Begin typing your search above and press return to search.

వర్కు ఫ్రం హోం ఇచ్చిన కంపెనీల ఆదాయాలపై కొత్త సర్వే చదవాల్సిందే

వర్కు ఫ్రం హోం సౌకర్యాన్ని ఉద్యోగులకు ఇచ్చిన కంపెనీలు ఆదాయాలు భారీగా పెరిగినట్లుగా తెలిపింది.

By:  Tupaki Desk   |   16 Nov 2023 3:59 AM GMT
వర్కు ఫ్రం హోం ఇచ్చిన కంపెనీల ఆదాయాలపై కొత్త సర్వే చదవాల్సిందే
X

కరోనా పుణ్యమా అని.. ఐటీ కంపెనీల్లో అప్పుడప్పుడు వినిపించే వర్క్ ఫ్రం హోం మాట ఇంటిమాటగా మారిపోవటం తెలిసిందే. ఐటీ కంపెనీలు మాత్రమే కాదు.. జీవితంలో ఇలాంటి మాట వింటామా? అనుకున్న ఎన్నో రంగాలకు చెందిన కంపెనీలు సైతం వర్కు ఫ్రం హోం అవకాశాన్ని ఉద్యోగులకు ఇవ్వటం చూశాం. అయితే.. కరోనా ఎపిసోడ్ తర్వాత చాలా కంపెనీలు ఈ అవకాశాన్నితీసేశాయి. కొన్ని కంపెనీలు తమ పాలసీకి భిన్నంగా ఉందంటూ తీసేస్తే.. మరికొన్ని సంస్థలపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా వెల్లడైన ఒక సర్వే ఆసక్తికర విషయాల్నివెల్లడించింది. వర్కు ఫ్రం హోం సౌకర్యాన్ని ఉద్యోగులకు ఇచ్చిన కంపెనీలు ఆదాయాలు భారీగా పెరిగినట్లుగా తెలిపింది. ఇటీవల కాలంలో సుదీర్ఘ కాలంపాటు వర్కు ఫ్రం హోం వసతి ఇవ్వటం ద్వారా కంపెనీ ఉత్పాదకత తగ్గుతుందన్న వాదనలో పస లేదని తేల్చేసింది. రిమోట్ వర్కింగ్ కు అవకాశం ఇచ్చిన కంపెనీల ఆదాయాల్లో గణనీయమైన వ్రద్ధి ఉన్న విషయాన్ని వెల్లడించింది.

ప్రముఖ కన్సెల్టెన్సీ సంస్థ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్.. ఫ్లెక్స్ వర్క్ అడ్వైజర్ స్కూప్ టెక్నాలజీస్ కలిసి నిర్వహించిన సర్వేలో వెల్లడైన అంశాలు ఆసక్తికరంగానే కాదు.. వర్క్ ఫ్రం హోం ఆశించే ఉద్యోగులకు స్వీట్ న్యూస్ గా మారాయని చెప్పాలి. ఇటీవల కాలంలో సరికొత్త వాదన వినిపిస్తున్న కంపెనీలు ఆత్మశోధన చేసుకునేలా వివరాలు ఉన్నాయి.

టెక్నాలజీ నుంచి బీమా వరకు దాదాపు ఇరవై రంగాల్లో విస్తరించి ఉన్న కంపెనీలు ఈ సర్వేలో పాలు పంచుకున్నాయి. మొత్తం 554 కంపెనీలు ఇందులో పాల్గొనగా.. ఈ కంపెనీల్లో 2.67కోట్ల మంది ఉద్యగులు ఉన్నట్లుగా లెక్క కట్టారు. ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే సౌకర్యాన్ని అందిస్తూ.. అవసరమైనప్పుడు మాత్రమే ఆఫీసుకు వచ్చే వీలు ఉన్న కంపెనీల విక్రయాలు 21 శాతం పెరిగినట్లుగా గుర్తించారు. వీరికి భిన్నంగా హైబ్రిడ్ (వారంలో కొద్ది రోజులు ఇంటి నుంచి.. మరికొన్ని రోజులు ఆఫీసు నుంచి) పని చేసే సంస్థలు.. పూర్తి స్థాయి ఆఫీసుకు వచ్చి మాత్రమే పని చేయాలన్న కండీషన్ పెట్టిన సంస్థల్లో గ్రోత్ రేట్ కేవలం 5 శాతానికే పరిమితమైనట్లుగా గుర్తించారు.

ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ విధానాల్ని అమలు చేస్తున్న కంపెనీల్లో తనకు అవసరమైన ఉద్యోగుల్ని వేగంగా రిక్రూట్ చేసుకోవటమేకాదు.. సదరు సిబ్బంది ఆయా కంపెనీల్లో ఎక్కవ కాలం పని చేస్తున్నట్లుగా తేల్చారు. ఈ కారణం వల్లే కంపెనీల ఆదాయాలు సైతం పెరుగుతున్నట్లుగా భావిస్తున్నారు. వారంలో ఒక రోజు ఆఫీసులో ఉండి.. మిగిలిన రోజులు ఇంటి నుంచి పని చేసే వారు అత్యంత స్ఫూర్తివంతంగా ఉన్నట్లుగా వెల్లడించారు. ఈ తరహా కంపెనీల్లో ఉండటం వల్ల తమ కెరీర్ లక్ష్యాల్ని సైతం చేరుకుంటున్నట్లుగా ఉద్యోగులు భావిస్తున్నట్లు చెప్పారు. ఈ రిపోర్టు తర్వాత ఐటీ కంపెనీల ఐడియాలజీ మారుతుందా? అన్నదిప్పుడు ఆసక్తికర అంశంగాచెప్పక తప్పదు.