టీసీఎస్ సగం సగం పనులు... ఉద్యోగులకు కొత్త తలనొప్పులు!
గత కొంత కాలంగా టీసీఎస్ పై పలు వివాదాలకు సంబంధించిన కథనాలొస్తున్న సంగతి తెలిసిందే!
By: Tupaki Desk | 23 July 2025 5:00 PM ISTగత కొంత కాలంగా టీసీఎస్ పై పలు వివాదాలకు సంబంధించిన కథనాలొస్తున్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా.. దేశీయ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) లో లంచాలకు ఉద్యోగాలు అనే కుంభకోణం జరిగిందని.. ఇందులో భాగంగా భారీ ఎత్తున ముడుపులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని గతంలో సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే!
ఆ తర్వాత కాలంలో... సంప్రదింపులేమీ జరపకుండానే సుమారు 2వేల మంది ఉద్యోగుల్ని వివిధ నగరాలకు బలవంతంగా బదిలీ చేసిందని.. ఫలితంగా ఆయా ఉద్యోగులకు, వారి కుటుంబాలకు తీవ్ర వేదన మిగిల్చిందని ఐటీ వర్కర్స్ యూనియన్ టీసీఎస్ పై మండిపడింది! ఇలా రకరకాల వివాదాలు అప్పట్లో వినిపించిన వేళ.. తాజాగా ఉద్యోగులకు సంబంధించిన మరో విషయం తెరపైకి వచ్చింది!
అవును... వివిధ కంపెనీల్లో రెండు నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉన్న ఉద్యోగులకు టీసీఎస్ కొలువులు ఆఫర్ చేసి.. అనంతరం జాయినింగ్ డేట్లు మాత్రం ఇవ్వడం లేదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్ సుఖ్ మండవీయాకు బాధితులు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఈ సందర్భంగా నాస్ సెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనెట్ (ఎన్.ఐ.టీ.ఈ.ఎస్.) ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసింది.
ఈ సందర్భంగా... సుమారు 600 మంది అనుభవం ఉన్న వ్యక్తులకు ఆఫర్ లెటర్లు ఇచ్చిన సంస్థ.. జాయినింగ్ లో మాత్రం ఎడతెగని జాప్యం చేస్తోందని ఆ లేఖలో పేర్కొంది. సదరు ఉద్యోగులు ఆర్థిక, మానసిక, వృత్తిపరంగా దెబ్బతింటున్నారని ఆందోళన వ్యక్తంచేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది!
ఇదే సమయంలో... ఆ అభ్యర్థుల జాయినింగ్ డేట్లకు సంబంధించి కచ్చితంగా టైమ్ లైన్ ప్రకటించేలా జోక్యం చేసుకోవాలని కార్మిక శాఖను కోరిన ఎన్.ఐ.టీ.ఈ.ఎస్... జాప్యానికి తగిన ఆర్థిక పరిహారం కూడా ఇప్పించాలని, టీసీఎస్ ఎంప్లాయిస్ అసిస్టెంట్ ప్రోగ్రాం ద్వారా అభ్యర్థులు కోలుకొనేటట్లు సాయం చేయాలని కోరింది. దీనిపై తాజాగా టీసీఎస్ స్పందించింది!
ఈ వ్యవహారంపై టీసీఎస్ స్పందించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇందులో భాగంగా... తాము ఇచ్చిన అన్ని ఆఫర్లను పూర్తి చేస్తామని.. అది ఫ్రెషర్స్ అయినా, అనుభవజ్ఞులైనా.. టీసీఎస్ నుంచి ఆఫర్ లెటర్ అందుకొన్న ప్రతిఒక్కరూ కంపెనీలో ఉంటారని తెలిపింది! అయితే.. తమ వ్యాపారం డిమాండ్ ఆధారంగా జాయినింగ్ డేట్లు ఆధారపడి ఉంటాయని పేర్కొంది.
ఈ సందర్భంగా స్పందించిన ఎన్.ఐ.టీ.ఈ.ఎస్. అధ్యక్షుడు, ముంబై హైకోర్టు న్యాయవాది హర్ ప్రీత్ సింగ్ సలుజా... ఈ ఆలస్యం వల్ల అభ్యర్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో... అటు ఆర్థికంగానూ, ఇటు వృత్తిపరంగానూ కుంగిపోతున్నారని అన్నారు!
