Begin typing your search above and press return to search.

ఏపీలో పెరిగిన స్టార్టప్ లు.. ఈ మాట చెప్పిందెవరంటే?

ఐదేళ్ల జగన్ సర్కారులో ఏపీలో స్టార్టప్ లు ఎంతగా పెరిగాయన్న విషయం తాజాగా వెల్లడైంది

By:  Tupaki Desk   |   10 Feb 2024 8:30 AM GMT
ఏపీలో పెరిగిన స్టార్టప్ లు.. ఈ మాట చెప్పిందెవరంటే?
X

ఐదేళ్ల జగన్ సర్కారులో ఏపీలో స్టార్టప్ లు ఎంతగా పెరిగాయన్న విషయం తాజాగా వెల్లడైంది. 2019తో పోలిస్తే ఇప్పటికి ఏపీలో స్టార్టప్ లు పెద్ద ఎత్తున పెరగటంతో పాటు.. ఉపాధి అవకాశాలు పెరిగిన వైనాన్ని తాజాగా డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (పొట్టిగా చెప్పాలంటే డీపీఐఐటీ) వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం ఏపీలో స్టార్టప్ ల సంఖ్య భారీగా పెరిగినట్లుగా పేర్కొన్నారు.

2019లో ఏపీలో 161 స్టార్టప్ లు ఉండగా తాజాగా ఆ సంఖ్య 586కు పెరిగాయి. ఈ కారణంగా వీటిల్లో ప్రత్యక్షంగా పని చేసే వారి సంఖ్య సైతం పెరిగింది. ఐదేళ్ల వ్యవధిలో మూడు రెట్లు పెరిగిన స్టార్టప్ ల కారణంగా.. ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య 2019లో 1552 మంది ఉండా.. తాజాగా ఆ సంఖ్య 5669 మందికి పెరిగింది.

గత ప్రభుత్వం ఇంక్యుబేషన్ సెంటర్ పేరుతో ప్రచారానికి మాత్రమే పరిమితం కాగా.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టార్టప్ ల ప్రోత్సహానికి అనేక చర్యల్ని చేపట్టారు. స్టార్టప్ లకు అవగాహన కలిగించటం.. మెంటారింగ్.. ఫండింగ్.. ఇండస్ట్రీ కనెక్ట్ లతో పాటు కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకునేలా సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలను ఏరపాటు చేశారు.

దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో స్టార్టప్ ల ప్రోత్సహానికి అనేక చర్యల్ని చేపట్టారు. తొలి నాలుగో తరం పారిశ్రామిక రంగం ఇండస్ట్రీకి కల్పతరువు పేరుతో విశాఖలో ఏర్పాటు చేవారు. నాస్కామ్ సాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ .. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల స్టార్టప్ ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను విశాఖలో ఏర్పాటు చేశారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేయటం ద్వారా పలు స్టార్టప్ లు ఏర్పాటు అవుతున్న పరిస్థితి ఏపీలో నెలకొంది.