Begin typing your search above and press return to search.

‘‘బ్రాహ్మణి బాగా ట్రైన్ చేసింది..’’ దేవాన్ష్ పై లోకేశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

యువనేత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో తన కుమారుడు దేవాన్ష్ గురించి ఆసక్తికర సమాచారం పంచుకున్నారు.

By:  Tupaki Political Desk   |   4 March 2026 4:14 PM IST
‘‘బ్రాహ్మణి బాగా ట్రైన్ చేసింది..’’ దేవాన్ష్ పై లోకేశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

యువనేత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో తన కుమారుడు దేవాన్ష్ గురించి ఆసక్తికర సమాచారం పంచుకున్నారు. అసెంబ్లీలో విద్యాశాఖపై చర్చ జరిగిన సందర్భంగా తన 11 ఏళ్ల కుమారుడు దేవాన్ష్ కు పుస్తక పఠనంపై ఉన్న శ్రద్ధను లోకేశ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన సతీమణి బ్రాహ్మణి బాగా ట్రైన్ చేసిందని, ఫోన్, ట్యాబ్ వంటివాటికి దేవాన్ష్ ను దూరంగా ఉంచుతుందని వెల్లడించారు. అంతేకాకుండా పుస్తకాలు చదవడమనే మంచి అలవాటు నేర్పిందని కొనియాడారు. ఏదైనా పుస్తకాన్ని దేవాన్ష్ ఒక్క రోజులోనే చదివేస్తాడని, అదే సమయంలో తాను పుస్తకం చదవాలంటే నెల రోజులకుపైగా సమయం తీసుకుంటానని మంత్రి లోకేశ్ వివరించారు.

కుమారుడు దేవాన్ష్ గురించి అసెంబ్లీలో మంత్రి లోకేశ్ చెప్పిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన లోకేశ్ తన కుమారుడు పెంపకంపై తీసుకుంటున్న జాగ్రత్తలను వివరించి ఆకట్టుకున్నారని అంటున్నారు. పిల్లలు గ్యాడ్జెట్స్‌కు బానిసలవుతున్న కాలంలో తన కుమారుడిని పుస్తకాలకే అంకితమయ్యేలా బ్రాహ్మణి పెంచడాన్ని లోకేశ్ ప్రస్తావించారు. పుస్తక పఠనం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉంటుందో వివరించారు.

పుస్తకాలు చదవడం వల్ల క్రియేటివిటీ పెరుగుతుందని, భాషా పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుందని లోకేశ్ వ్యాఖ్యానించారు. పిల్లల్లో పుస్తక పఠనం పెరిగేలా ప్రతి నియోజకవర్గంలో లైబ్రెరీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అమరావతిలో సెంట్రల్ లైబ్రెరీ ఏర్పాటు చేస్తున్నామని, మంగళగిరిలో మోడల్ లైబ్రెరీ ఏర్పాటు చేశామని, సభ్యులు అంతా మంగళగిరి లైబ్రెరీని సందర్శించాలని కోరారు. త్వరలో రాష్ట్రంలో ప్రతి మండలంలో లైబ్రెరీలు ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద లైబ్రెరీలు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. లైబ్రెరీల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తిగా నిధులు వెచ్చిస్తుందని తెలిపారు.

ఇక 16 ఏళ్ల లోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలనే ఆలోచనతో లోకేశ్ ఉన్నారు. దీనిపై చట్టం తేవాలని గత కొంతకాలంగా ప్రతిపాదిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర అధికారులతో ఇప్పటికే ఈ అంశంపై చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన ఇంట్లోనే సంస్కరణలు మొదలు అయ్యాయని లోకేశ్ పరోక్షంగా చెప్పినట్లు అయిందని అంటున్నారు. సాధారణంగా ఈ రోజుల్లో ప్రతి పిల్లాడు చేతిలో ఫోన్ లేకపోతే కనీసం అన్నం కూడా తినని పరిస్థితి ఉంది. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మనవడు అయిన దేవాన్ష్ ఫోన్, టీవీ వంటి వాటి ఊసు లేకుండా కేవలం పుస్తకాలతోనే సహవాసం చేసేలా పెంచడం ఆదర్శనీయమని వ్యాఖ్యానిస్తున్నారు.