Begin typing your search above and press return to search.

సిబిల్ స్కోరు బాగోకపోతే ఈ ఉద్యోగాలు రావు?

ఇకపై బ్యాంకుల్లో ఉద్యోగం కావాలంటే డిగ్రీలతో పాటు మంచి క్రెడిట్ స్కోర్ సైతం ఉండాలని చెబుతోంది.

By:  Tupaki Desk   |   19 Aug 2023 2:45 AM GMT
సిబిల్  స్కోరు బాగోకపోతే ఈ ఉద్యోగాలు రావు?
X

సాధారణంగా ఉద్యోగం సంపాదించాలంటే ఏమి ఉండాలి? ముందు ఆ ఉద్యోగానికి కావాల్సిన విద్య, వయస్సు అర్హతలు ఉండాలి. అనంతరం పోటీపరీక్షలో క్వాలిఫై అవ్వాలి.. ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలి. అవన్నీ తర్వాత.. ఇకపై ఈ ఈ రంగంలో ఉద్యోగం కావాలంటే డిగ్రీలు మాత్రమే కాదు క్రెడిట్ స్కోర్ కూడా తప్పనిసరి!

అవును... లోన్లు కట్టకపోయినా, క్రెడిట్ కార్డు బిల్లు సక్రమంగా చెల్లించకపోయినా ఉద్యోగాలు రావని అంటోంది ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ - ఐబీపీఎస్! ఇందులో భాగంగా... ఇకపై బ్యాంకుల్లో ఉద్యోగం కావాలంటే డిగ్రీలతో పాటు మంచి క్రెడిట్ స్కోర్ సైతం ఉండాలని చెబుతోంది.

ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహా దేశంలోని ప్రభుత్వ బ్యాంకులన్నింటికీ ఉద్యోగ నియామకాలకు ఐబీపీఎస్ పోటీ పరీక్షలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా 2023- 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రొబెషనరీ ఆఫీసర్స్ (పీఓ) పోస్టుల నియామక నోటిఫికేషన్ ఇటీవలే జారీ చేసింది.

ఈ క్రమంలో ఎవరైతే ఈ బ్యాంకు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారో.. ఆయా అభ్యర్థుల క్రెడిట్ స్కోరు కూడ్దా బాగా ఉండాలని ఐబీపీఎస్ తన నోటిఫికేషన్‌ లో నిబంధన పెట్టింది. అంతకు ముందు విడుదల చేసిన క్లరికల్ నోటిఫికేషన్‌ లోనూ క్రెడిట్ స్కోర్ నిబంధన పెట్టింది.

ఈ నిబంధనల ప్రకారం... బ్యాంకు ఉద్యోగానికి ఎంపికై ఉద్యోగంలో చేరే సమయానికి అభ్యర్థుల సిబిల్ స్కోర్ కనీసం 650 ఆపైన ఉండాలి. అయితే.. సిబిల్ స్కోర్ మినిమం ఎంత ఉండాలి అనే దాన్ని బ్యాంకులు తమ విధానాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండే అవకాశం ఉంది.

చదువుల కోసం విద్యార్థులు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటుంటారు. అయితే.. ఇలాంటి వారిలో కొందరు అప్పులు సరిగ్గా తీర్చడం లేదనే ఉద్దేశంతో బ్యాంకు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు క్రెడిట్ స్కోర్‌ ను ఒక ప్రామాణికంగా పెట్టినట్లు తెలుస్తోంది.

కాగా... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016 నుంచే అభ్యర్థులకు క్రెడిట్ స్కోర్ తప్పనిసరి చేసింది. తమ బ్యాంకులో పని చేసే వారి క్రెడిట్ హిస్టరీ బాగా ఉండాలని చెబుతోంది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇక క్రెడిట్ స్కోర్ అనేది 300 నుంచి 500 మధ్య ఉంటే చాలా అధ్వాన్నంగా ఉన్నట్లు.. 500 నుంచి 650 మధ్య ఉంటే తక్కువగా ఉన్నట్లు. అదే 650 నుంచి 750 ఉంటే బాగుందని.. 750 నుంచి 900 స్కోర్ ఉంటే అద్భుతంగా ఉందని అర్ధం. ఇలా స్కోరు 750 పైన ఉంటే బ్యాంకులు సులువుగా తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తుంటాయి.