Begin typing your search above and press return to search.

టీసీఎస్ లో మరో వివాదం... కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు!

ఇందులో భాగంగా ఈ సంస్థ ఉద్యోగుల విషయంలో అనైతికంగా వ్యవహరిస్తుందని పేర్కొంటూ కేంద్ర కార్మిక శాఖకు ఐటీ వర్కర్స్ యూనియన్‌ ఫిర్యాదు చేసింది.

By:  Tupaki Desk   |   16 Nov 2023 9:43 AM GMT
టీసీఎస్  లో మరో వివాదం... కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు!
X

గతకొన్ని రోజులుగా ప్రముఖ టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది! ఇందులో భాగంగా ఇప్పటికే లంచం తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారనే కుంభకోణం వెలుగులోకి రావడం, ఈ ఆరోపణలతో 19 మంది ఉన్నతస్థాయి ఉద్యోగుల్ని తొలగించినట్లు టీసీఎస్‌ తెలపడం తెలిసిందే. వీరికి ఆ స్కాంలో పాత్ర ఉన్నట్లు నిర్ధారించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ సమయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది.

అవును... టీసీఎస్ సంస్థ కు సంబంధించిన మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఈ సంస్థ ఉద్యోగుల విషయంలో అనైతికంగా వ్యవహరిస్తుందని పేర్కొంటూ కేంద్ర కార్మిక శాఖకు ఐటీ వర్కర్స్ యూనియన్‌ ఫిర్యాదు చేసింది. దీంతో ఇప్పుడు ఈ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇంత పెద్ద సంస్థపై వరుసగా ఇలాంటి వివాదాలు రావడం చర్చనీయాంశం అయ్యింది.

ఈ నోటీసులుల్లో ఐటీ వర్కర్స్ యూనియన్ కీలక విషయం వెల్లడించింది. ఇందులో భాగంగా తగిన నోటీసులు ఇవ్వకుండా.. సంప్రదింపులేమీ జరపకుండానే సుమారు 2వేల మంది ఉద్యోగుల్ని వివిధ నగరాలకు బలవంతంగా బదిలీ చేసిందని.. ఫలితంగా ఆయా ఉద్యోగులకు, వారి కుటుంబాలకు తీవ్ర వేదన మిగిల్చిందని ఐటీ వర్కర్స్ యూనియన్‌ పేర్కొంది.

అందుతున్న సమాచారం ప్రకారం... ఆగస్ట్‌ నెల చివరిలో తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సుమారు 2వేల మంది ఉద్యోగులకు టీసీఎస్‌ ఈమెయిల్స్‌ పంపింది. అందులో వారిని బదిలీ చేస్తున్నట్లు, ఈ బదిలీ ఉత్తర్వుల మెయిల్ అందిన రెండు వారాల్లో కేటాయించిన స్థానాలకు వెళ్లాలని సూచించింది. ఇదే సమయలో ఉద్యోగుల ప్రయాణ, వసతి ఖర్చులను కంపెనీ పాలసీ ఆధారంగా చెల్లిస్తామని చెప్పింది. ఈ ఆదేశాల్ని పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఇలా మెయిల్స్ అందుకున్న 2000 మందిలో సుమారు 180 మంది ఉద్యోగులు ఐటీ వర్కర్స్ యూనియన్‌ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో... సరైన నోటీసు లేదా సంప్రదింపులు లేకుండా బలవంతపు బదిలీలు చేస్తున్నారని.. దీనివల్ల తమకు, కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుందని ఆరోపించారు. ఈ 180 మంది ఉద్యోగుల ఫిర్యాదుతో కేంద్ర కార్మిక శాఖను ఆశ్రయించింది ఐటీ వర్కర్స్ యూనియన్!

ఈ విషయాలపై స్పందించిన ఐటీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ హర్‌ ప్రీత్ సింగ్ సలూజా... ఈ బలవంతపు బదిలీలు ఉద్యోగులకు ఎన్నో ఇబ్బందులు కలిగించడంతోపాటు.. తీవ్ర ఒత్తిడి నెలకొంటుందని.. ఈ విషయాలను కంపెనీ పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. ఈ క్రమంలో... టీసీఎస్‌ ఉద్యోగుల హక్కులను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ కార్మిక శాఖను కోరినట్లు తెలిపారు!

ఈ తాజా పరిణామాలతో సంస్థలోని కొంతమంది ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని తెలుస్తుంది. అయితే... ఆదేశాలు పాటించని వారి విషయంలో కఠిన చర్యలు తప్పవన్నట్లుగా కంపెనీ కూడా సీరియస్ టోన్ లోనే రియాక్ట్ అవుతుందని తెలుస్తుంది. మరి ఈ వ్యవహారం ఎలా కొలిక్కి వస్తుందనేది వేచి చూడాలి!