Begin typing your search above and press return to search.

జూమ్ మీట్.. గూగుల్ గ్రూప్ కాల్ అంటేనే ఉద్యోగుల్లో వణుకు

అమెజాన్.. గూగుల్ లాంటి సంస్థలు కూడా ఉద్యోగుల కోతల్ని కంటిన్యూ చేస్తున్నాయి. ఐటీ ఉద్యోగుల తొలగింపు గత ఏడాది మొదలైన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Feb 2024 10:30 AM GMT
జూమ్ మీట్.. గూగుల్ గ్రూప్ కాల్ అంటేనే ఉద్యోగుల్లో వణుకు
X

ఆఫీసుకు వచ్చామా? ఇంటికి వెళ్లామా? వరకు ఓకే. రెగ్యులర్ గా జరిగే మీటింగ్ లతోనూ ఇబ్బంది లేదు. అందుకు భిన్నంగా.. రోటీన్ కు సంబంధం లేకుండా ఏదైనా కీలకమైన మీటింగ్ అని చెప్పినా.. ఉద్యోగులంతా గూగుల్ గ్రూప్ కాల్ లోకి రావాలన్నా.. జూమ్ మీటింగ్ కు హాజరవ్వాలంటూ మొయిల్ వస్తే చాలు ఉద్యోగులు వణికిపోతున్న వైనం తాజాగా ఎక్కువైంది. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు షాకింగ్ గా మారుతున్నాయి.

అంచనాలకు ఏ మాత్రం అందని రీతిలో కొన్ని కంపెనీల నిర్ణయాలు వణుకు తెప్పిస్తున్నాయి. అమెరికాలోని ''ఫ్రంట్ డెస్కు'' అనే స్టార్టప్ సీఈవో తన ఉద్యోగులందరికి గూగుల్ మీట్ ఏర్పాటు చేశారు. 200 మంది ఉద్యోగులున్న సదరు కంపెనీలోని వారంతా తమ బాస్ ఏదో గుడ్ న్యూస్ చెబుతారంటూ ఎక్సైట్ అయ్యారు. కట్ చేస్తే.. గ్రూప్ కాల్ మొదలైన కొన్ని సెకన్లలోనే ఉద్యోగులందరికి తీసేస్తున్నట్లుగా పేర్కొని.. గ్రూప్ కాల్ నుంచి వెళ్లిపోయారు. కొన్ని నిమిషాలకు వరకు అసలేం జరిగిందో అర్థం కాని పరిస్థితి ఆ సంస్థ ఉద్యోగులకు ఎదురైంది.

ఇదే తరహాలో ''బెటర్.కామ్'' అనే మరో సంస్థ ఆన్ లైన్ లో తాకట్టు సేవల్ని అందిస్తూ ఉంటుంది. తన రియల్ ఎస్టేట్ విభాగంలోని ఉద్యోగులందరిని తీసేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి జూమ్ కాల్ ను ఎంపిక చేసుకుంది. ఇలా గ్రూప్ కాల్ ఏర్పాటు చేసి.. ఉద్యోగుల్ని తీసేస్తున్న వైనం అమెరికాలో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. చిన్న కంపెనీల సంగతి ఇలా ఉంటే.. దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగాల్ని కోసేస్తున్న తీరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

అమెజాన్.. గూగుల్ లాంటి సంస్థలు కూడా ఉద్యోగుల కోతల్ని కంటిన్యూ చేస్తున్నాయి. ఐటీ ఉద్యోగుల తొలగింపు గత ఏడాది మొదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి పరిస్థితుల్లో మెరుగు వస్తుందని భావించినా అలాంటిదేమీ లేకపోగా.. కోతలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. గత ఏడాది అమెరికాలో 2.4 లక్షల ఐటీ ఉద్యోగుల్ని జాబ్స్ నుంచి తొలగించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 32వేల ఉద్యోగాలు పోయినట్లుగా తెలుస్తోంది.

ఒక్క ఐటీ రంగమే కాదు దాని అనుబంధ రంగాల్లోనూ ఉద్యోగుల్ని తీసేస్తున్న తీరు ఎక్కువ అవుతోంది. ఎందుకిలా? అంటే.. కొవిడ్ తర్వాత పెద్ద ఎత్తున రిక్రూట్ మెంట్లు చేయటం.. ఆ తర్వాత పరిస్థితులు రావటం.. కొత్త సాంకేతికతతో చాలా పనులు సులువుగా అయిపోతుండటంతో పాటు..అధిక వడ్డీరేట్లు.. ఆర్థిక సమస్యలు.. బడ్జెట్లలో కోత.. అనుకున్న స్తాయిలో ప్రాజెక్టులు రాకపోవటం లాంటి పరిణామాలతో అనూహ్య పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐటీకి అనుబంధంగా ఏఐలో పట్టు సాధించటం చాలా అవసరమంటున్నారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఐటీ సేవల్లో పని చేసే వారు ఎఐ.. మెషిన్ లెర్నింగ్.. క్లౌడ్.. బ్లాక్ చైన్ లాంటి కొత్త టెక్నాలజీల మీద పని చేయనిపక్షంలో ఇబ్బందులు తప్పవంటున్నారు. తమ నైపుణ్యాల్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇప్పటికి యూఎస్ లో ఈ తీరు ఎక్కువగా ఉంటే.. ఇండియాలోనూ ఇప్పటికే మొదలైంది. కాకుంటే అక్కడున్నంత దారుణ పరిస్థితులు లేవు. అయితే.. భవిష్యత్తు ఎలా ఉంటుందన్న దానిపై సానుకూలతలు లేని నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.