Begin typing your search above and press return to search.

కాకినాడ ఎంపీగా ముద్రగడ...?

మొత్తం మీద చూస్తే ముద్రగడ కుటుంబం వైసీపీతో కలసి ప్రయాణం చేస్తుంది అన్న వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి

By:  Tupaki Desk   |   28 July 2023 11:03 AM GMT
కాకినాడ ఎంపీగా ముద్రగడ...?
X

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాకినాడ నుంచి ఎంపీగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా. దానికి సంబంధించి తెర వెనక తతంగం పూర్తి అవుతోందా అంటే జవాబు అవును అనే వస్తోంది. ముద్రగడ విశాఖ వచ్చి వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్ తో భేటీ అయ్యారు. ఇద్దరూ చాలా సేపు అనేక విషయాలు ముచ్చటించుకున్నారు అని అంటున్నారు.

ముద్రగడ వైసీపీలో చేరేందుకు కూడా ముహూర్తం దగ్గపడింది అని ప్రచారం అయితే సాగుతోంది. వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం ద్వారా రాజకీయంగా క్రియాశీలం కావాలని ముద్రగడ భావిస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఇటీవల పవన్ కళ్యాణ్ కి కూడా ఇదె విషయం మీద సవాల్ చేశారు. పిఠాపురం నుంచి తాను పోటీకి దిగుతాను, పవన్ కూడా పోటీ చేయాలని కోరారు.

అంటే ముద్రగడకు ఎన్నికల్లో పోటీ చేయలని ఉందని అంటున్నారు. ఆయన దాని కోసం ఎంచుకున్న పార్టీ వైసీపీ అని అంటున్నారు. వైసీపీలో ముద్రగడకు రెడ్ కార్పెట్ పరచే సీన్ ఉందని అంటున్నారు. ముద్రగడ వస్తే కనుక ఆయన కోరుకున్న సీటు కూడా ఇస్తారని అంటున్నారు. కాకినాడ ఎంపీగా ప్రస్తుతం వంగా గీత ఉన్నారు. ఆమె వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని చూస్తున్నారు.

ఇక చలమలశెట్టి సునీల్ కూడా ఇపుడు వైసీపీలోనే ఉన్నారు. ఆయన 2014లో వైసీపీ నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2019లో టీడీపీ నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత మళ్లీ వైసీపీలో చేరారు. కానీ ఆయన ఈసారి ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని చూస్తున్నారని అంటున్నారు.

ఆయన జగ్గంపేట సీటు మీద కర్చీఫ్ వేశారని తెలుస్తోంది. దాంతో ఎటు నుంచి చూసినా కూడా కాకినాడ లోక్ సభ సీటు వైసీపీలో ఖాళీగా ఉంది. ఇక ముద్రగడ కూడా పార్లమెంట్ కే వెళ్లాలని చూస్తున్నారని అంటున్నారు. ఆయన వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి గా జగన్ ప్రభుత్వంలో చేరడమే చేయాలి.

మళ్ళీ గెలిస్తే సీనియర్లకు మంత్రి పదవులు జగన్ ఇవ్వకపోవచ్చు అన్న టాక్ కూడా ఉంది. దాంతో ఎంపీగా గెలిచి పార్లమెంట్ కి వెళ్లడం ద్వారా తన పెద్దరికానికి గౌరవం మర్యాద ఉంటాయని ముద్రగడ పద్మనాభం భావిస్తున్నారు అని తెలుస్తోంది.

దాంతో ఆయనకు కాకినాడ లోక్ సభ సీటు ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు. నూటికి తొంబై శాతం ముద్రగడ ఎంపీగా పోటీకి దిగుతారు అని అంటున్నారు. ఒక వేళ ఏ కారణం చేతనైనా ఆయన కనుక డ్రాప్ అయితే ఆయన కుమారుడు పిఠాపురం నుంచి కానీ కాకినాడ రూరల్ నుంచి కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉండొచ్చు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ముద్రగడ కుటుంబం వైసీపీతో కలసి ప్రయాణం చేస్తుంది అన్న వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి. దీని మీద రానున్న కొద్ది రోజులలో వాస్తవాలు ఏంటి అన్నవి తెలుస్తాయని అంటున్నారు.