Begin typing your search above and press return to search.

కాకినాడ మత్స్యకారుల మిస్సింగ్ మిస్టరీ : రెండు బోట్లు వెళ్తే.. తిరిగొచ్చింది ఒక్కటే!

కాకినాడ జిల్లాకు చెందిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ నెల 4న రెండు బోట్లలో చేపల వేటకు వెళ్లగా, ఒక బోటు ఈ నెల 18న తిరిగొచ్చింది. సింహాద్రి బోటు మాత్రం ఆచూకీ లేకుండా పోయింది. దీంతో కోస్ట్‌గార్డ్, నేవీ బృందాలు గాలింపు చేపట్టాయి. బోటు ఆచూకీ కోసం బంగ్లాదేశ్, మయన్మార్‌కు కూడా సమాచారం అందించారు.

By:  Tupaki Desk   |   24 Nov 2026 11:31 PM IST
కాకినాడ మత్స్యకారుల మిస్సింగ్ మిస్టరీ : రెండు బోట్లు వెళ్తే.. తిరిగొచ్చింది ఒక్కటే!
X

కాకినాడ జిల్లాకు చెందిన ఆరుగురు మత్స్యకారుల గల్లంతు సమాచారం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. కాకినాడ తీరం నుంచి రెండు బోట్లలో బయలుదేరిన మత్స్యకారుల్లో ఒక బృందం క్షేమంగా తిరిగి రాగా, మరొక బోటు ఆచూకీ లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే అప్రమత్తమైంది. కోస్ట్ గార్డ్, నేవీ బృందాలను రంగంలోకి దింపి మత్స్య కారుల కోసం ముమ్మరంగా గాలిస్తోంది. నెల రోజులకు సరిపడా సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు ఈ నెల 14వ తేదీ వరకు కుటుంబ సభ్యులతో ఫోన్ లో అందుబాటులో ఉండేవారని అంటున్నారు. ఆ తర్వాత నుంచి ఏ సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులలో ఆందోళన మొదలైందని చెబుతున్నారు.

సుబ్బంపేట గ్రామానికి చెందిన గరికాని సింహాద్రి (తండ్రి మాములు) బోటుతో పాటు మరో పడవలో మత్స్యకారులు ఈ నెల 4న చేపల వేట కోసం బయలుదేరారు. ఒడిశాలోని పారాదీప్ వైపు వీరి ప్రయాణం సాగింది. పారాదీప్ తీరానికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలోని లోతట్టు సముద్ర జలాల్లోకి వీరు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే, వేటకు వెళ్లిన రెండు బోట్లలో ఒక పడవ ఈ నెల 18న సురక్షితంగా తిరిగి తీరానికి చేరుకోగా, సింహాద్రి బోటు మాత్రం తిరిగి రాలేదు.

బోటు ఆచూకీ లేకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు మరుసటి రోజు అంటే ఈ నెల 19న కోస్ట్‌గార్డ్ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు సైతం అదే రోజు రాత్రి కోస్ట్‌గార్డ్‌కు లేఖ రాసి తక్షణమే గాలింపు చర్యలు చేపట్టాలని కోరారు. దీంతో కాకినాడ, పారాదీప్ కోస్ట్‌గార్డ్ విభాగాలు, చెన్నైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ (MRCC) సంయుక్తంగా వేట ప్రారంభించాయి. మంగళవారం (నవంబర్ 24) కాకినాడ కోస్ట్‌గార్డ్ అధికారులు బాధిత కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై, బోటు ప్రయాణించిన మార్గం, చివరి సారిగా ఏ ప్రాంతంలో వేట సాగించిందనే పూర్తి వివరాలను సేకరించారు.

గల్లంతైన బోటులో సోరాడ కొండల్రావు, గుంపల ప్రకాశు, తిర్రి నారాయణ, సోరాడ చిన్న, మెరుగు నారాయణ, కండల రాము అనే ఆరుగురు మత్స్యకారులు ఉన్నారు. అయితే, ఆ బోటులో సుమారు 1,500 లీటర్ల డీజిల్‌తో పాటు 30 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సముద్రంలో ఎక్కడ చిక్కుకున్నా, ఇంధనం ఆహార నిల్వలు అందుబాటులో ఉన్నందున వారంతా క్షేమంగానే ఉంటారని బంధువులు గట్టిగా నమ్ముతున్నారు.

కుటుంబ సభ్యులు సూచించిన సముద్ర ప్రాంతాల్లో భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ బృందాలు ముమ్మరంగా గాలించినప్పటికీ ఇప్పటివరకు పడవ జాడ దొరకలేదు. ఇటీవల ఏర్పడిన తుఫాను ప్రభావం వల్ల బోటు దిశ తప్పి, ఇతర దేశాల సముద్ర జలాల వైపు కొట్టుకుపోయి ఉండే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ కోణంలోనే బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు సైతం సమాచారం అందించి, అన్ని మార్గాల ద్వారా అన్వేషణ సాగిస్తున్నారు. తమ వారు ఎక్కడున్నా క్షేమంగా తిరిగి రావాలని సుబ్బంపేట గ్రామంలోని బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా వేడుకుంటున్నాయి.