ఈ ఒక్క పాటతో పెళ్లి ఆగిపోయింది... అసలేం జరిగిందంటే?
ఒక పెళ్లి వేడుకలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. అంతా సంతోషంగా ఉన్న సమయంలో డీజే ప్లే చేసిన ఒకే ఒక్క పాట పెళ్లిని క్యాన్సిల్ అయ్యేలా చేసింది.
By: Tupaki Desk | 30 April 2025 10:12 AM ISTఒక పెళ్లి వేడుకలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. అంతా సంతోషంగా ఉన్న సమయంలో డీజే ప్లే చేసిన ఒకే ఒక్క పాట పెళ్లిని క్యాన్సిల్ అయ్యేలా చేసింది. ఇంతకీ ఆ పాట ఏమిటి? వరుడు ఎందుకు అంతలా స్పందించాల్సి వచ్చింది ? ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఒక పెళ్లిలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. డీజే 'చన్నా మేరేయా' అనే భావోద్వేగభరితమైన బాలీవుడ్ పాట ప్లే చేశాడు. దీంతో వరుడు ఒక్కసారిగా పెళ్లి వద్దంటూ క్యాన్సిల్ చేసుకున్నాడు. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమాలోని ఈ పాట అతడికి తన మాజీ ప్రేయసి జ్ఞాపకాలను తీవ్రంగా గుర్తు చేసింది. దీంతో అతడు భావోద్వేగానికి గురయ్యాడు.
ఆ పాట వరుడు మనసును తాకి, అతడి గత ప్రేమను గుర్తు చేసింది. తన భావాలను తట్టుకోలేకపోయిన అతడు అక్కడికక్కడే పెళ్లిని క్యాన్సిల్ చేయాలని నిర్ణయించాడు. దీంతో పెళ్లి బృందం (బారాత్) పెళ్లి కూతురు లేకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. బంధువులు ఎంత నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వరుడు విన లేదు.
ఈ ఘటన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వెంటనే వైరల్ అయింది. ఢిల్లీలో ఎక్కడ జరిగిందో ఖచ్చితమైన ప్రదేశం పేర్కొనప్పటికీ ఈ భావోద్వేగభరితమైన డ్రామా ఆన్‌లైన్‌లో లక్షలాది మంది దృష్టిని ఆకర్షించింది. విచిత్రం ఏంటంటే ఈ సంఘటనపై స్పందించిన వారిలో 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా దర్శకుడు కరణ్ జోహార్ కూడా ఉన్నారు. ఆ సినిమాలో ఓ పాట ఉంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆయన కేవలం "హహ్???" అని రాసుకొచ్చారు. ఈ విషయంపై సోషల్ మీడియా యూజర్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
