Begin typing your search above and press return to search.

1947కు ముందు మనోళ్లు, పాక్ వెళ్లేందుకు ఏయే మార్గాలు ఉపయోగించారు..

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్ అటారీ-వాఘా సరిహద్దును పూర్తిగా మూసేసింది. ప్రస్తుతం భారత్ నుంచి పాకిస్తాన్ కు రోడ్డు మార్గం ద్వారా వెళ్లడానికి ఇది ఒక్కటే మార్గం.

By:  Tupaki Desk   |   30 April 2025 8:45 AM IST
India Pakistan Border and Airspace Shut Down After Pahalgam Attack
X

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్ అటారీ-వాఘా సరిహద్దును పూర్తిగా మూసేసింది. ప్రస్తుతం భారత్ నుంచి పాకిస్తాన్ కు రోడ్డు మార్గం ద్వారా వెళ్లడానికి ఇది ఒక్కటే మార్గం. అయితే ఇది మూతపడడంతో భారత్, పాకిస్తాన్ మధ్య పరిమితంగా ఉన్న రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అంతేకాదు, పాకిస్తాన్ భారతీయ విమానయాన సంస్థల కోసం తన గగనతలాన్ని మూసేసింది. దీంతో రెండు దేశాల మధ్య జరిగే వ్యాపారం కూడా పూర్తిగా స్తంభించిపోయింది.

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య తీసుకున్న ఈ చర్యల ద్వారా భారత్, పాకిస్తాన్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని స్పష్టంగా తెలుస్తోంది. అయితే స్వాతంత్య్రానికి ముందు భారతీయులు ఏయే మార్గాల ద్వారా పాకిస్తాన్‌కు వెళ్లేవారు? వాటిలో ఇప్పుడు ఎన్ని మార్గాలు మిగిలి ఉన్నాయి? ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారత్, పాకిస్తాన్ విభజన కూడా జరిగింది. ఒకే దేశం శాశ్వతంగా రెండు భూభాగాలుగా విడిపోయింది. ఆ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు రెండు పొరుగు దేశాల మంచిగా ఎప్పుడూ లేవు. దీనికి కారణం పాకిస్తాన్ ఇండియాలో నిరంతరం ఉగ్రవాద దాడులకు పాల్పడడం, నాలుగుసార్లు భారత్‌ను యుద్ధంలోకి నెట్టడం. నిరంతర ఉగ్రదాడులు, యుద్ధాల కారణంగా రెండు దేశాల మధ్య అగాధం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు భారత్, పాకిస్తాన్ మధ్య అటారీ-వాఘా సరిహద్దు ద్వారా జరిగే పరిమిత రాకపోకలు కూడా నిలిచిపోయాయి.

భారత్, పాకిస్తాన్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు ఉత్తరాన జమ్మూ కాశ్మీర్ నుండి గుజరాత్, పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని జీరో పాయింట్ వరకు విస్తరించి ఉంది. రెండు దేశాల మధ్య సరిహద్దు మొత్తం పొడవు 3323 కిలోమీటర్లు. పాకిస్తాన్‌తో సరిహద్దును పంచుకునే భారత రాష్ట్రాలలో జమ్మూ కాశ్మీర్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ఉన్నాయి. అంటే 1947కు ముందు ఈ రాష్ట్రాల నుండి భారత్, పాకిస్తాన్ మధ్య రోడ్డు మార్గం లేదా రైలు మార్గం ద్వారా రవాణా జరిగేది. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు నడుచుకుంటూనే పాకిస్తాన్‌కు వెళ్లి వచ్చేవారు.

భారత్, పాక్ విభజన తర్వాత రెండు దేశాల మధ్య వివాదాల కారణంగా రాకపోకల మార్గాలు క్రమంగా మూతపడుతూ వచ్చాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నాలు చాలానే జరిగాయి. ఈ ప్రయత్నాలలో భాగంగా థార్ ఎక్స్‌ప్రెస్, సంఝౌతా ఎక్స్‌ప్రెస్, బస్సు సేవలు కూడా ప్రారంభమయ్యాయి. కానీ సంబంధాల్లో ఉద్రిక్తతల కారణంగా ఈ సేవలు కూడా నిలిచిపోయాయి. భారత్, పాక్ మధ్య 1976లో సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలు సేవ ప్రారంభమైంది. ఈ రైలు భారతదేశంలోని అటారీ నుండి పంజాబ్‌లోని లాహోర్‌కు నడిచేది. కానీ ఇప్పుడు ఈ సర్వీసు కూడా నిలిచిపోయింది. దీనితో పాటు రాజస్థాన్‌లోని బార్మర్ నుండి పాకిస్తాన్‌లోని కరాచీ వరకు థార్ ఎక్స్‌ప్రెస్ కూడా నడిచేది. కానీ 1965లో భారత్-పాకిస్తాన్ యుద్ధం తర్వాత దీనిని కూడా మూసివేశారు. దీనితో పాటు ఢిల్లీ నుండి లాహోర్‌కు వెళ్లడానికి సదా-ఎ-సర్హాద్ బస్సు సర్వీసు కూడా ఉండేది. దానిని కూడా నిలిపివేశారు.

పహల్గామ్ దాడికి ముందు పాకిస్తాన్‌కు వెళ్లడానికి విమాన మార్గం, అటారీ-వాఘా సరిహద్దు ద్వారా పరిమిత రాకపోకలు ఉండేవి. కానీ ఈ దాడి తర్వాత పాకిస్తాన్ భారతదేశం కోసం తన గగనతలాన్ని మూసివేయడంతో విమాన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనితో పాటు అటారీ-వాఘా సరిహద్దు మూతపడటంతో రోడ్డు మార్గం కూడా పూర్తిగా మూసుకుపోయింది.