Begin typing your search above and press return to search.

న్యూఇయర్ వేళ షాకింగ్ రిపోర్టు: భారీ లేఆఫ్ లు తప్పవట

ఉద్యోగాల కోసం రెజ్యూమ్ లు తయారు చేసుకునే వారికి సాయంగా నిలిచే 'రెజ్యూమ్ బిల్డర్' జరిపిన తాజా సర్వేలో కొత్త అంశాలు వెలుగు చూశాయి.

By:  Tupaki Desk   |   29 Dec 2023 12:30 AM GMT
న్యూఇయర్ వేళ షాకింగ్ రిపోర్టు: భారీ లేఆఫ్ లు తప్పవట
X

కొత్త సంవత్సరానికి కౌంట్ డౌన్ మొదలైంది. మరో మూడు రోజుల్లో వచ్చేస్తున్న కొత్త సంవత్సరం తీసుకొచ్చే ఉత్సాహం కంటే టెన్షనే ఎక్కువగా ఉంది. 2024లో ఆర్థిక మాంద్యం పీక్స్ కు వెళుతుందని.. పలు సంస్థలు లేఆఫ్ లుభారీగా ప్రకటించే వీలుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా తాజాగా ఒక సంస్థ విడుదల చేసిన తాజా సర్వే రిపోర్టు టెన్షన్ పుట్టించేలా మారింది. ఉద్యోగాల కోసం రెజ్యూమ్ లు తయారు చేసుకునే వారికి సాయంగా నిలిచే 'రెజ్యూమ్ బిల్డర్' జరిపిన తాజా సర్వేలో కొత్త అంశాలు వెలుగు చూశాయి.

ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో పలు కంపెనీలు పాల్గొన్నాయి. తాజాగా విడుదల చేసిన రిపోర్టు ప్రకారం చూస్తే.. ఈ సర్వేలో పాల్గొన్న ప్రతి పది కంపెనీల్లో దాదాపు నాలుగు కంపెనీలు 2024లో ఉద్యోగుల్ని తొలగించే వీలుందన్న విషయాన్ని వెల్లడించినట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. సగానికి పైగా కంపెనీలు 2024లో హైరింగ్ ఫ్రీజ్ ను అమలు చేయాలని భావిస్తున్నట్లుగా తెలపటం గమనార్హం.

ఇంతకూ లేఆఫ్ లు ఎందుకు? అన్నప్రశ్నకు వివిధ సంస్థలు ఇచ్చిన సమాధానాల్ని చూస్తే..

- మాంద్యం పరిస్థితులు

- టెక్నాలజీ

అంటూ రెండు కారణాల్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. తాము తొలగించే ఉద్యోగాల స్థానే ఏఐ సాంకేతికతను వినియోగించటం ద్వారా విలువైన వనరుల్ని కాపాడుకోవచ్చని పేర్కొంటున్నట్లుగా తెలిపారు. ఏఐ యాడ్ టెక్ కు అనుకూలంగా గూగుల్ తన యాడ్ సేల్స్ యూనిట్లలో 30వేలమంది ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు.

2023లో తమ కంపెనీలు 30 శాతానికి పైగా సిబ్బందిని తొలగించినట్లుగా చెప్పిన సంస్థలు.. కొత్త సంవత్సరంలోనూ మరో 30 శాతం సిబ్బందిని తగ్గించుకోనున్నట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఈ లేఆఫ్ లు అన్ని కంపెనీల్లోనూ ఒకేలా ఉండవని స్పష్టం చేస్తున్నారు. మధ్యతరహా కంపెనీల్లో 42 శాతం.. పెద్ద కంపెనీల్లో 39 శాతం.. చిన్నకంపెనీల్లో మాత్రం 28 శాతం మత్రమే లేఆఫ్ లు ఉంటాయని వెల్లడించారు. ఇంతకూ లేఆఫ్ లు ప్రకటించే కంపెనీలు ఏవేం ఉంటాయన్న దానిపైనా ఆసక్తికర వివరాల్ని వెల్లడయ్యాయి.

నిర్మాణ.. సాఫ్ట్ వేర్ కంపెనీలు వరుసగా 66 శాతం.. 65 శాతం చొప్పున సిబ్బందిని తొలగించే వీలుందని చెబుతున్నారు. ఇన్ఫర్మేషన్.. రిటైల్.. ఫైనాన్స్.. బీమా కంపెనీల్లో మాత్రం లేఆఫ్ లపై కొంత కన్ఫ్యూజన్ ఉందని చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ సంస్థల్లో లేఆఫ్ లపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. లేఆఫ్ లు ఉంటాయి కానీ.. ఎంతమేర ఉంటాయన్న దానిపై మాత్రంస్పష్టత లేదని చెప్పాలి.