రూ.1.5 లక్షలు పోగొట్టుకున్న ఘటన సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ స్కామ్ ఎలా జరుగుతోంది? ఐటీ శాఖ పేరిట వచ్చే మెసేజ్‌లలో ఏవి నిజం? ఏవి అబద్ధం? అన్న విషయంలో జాగ్రత్త పాటించాలి.

ఏమిటీ స్కామ్? ఎలా జరుగుతోంది?

ప్రస్తుతం చాలా మందికి ఐటీ రిఫండ్ రావడంలో ఆలస్యం జరుగుతోంది. దీనిని గమనించిన మోసగాళ్లు, ప్రజల ఫోన్లకు ఎస్ఎంఎస్ పంపిస్తున్నారు. ఆ మెసేజ్ ఇలా ఉంటుంది. మీ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ ఆగిపోయింది. వెంటనే ఈ క్రింది లింక్ క్లిక్ చేసి మీ వివరాలను వెరిఫై చేసుకోండి. లేదంటే మీ రిఫండ్ రద్దవుతుంది అని పంపుతున్నారు.

మోసం జరిగే తీరు ఇదే

మెసేజ్‌లో ఉన్న లింక్ క్లిక్ చేయగానే అది అచ్చం ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌లా ఉండే నకిలీ సైట్‌కి తీసుకెళ్తుంది. అక్కడ మీ పాన్ నంబర్, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతారు.

చివరగా మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయగానే మీ బ్యాంక్ ఖాతా యాక్సెస్‌ను మోసగాళ్లు పొందుతారు. క్షణాల్లో మీ అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేస్తారు.

నేరగాళ్లు మిమ్మల్ని ఎలా భయపెడతారంటే?

"వెంటనే చేయండి", "చివరి అవకాశం" అంటూ మిమ్మల్ని ఆలోచించకుండా చేస్తారు. రిఫండ్ క్యాన్సిల్ అవుతుంది అని హెచ్చరిస్తారు. ప్రభుత్వ లోగోలు, రంగులు ఉపయోగించి అది అసలైన వెబ్‌సైట్ అనే భ్రమ కలిగిస్తారు.

ఆదాయపు పన్ను శాఖ కీలక సూచనలు

ఈ తరహా మోసాలపై ఆదాయపు పన్ను శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఈ క్రింది విషయాలను స్పష్టం చేసింది. ఐటీ శాఖ ఎప్పుడూ కూడా ఎస్ఎంఎస్ ద్వారా రిఫండ్ వెరిఫికేషన్ లింకులు పంపదు. పాస్‌వర్డ్‌లు, పిన్ నంబర్లు లేదా బ్యాంక్ వివరాలను ఫోన్ ద్వారా గానీ, మెసేజ్ ద్వారా గానీ ఎప్పుడూ అడగదు. ఫండ్ స్టేటస్ తెలుసుకోవాలంటే నేరుగా incometax.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి.

మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే తెలియని లింకులను క్లిక్ చేయకండి. OTP షేర్ చేయవద్దు.. ఎవరితోనూ మీ ఓటీపీ పంచుకోవద్దు. ఏదైనా లింక్ క్లిక్ చేసినప్పుడు పైన ఉన్న అడ్రస్ బార్‌లో స్పెల్లింగ్‌లు సరిగ్గా ఉన్నాయో లేదో చూడండి. ఒకవేళ మీరు మోసపోయినట్లయితే వెంటనే 1930 కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో రిపోర్ట్ చేయండి.

రిఫండ్ రావడం ఆలస్యమైతే మీ అడ్వైజర్‌ను సంప్రదించండి లేదా అధికారిక పోర్టల్‌లో గ్రీవెన్స్ రైజ్ చేయండి. అపరిచితులను నమ్మి కష్టార్జితాన్ని పోగొట్టుకోకండి.