ఐటీ క్రేజ్ తగ్గుతోందా? 2026లో హాట్ కేకుల్లాంటి ఉద్యోగాలివే!
గడిచిన పదేళ్ల కాలంలో చాలామంది సివిల్ ఇంజనీర్లు సాఫ్ట్‌వేర్ వైపు మళ్ళారు. కానీ 2026లో పరిస్థితి తలకిందులైంది.
By: Madhu Reddy | 19 Feb 2026 10:09 AM ISTఒకప్పుడు సక్సెస్ అంటే ఇంజనీరింగ్ చేయడం, ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించడమే అనుకునేవాళ్లం. కానీ 2026 నాటికి ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. 'ఇన్డీడ్' తాజా నివేదిక ప్రకారం, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కన్నా హెల్త్‌కేర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మేనేజ్‌మెంట్ రంగాల్లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కోడింగ్‌కే పరిమితం కాకుండా, సమాజానికి అవసరమైన విభిన్న రంగాల్లో స్థిరమైన, అధిక ఆదాయం వచ్చే కెరీర్ వైపు యువత అడుగులు వేస్తోంది. మందలో వెళ్లే కాలం పోయి, స్పెషలైజేషన్‌కు పట్టాభిషేకం జరుగుతోంది. మరి ఆ రంగాలు గురించి తెలుసుకుందాం..
డాక్టర్లదే హవా.. ముఖ్యంగా చర్మ నిపుణులకు కాసుల వర్షం:
ప్రస్తుతం భారతీయ ఉద్యోగ మార్కెట్‌లో హెల్త్‌కేర్ రంగం అగ్రస్థానంలో నిలిచింది. ఆశ్చర్యకరంగా, అందరినీ వెనక్కి నెట్టి డెర్మటాలజిస్టులు (చర్మవ్యాధి నిపుణులు) అత్యధిక డిమాండ్ ఉన్న జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే వీరి నియామకాలు 182% పెరగడం విశేషం. మధ్యతరగతి ప్రజలు తమ అందం, చర్మ సంరక్షణ కోసం వెచ్చిస్తున్న ఖర్చే దీనికి ప్రధాన కారణం. కేవలం వారే కాకుండా సర్జన్లు, మెడికల్ ఆఫీసర్ల జీతాలు కూడా ఇప్పుడు టాప్ ఐటీ ప్యాకేజీలకు గట్టి పోటీ ఇస్తున్నాయి. చదువుకున్నాక సెటిల్ అవ్వడానికి ఐటీ ఒక్కటే మార్గం కాదు, వైద్య రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని ఈ ఏడాది గణాంకాలు నిరూపిస్తున్నాయి.
దేశ నిర్మాణం అంటే ఐటీ కాదు.. సివిల్ ఇంజనీర్ల రీ-ఎంట్రీ:
గడిచిన పదేళ్ల కాలంలో చాలామంది సివిల్ ఇంజనీర్లు సాఫ్ట్‌వేర్ వైపు మళ్ళారు. కానీ 2026లో పరిస్థితి తలకిందులైంది. దేశవ్యాప్తంగా సాగుతున్న హైవేలు, మెట్రో రైళ్లు, భారీ గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం వల్ల సివిల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లు, రియల్ ఎస్టేట్ నిపుణులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇది కేవలం పనులు పూర్తి చేయడం మాత్రమే కాదు, ప్రాజెక్టును సమర్థవంతంగా డిజైన్ చేసి, బాధ్యతగా డెలివరీ చేసే అనుభవజ్ఞులైన నిపుణులకు కంపెనీలు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. ఇక కంపెనీ బాధ్యతను భుజాన వేసుకునే లీడర్ల కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి కంపెనీలు కూడా సిద్ధంగా ఉన్నాయి.
డిగ్రీల కంటే మెరుగైన కోర్సులు ముఖ్యం:
ఈ మార్పు ఒక రకంగా మన దేశానికి చాలా మంచిది. ప్రతిభ అంతా ఒక్క ఐటీ రంగానికే పరిమితం కాకుండా, అన్ని రంగాలకు విస్తరించడం వల్ల ఆర్థిక వ్యవస్థ సమతుల్యంగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం ఒక పాపులర్ కోర్సు చదివేసి ఉద్యోగం వచ్చేస్తుందనుకుంటే పొరపాటే. ఏ రంగంలోనైనా లోతైన పట్టు ఉన్నవారికే విజయం దక్కుతుంది. పైథాన్ డెవలపర్ వంటి ఐటీ ఉద్యోగాలు ఇంకా ఉన్నప్పటికీ, ఇప్పుడు అవి ఇతర రంగాలతో సమానంగా మారాయి. కాబట్టి యువత మందలో వెళ్లకుండా, తమకు నచ్చిన రంగంలో ప్రత్యేకత సాధిస్తే 2026 నుంచి వచ్చే పదేళ్ల కాలం మీదే అవుతుంది.
