Begin typing your search above and press return to search.

బాబు పవన్ మోడీ : ఈ కాంబో వెరీ స్ట్రాంగ్ గురూ !

ఏపీలో రాజకీయం మారిపోయిందని కూటమి పట్ల వ్యతిరేకత వచ్చిందని తరచూ వైసీపీ అంటోంది.

By:  Tupaki Desk   |   3 May 2025 9:02 AM IST
బాబు పవన్ మోడీ  :  ఈ కాంబో వెరీ స్ట్రాంగ్ గురూ !
X

ఏపీలో రాజకీయం మారిపోయిందని కూటమి పట్ల వ్యతిరేకత వచ్చిందని తరచూ వైసీపీ అంటోంది. అంతే కాదు ఎపుడు ఎన్నికలు వచ్చినా తమదే విజయమని చెబుతోంది. అయితే వైసీపీ ఏ రకమైన అంచనాలు వేసుకుని ఈ విధంగా ధీమా పెంచుకుంటుందో తెలియదు కానీ ఏపీలో టీడీపీ కూటమి వెరీ స్ట్రాంగ్ గా ఉంది అని అంటున్నారు.

అమరావతిలో రాజధాని పనుల పునర్ నిర్మాణ కార్యక్రమంలో అది మరోసారి రుజువు అయింది అని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురూ త్రిమూర్తులు మాదిరిగా కూటమికి సారథ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురికీ వ్యక్తిగతంగా బ్రహ్మాండమైన ఇమేజ్ ఎవరికి వారికి ఉంది. అలాగే ముగ్గురికీ అభివృద్ధి మీద తపన ఉంది. ఒక విజన్ ఉంది.

రాజకీయాలకు అతీతంగా ఏపీని డెవలప్ చేయాలన్న కోరిక ఉంది. అది జనాలకు కూడా నచ్చుతోంది. అందుకే 2014, 2024లలో ఈ కాంబోని గెలిపించారు. దానికి తగినట్లుగానే అభివృద్ధిని కూడా ఈ ముగ్గురూ చూపిస్తున్నారు. పైగా జాతీయ స్థాయిలో తిరుగులేని స్థితిలో నరేంద్ర మోడీ ఉన్నారు. బలమైన రాజకీయ పక్షంగా బీజేపీ ఉంది. వ్యూహాలలో మోడీ దిట్ట.

ఇక ఏపీ సీఎం చంద్రబాబు సైతం విజనరీ మాత్రమే కాదు అపర చాణక్యుడు. ఎక్కడికి ఏది అవసరమో ముందే అంచనా కట్టి దాని ప్రకారం చేసుకుని పోవడంలో బాబుకు సాటి ఎవరూ లేరు. పవన్ జనాకర్షణ శక్తి కానీ ఆయన వెనక ఉన్న బలమైన సామాజిక వర్గం కానీ చూస్తే ఆయన రాజకీయ ఈక్వేషన్స్ ఎంత పవర్ ఫుల్ అన్నది అర్థం అవుతుంది.

మరి ఈ ముగ్గురూ కలసికట్టుగా ఉంటే ఓడించడం కష్టం అన్నది కూడా ఒక విశ్లేషణ. అంతే కాదు జనాలకు కూడా ఈ కాంబో బాగా నచ్చేదిగా ఉంది. మేము అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని జనవరిలో విశాఖలో జరిగిన సభలో నిరూపించిన ఈ నాయక త్రయం ఇపుడు అమరావతిలోనూ దానికే కొనసాగించారు.

ఇంతలా పెనవేసుకుని పోయిన ఈ రాజకీయ బంధాన్ని విడదీయడం ఎవరి వల్లా కాదనే అంటున్నారు. దానికి కారణం మోడీకి దక్షిణాదిన రాజకీయంగా ఏపీ ముఖ్యమైనది. ఆయన టీడీపీ జనసేనలతో కోరి వేరు చేసుకునే పరిస్థితి తెచ్చుకోరు ఆ మాటకు వస్తే 2018లోనూ బీజేపీ టీడీపీని వెళ్ళిపొమ్మనలేదు. ఇక బాబు కూడా గతానుభవాలను గుర్తుకు తెచ్చుకుని బీజేపీ వంటి బలమైన పార్టీతో మోడీ వంటి పవర్ ఫుల్ లీడర్ తో స్నేహాన్ని కంటిన్యూ చేయడానికే చూస్తున్నారు.

పవన్ కి బాబు అన్న మోడీ అన్నా ఒక రకమైన ఆరాధన భావం ఉంది. ఈ ఇద్దరి వల్లనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ఆయన బలంగా నమ్ముతారు. ఇక రాజకీయం కోసమో మరో దానికో ఆయన కోరి పొత్తులను చిత్తు చేసుకునే నైజం కాదు.

ఈ విధంగా ముగ్గురు నేతలూ పట్టుబట్టి కలసికట్టుగా ఉంటే ఈ కూటమిని బద్దలు కొట్టే సాహసం కానీ ఆ బలం కానీ ఎవరికి ఉంది అని అంటున్నారు. ఏపీకి కేంద్ర సాయం కావాలి. అలాగే అభివృద్ధి కావాలి. ఇది సగటు ఆంధ్రుల ఆలోచన. ఇపుడు ఆ విధంగా అంతా కలసి పనిచేస్తూంటే కాదనుకుని ఒంటరిగా ఉంటూ ఎవరి సాయం లేకుండా ఏపీని ఏలుతామని చెప్పే వైసీపీని ఎన్నుకునేందుకు జనాలు మొగ్గు చూపుతారా అన్నదే పెద్ద ప్రశ్న. సో ఏపీలో కూటమి వెరీ స్ట్రాంగ్ అన్నది వాస్తవం.